ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం: ద్వివేది

ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం: ద్వివేది
x

గోపాలకృష్ణ ద్వివేది

Highlights

నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిసేపటికే జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనానికి తెరతీశారు. సంచలనాత్మక రీతిలో ఎన్నికల నగారా మోగించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం కోరిన గంటల్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది.

ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవ జరుగుతోంది. దీనిపై హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టం చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం తమ నిర్ణయానికి కట్టుబట్టారు. సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.

నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిసేపటికే జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ నిర్వహించామని నిమ్మగడ్డ రమేష్‌కు సీఎస్‌ వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడాన్ని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే అని చెప్పారు. కొవిడ్ టీకా ప్రక్రియలో ఉన్నామని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం మొండివైఖరితో ముందుకెళ్తోందని విమర్శించింది. గతేడాది మార్చి 15న ఒకే కరోనా కేసున్నా స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని జి.కె. ద్వివేది చెప్పారు. ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తోందని చెప్పారు.

ఇక, ఎన్నికల కమిషన్‌ ప్రొసీడింగ్స్‌పై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యే జోగి రమేష్ సుప్రీంకోర్టుకు వెళతామని చెబుతున్నారు. నిమ్మగడ్డ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల అంశం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ, కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమే.

Show Full Article
Print Article
Next Story
More Stories