నేటి నుంచి గడప గడపకు వైసీపీ

Gadapa Gadapaku YSRCP Will Start from Today | Andhra News
x

నేటి నుంచి గడప గడపకు వైసీపీ

Highlights

YCP: ప్రతి ఇంటికీ వెళ్లనున్న ప్రజాప్రతినుధులు

YCP: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు గ్రౌండ్‌ వర్క్‌ పూర్తయ్యింది. రానున్న ప్లీనరీ లోపు పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యేలా ఓ వైపు కసరత్తు కొనసాగుతుండగా మరోవైపు నేటి నుంచి గడప గడపకు YSRCP కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్ల నియామకం పూర్తయ్యింది. మరోవైపు మిగిలిన అనుబంధ సంఘాలు, పార్టీ కార్యవర్గంతో పాటు క్షేత్ర స్థాయిలో గ్రామ, మండల, బూత్‌ లెవెల్‌ కమిటీల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతోంది. జిల్లా, రీజనల్, అనుబంధ సంఘాల బాధ్యతలు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి అప్పజెప్పడంతో ఆయన చురుగ్గా కమిటీల నియామకం, పార్టీ క్యాడర్‌ లో నూతనోత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు జూలై 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్పీపీ ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. కోవిడ్‌ కారణంగా 2020లో జరగాల్సిన ప్లీనరీ జరగలేదు. దీంతో ఈసారి ఘనంగా నిర్వహించేందుకు స్కెచ్‌ లు వేస్తున్నారు. పైగా ఇదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించే దిశగా కసరత్తులు మొదలుపెట్టారు. ఈ మూడేళ్ల కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పే బాధ్యత ఎమ్మెల్యేలపై పెట్టారు జగన్.

ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లే కార్యక్రమానికి రూట్‌ మ్యాప్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరితో టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించి నేటి నుంచి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభించాలని పార్టీ నేతలకు దిశనిదేశం చేశారు. దీనిలో భాగంగానే కావాల్సిన ఇన్‌పుట్‌ అంతా పార్టీ నుంచి అందించారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories