తిరుపతిలో నరకయాతన పడుతున్న ఉచిత దర్శనం భక్తులు.. చేతులెత్తేసిన టీటీడీ...

Free Darshan Devotees Facing Many Problems in Tirumala Tirupati because of  Online Time Slot Process
x

తిరుపతిలో నరకయాతన పడుతున్న ఉచిత దర్శనం భక్తులు.. చేతులెత్తేసిన టీటీడీ...

Highlights

TTD: టైం స్లాట్ దొరికే దాకా తిరుపతిలో ఉండాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చు...

TTD: కష్టాలు చెప్పుకునేందుకు వెంకన్న పాదాలు దర్శించుకుందామని వచ్చిన భక్తులను కొండంత కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఉచిత దర్శనాలకు సైతం ఆన్ లైన్లో టైం స్లాట్ విధానం పెట్టడంతో.. వారి టైం వచ్చేదాకా తిరుపతిలోనే వెయిట్ చేయక తప్పని పరిస్థితులు తలెత్తాయి. అప్పటిదాకా అక్కడే ఉండాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చవుతోంది. ఇక్కడే భక్తులు యాచకులుగా మారే దుస్థితిని TTD చేజేతులా కల్పించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ముందుచూపుతో వ్యవహకరించకపోవడంతో స్వామి వారి భక్తులు ఇక్కట్ల పాలు కావాల్సి వస్తోంది.

దేవుడి ముందు అందరూ సమానమేనని అన్నమయ్య చెప్పినా... టీటీడీ లేనిపోని ఆంక్షలు, పరిమితులు విధించడంతో భక్తులకు మానసిక క్షోభను మిగులుస్తోంది. టైం స్లాట్ విధానం పేరుతో తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులను కొండకిందే నిలువరించాలనే ప్రయత్నం బెడిసి కొడుతోంది. కోవిడ్ నుంచి క్షేమంగా బయట పడినందుకు తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకోవాలనుకున్న భక్తులకు నిత్యం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

ఆన్ లైన్ టైం స్లాట్ విధానాలు వర్కవుట్ కాదని నెత్తీనోరు మొత్తుకున్నా... టీటీడీ వినని ఫలితంగా భక్తులు రోజుల తరబడి పిల్లా పాపలతో రోడ్లను ఆవాసంగా చేసుకుని పడిగాపులు కాయాల్సి వస్తోంది. కోట్ల రూపాయలు కానుకలిచ్చే భక్తులపై కన్నేసిన టీటీడీ... ముడుపులు కట్టి మొక్కులు మొక్కే వారి వ్యథలు కంటికి కానరాకుండా పోయింది. ఉచిత దర్శనాల విషయంలో టీటీడీ విధించిన ఆంక్షలు సామాన్య భక్తులను ఇక్కట్లకు గురి చేస్తోంది. కొన్నిసార్లు తిరుపతి యాత్రకు వచ్చిన వారు యాచించాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తోంది.

కోవిడ్ నుంచి కోలుకున్న తొలి రోజులలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలికంగా చేపట్టిన విధానాన్నే శాశ్వతంగా మార్చే ప్రయత్నం చేసేస్తోంది. అదే జరిహితే సామాన్య భక్తుల గతి అదోగతే. గతంలో తిరుమలకు వచ్చిన భక్తులను నేరుగా క్యూలైన్లలోకి అనుమతించేది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనం అందుబాటులో ఉన్నా... అది కేవలం సిఫారసు మీద కొంత మందికే అవకాశం కల్పించేది. అయితే కోవిడ్ నేర్పిన గుణపాఠాలు టీటీడీ ఆర్థిక సోపానాలుగా మార్చుకుంది. ముడుపు సంగతి దేవుడెరుగు ముందుగా టిక్కెట్టు లేనిదే స్వామి దర్శనం లేదన్న చందంగా వ్యవహరించింది.

రెండేళ్ళ కోవిడ్ దెబ్బనుంచి కోలుకోవడానికి కొత్త పంథాను అనుసరించింది. దీంతో కోవిడ్ నుంచి సాధారణ పరిస్థితులు వచ్చాక కూడా చాలా రోజులు 300 రూపాయలు చెల్లించిన వారికే దర్శనం కల్పించే విధానం అమలు చేసింది. టీడీడీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉచిత దర్శనాలను కూడా అనుమతించింది. అవి కూడా ఆన్ లైన్లో టైం స్లాట్ విధానం ద్వారా టిక్కెట్టు పొందిన వారికే దర్శనమని మెలిక పెట్టింది. ఇది అన్ని సమయాలలో అందరికీ సాధ్యం కాదని ప్రాక్టికల్ గా తెలుసుకున్నాక తాత్కాలిక ప్రాతిపదికన తిరుపతిలో ఉచిత టిక్కెట్టును టైం స్లాట్ విధానంలో ఇచ్చే పద్దతికి శ్రీకారం చుట్టింది.

టైం స్లాట్ ప్రకారం ఒక్కో భక్తుడికి నిర్ధిష్టమైన దర్శన సమయాన్ని ముందుగానే టీడీడీ కేటాయిస్తుంది. ఆ సమయానికి భక్తులు కొండకు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు తిరుమల కొండకు అనుమతి ఉండదు. ఇది ఆన్ లైన్ విధానంలో టిక్కెట్టు పొందిన వారి విషయంలో కొంత వర్కవుటై ఉచిత దర్శనం కోసం వచ్చే వారి విషయంలో మాత్రం వైఫల్యమౌతోంది. ఉచిత దర్శన టోకెన్లను కేటాయించడానికి తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ అంతటితో చేతులు దులిపేసుకునింది. రోజుకు ఆరు వేల మంది యాత్రికులతో మొదలు పెట్టి 30 వేల మందికి ఉచిత టైం స్లాట్ టోకెన్లు ఇస్తోంది. అక్కడే అసలు సంగతి మరిచింది.

గతంలో తిరుమలకు వెళ్ళిన వారు నేరుగా క్యూలైన్లలోకి వెళ్ళే వారు. రోజుకు 70వేల మందికి పైగా దర్శనాలు చేసుకునేవారు. ఒక్కో రోజు లక్షమంది భక్తులు కూడా దర్శనం చేసుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాలలోనూ రెండు రోజుల నుంచి మూడు రోజుల లోపు దర్శనం అయ్యేది. ఎలాంటి పరిస్థితులలోనైనా 72 గంటలు మించకుండా స్వామి దర్శనం చేయించేవారు. అప్పటి వరకు క్యూలైన్ లో భక్తులకు టీటీడీ పాలు, నీళ్ళు, ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేది. క్యూలైన్లు మొదలుకొని కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు ఏ కొదవా ఉండేది కాదు.

ఎండకు, వానకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది కాదు. పేదవారు ప్రత్యేకంగా గదులు లేకపోయినా ఉచితంగా అందుబాటులో ఉన్న బాత్ రూముల వద్ద స్నానపానాలు ముగించుకుని కంపార్ట్ మెంట్లలోకి వెళ్లిపోయే వారు. వందల మైళ్ళు నడిచి అలసి సొలసిన వారు ఎందరో ఉచిత టోకెన్ కోసం ఓ పోరాటమే చేయాల్సి వస్తోంది. వందలమైళ్ళ దూరం భక్తితో నడిచిన వారికి ఇదేనా టీటీడీ ఇచ్చే సత్కారం. కోవిడ్ నుంచి కోలుకుని పాత రోజులు రాగానే పాత విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన టీటీడీ ఆ మాట మరిచింది. నడక దారి భక్తులకు ఉన్న సౌకర్యాన్ని లేకుండా చేసింది. చంటి బిడ్డల కోసం ఉన్న వెసులుబాటును విస్మరించింది.

వయో వృద్దులకు ఇచ్చే మర్యాద మసకబారింది. ప్రత్యేక ప్రతిభావంతులపై దయ లేకుండా పోయింది. వారిలో డబ్బులు పెట్టుకోగలిగిన స్థోమత ఇన్న వారికి మాత్రమే 300రూపాయల టిక్కెట్టు తో దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ తీసుకొచ్చిన నయా టైం స్లాట్ విధానాన్నే శాశ్వత ప్రాతిపదికన అమలు చేయాలని అధికారులు ధృడంగా భావిసస్తున్నారు. టైం స్లాట్ ద్వారా టిటిడికి ఆదాయం వస్తుందేమో!.. 300రూపాయలిచ్చి టిక్కెట్ బుక్ చేసుకున్న భక్తులు టైంకు వచ్చి వెళ్తారేమో!.. సామాన్య, అతి సమాన్య భక్తులు మాత్రం స్వామి దర్శనానికి దూరం అవుతారన్న సత్యాన్ని మాత్రం టిటిడి గుర్తించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories