రైతుగా మారిన రాజకీయనేత

రైతుగా మారిన రాజకీయనేత
x

రైతుగా మారిన రాజకీయనేత

Highlights

గల్లీ కార్యకర్త కూడా కాలర్‌ ఎగిరేసే రోజులివి. చిన్నా చితక నాయకులు సైతం స్వరం గరం చేసే కాలమిది. కానీ ఓ జననాయకుడు సింప్లీసిటీకి నిలువెత్తు నిదర్శనం....

గల్లీ కార్యకర్త కూడా కాలర్‌ ఎగిరేసే రోజులివి. చిన్నా చితక నాయకులు సైతం స్వరం గరం చేసే కాలమిది. కానీ ఓ జననాయకుడు సింప్లీసిటీకి నిలువెత్తు నిదర్శనం. మంత్రి పదవులు అనుభవించారు. జాతీయ పార్టీకి రథసారధిగా వ్యవహరించారు. కర్ణాటక రాజకీయాలను శాసించారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారు. ఆయన ఎక్కడకు వెళ్లినా చుట్టూ మంది మార్బలం. జేజేలు పలికే జనం.. నిమిషం కూడా ఖాళీ లేని రాజకీయ జీవితం. కానీ ఇప్పుడాయనది సాదాసీదా జీవితం. పాలిటిక్స్‌ వదిలిపెట్టి, పొలం బాట పట్టారు. చుట్టూ అనుచరులు లేరు. మాజీ మంత్రిని అన్న దర్పం కనిపించదు. రాజకీయనేతను అన్న గర్వం కానరాదు. ఇంతకీ జనమెచ్చిన నాయకుడు, జనంతో కలిసి జీవిస్తున్న ఆ నాయకుడు ఎవరూ అనుకుంటున్నారా లెట్స్ వాచ్‌ దిస్‌ స్టోరీ.

ట్రాక్టర్‌తో ఓ రైతు పొలం దున్నుతున్నాడు కదా.. ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఎస్‌.. మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఏదో ఫోటోకు ఫోజు ఇచ్చి చేతులు కడుక్కునే నాయకుడు కాదు ఈయన. వ్యవసాయమే జీవితంగా మార్చుకున్నారు. పాలిటిక్స్‌ను వదిలిపెట్టి పొలం పనుల్లో బిజీ అయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రఘువీరా రెడ్డి ఓ వెలుగు వెలిగారు. పలు శాఖలకు పదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. అనంతపురం జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించారు. కార్ణాటకలోనూ తన మార్క్‌ చూపించారు. కానీ ఇప్పుడాయన రాజకీయాలకు దూరంగా స్వగ్రామం నీలకంఠపురానికి పరిమితమయ్యారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ, పశువులను సాకుతూ హాయ్‌గా కాలం వెల్లదీస్తున్నారు.

జాతీయ, రాష్ట్ర నేతలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించిన రఘువీరారెడ్డి ఇప్పుడు గ్రామస్తుల కబుర్లు వింటూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కలిసి బుద్ధిమాటలు చెబుతున్నారు. పైగా గ్రామంలో పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం, వేంకటేశ్వర స్వామి దేవాలయాల నిర్మాణం చేపట్టారు.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి రఘువీరా రెడ్డి రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మంత్రి పదవి చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు సార్లు మంత్రిగా కొనసాగారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలనలోనూ రఘువీరారెడ్డి క్రీయశీలక మంత్రిగా వెలుగొందారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం సీఎం అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరు కూడా వినిపించందంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో అర్థం చేసుకోవచ్చు.

రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా అభివృద్ధిలో తన మార్కును చూపించారు. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన అనంతరం మడకశిర ఎస్ సీ రిజర్వ్ కావడంతో ఆయన కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కళ్యాణదుర్గం రూపురేఖలనే మార్చేశారు. రింగురోడ్డు, రైల్వే స్టేషన్, నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తారు రోడ్డు వంటి శాశ్వాత నిర్మాణాలు చేపట్టారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి రఘువీరా రెడ్డి తొలి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో పెనుకొండ, 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత రాజకీయాలకు స్వస్తి చెబుతూ పీసీసీ పదవీకి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి స్వగ్రామంలో సింపుల్‌ లైఫ్‌ స్టైల్‌కి అలవాటుపడ్డారు.

దశాబ్ధాలుగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఒక్క సారిగా సైడ్‌ అవ్వడానికి కారణాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ కరువైంది. ఇప్పట్లో పార్టీ పుంజుకోవడం కష్టమే అందుకే రఘువీరా రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. కానీ త్వరలో ఆయన మళ్లీ చురుకైన రాజకీయాల్లో పాల్గొంటారని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు రాజకీయ సన్యాసం తీసుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రఘువీరారెడ్డి పొలిటికల్‌ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు ఆ జిల్లా నేతలు.


Show Full Article
Print Article
Next Story
More Stories