Floods in AP: కోలుకోని కోనసీమ.. వరదతో తప్పని ఇబ్బందులు

Floods in AP: కోలుకోని కోనసీమ.. వరదతో తప్పని ఇబ్బందులు
x
Highlights

Floods in AP:వరద గోదావరి కోనసీమను కకావికలం చేసిందనే చెప్పాలి. ఎప్పుడూ పచ్చగా ఆహ్లాదంగా కనిపించే సీమ నేడు వరద, బురదతో దర్శనమిస్తోంది.

Floods in AP:వరద గోదావరి కోనసీమను కకావికలం చేసిందనే చెప్పాలి. ఎప్పుడూ పచ్చగా ఆహ్లాదంగా కనిపించే సీమ నేడు వరద, బురదతో దర్శనమిస్తోంది. ఈ వరద వల్ల వేల మంది నిరాశ్రయులయ్యారు. అధిక శాతం మంది ఆహార పొట్లాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గోదావరి శాంతించినా ధవలేశ్వరం వద్ద వరద కొనసాగుతూనే ఉంది.

వరద గోదావరి శాంతించింది. గంటగంటకూ తగ్గుముఖం పడుతోంది. అయితే, భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినా, ధవలేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఇక్కడనుంచి 20 లక్షల క్యుసెక్కులకు పైగా వరద నీరు కోనసీమను ముంచెత్తుతోంది. అంతకంతకూ వందలాది లంకగ్రామాలను వరద చుట్టుముడుతోంది. దీంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. రాత్రి అయ్యేసరికి ముంపు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 26 మండలాలు వరదలో చిక్కుకున్నట్లు అధికారులు ప్రకటించారు. వరద ప్రభావిత గ్రామాలు 168గా తేల్చారు. 81,506 మందిని వరద బాధితులుగా గుర్తించారు. వరద కొనసాగుతుండడంతో రానున్న రెండు రోజుల్లో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏజెన్సీతోపాటు పలులంకగ్రామాల్లో వందలసంఖ్యలో పూరిగుడిసెలున్నాయి. అయితే, నష్టం లెక్కింపులో డాబాఇళ్లనే అధికారులు లెక్కల్లోకి తీసుకుంటున్నారు. ప్రాథమిక అంచనాప్రకారం ఇప్పటికి 21,192 ఇళ్లు మునిగినట్లు గుర్తించారు.

కోనసీమ అంటే అతిథిమర్యాదలకు పెట్టింది పేరు. ఎవరొచ్చినా కడుపునిండా భోజనం వడ్డించకుండా వదలరు. అలాంటిది ఇప్పుడు వరదతో వేలాది మంది కోనసీమ వాసులు కనీసం ఒకపూటి భోజనానికి కూడా నోచుకోవడం లేదు. లంకల్లో వరదతో చాలా మంది మిద్దెలు, మేడలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సగానికిపైగా మునిగిపోయిన ఇళ్ల వద్దకు వెళ్లడానికి అధికారులు కూడా సాహసించడం లేదు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా? అని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలు కొట్టుకుపోయాయి. రాత్రయితే వీరంతా చీకట్లోనే గడుపుతున్నారు. కొన్నిచోట్ల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినా భోజనం అందడం గగనంగా మారింది. చాలీచాలనీ అన్నంతో ఎందరో సరిపెట్టుకుంటున్నారు. లెక్కల్లో లక్షకుపైగా ఆహారప్యాకెట్లు పంచినట్లు అధికారులు చూపిస్తున్నా అందేది మాత్రం అరకొర మందికే.

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద నీటిమట్టం కొంత తగ్గినా, వరద ఉధృతి కొనసాగుతోంది. గరిష్ఠంగా 10-15 అడుగుల వరకు వచ్చిన వరద ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. పోలవరంలో వరద నీరు లీకేజీలను దాదాపు అడ్డుకోగలిగారు. దీంతో గ్రామంలో చేరిన వరద నీటిని మోటార్‌ల ద్వారా బయటకు తోడి పోస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద ఉన్న 19 గ్రామాల్లో పరిస్థితి అత్యంతదారుణంగా ఉంది. కోండ్రుకోట, మాధాపురం, టేకూరు, శివగిరిలోతట్టు గ్రామస్థులు కొండగుట్ల మధ్య టెంటుల్లో గడుపుతున్నారు. వరదల కారణంగా ఎక్కడ చూసినా చెట్లు, పుట్టలకు పాములే వేలాడుతున్నాయి. కొండ చిలువలూ చెట్లలో చిక్కుకుని కనిపిస్తున్నాయి.

ఉద్యాన పంటలకు కోనసీమ పెట్టింది పేరు. వందలాది లంకల్లో అరటి, బొప్పాయి, మునగ, కూరగాయ పాదులు, తమలపాకు పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. అనేక తోటలు కొట్టుకుపోయాయి. అలాగే, కొబ్బరితోటల్లో వేలాది ఎకరాల్లో అంతర పంటలు సాగవుతున్నాయి. దీంతో నష్టం ఎంతనేది లెక్కించడం ఉద్యానశాఖకు సాధ్యం కావడం లేదు. 20వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories