ముఖ్యమంత్రుల తొలి సంతకాలు... వైఎస్‌తో మొదలైన ట్రెండ్

First signatures of Chief Ministers A trend that started with YS
x

ముఖ్యమంత్రుల తొలి సంతకాలు... వైఎస్‌తో మొదలైన ట్రెండ్

Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం పేరుతో చంద్రబాబునాయుడు సభలు నిర్వహించారు. చిత్తూరు, నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం ముగింపు సభల్లో ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెగా డీఎస్ సీ ఫైల్ పై సంతకం పెడతానని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారంగా ఇదే ఫైలుపై గురువారం నాడు ఆయన సంతకం చేస్తారు.

ప్రజాగళంలో చేసిన ప్రామిస్...

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం పేరుతో చంద్రబాబునాయుడు సభలు నిర్వహించారు. చిత్తూరు, నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం ముగింపు సభల్లో ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసే ఫైలుపై రెండో సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 13న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయంలో ఈ ఫైళ్లపై సంతకాలు పెడతారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను నెలకు నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై కూడా సంతకం చేస్తారు.

రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రైతుల రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అలా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఇప్పుడు అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ... ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీల అధినేతలు సీఎం అయితే తమ తొలి సంతకం ఫలానా ఫైలు మీదే అని చెప్పడం ఓ ట్రెండ్ గా మారింది.

తొలి సంతకాల ట్రెండ్ సెట్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి

ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వ్యక్తి ఏదో ఒక ఫైలు మీద మొదటి సంతకం చేస్తారు. సాధారణంగా ప్రజలను ఆకట్టుకునే నిర్ణయాలపై మొదటి సంతకం ఉంటుంది. ఎన్టీఆర్ 1983లో ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం, మధ్యాహ్న భోజన పథకం ఫైల్స్ మీద సంతకాలు చేశారు. అయితే, ఎన్నికల ప్రచారంలోనే “తొలి సంతకం ఆ ఫైలు మీదే” అని హామీ ఇచ్చే ట్రెండ్ తెలుగునాట వైఎస్ రాజశేఖరరెడ్డితో మొదలైందని అనుకోవచ్చు.

2004లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి తమ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైలు మీదే చేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలపై హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. 2004 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి... ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం లాల్ బహదూర్ స్టేడియంలో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ వైఎస్.. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే ఎల్ బీ స్టేడియంలో రేషన్ బియ్యాన్నిఒక్కో కుటుంబానికి 21 నుండి 30 కిలోలకు పెంచిన ఫైల్ మీద మొదటి సంతకం చేశారు. ఉచిత విద్యుత్ ను రైతులకు 7 గంటల నుండి 9 గంటలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రెండో సంతకం చేశారు.

తండ్రి బాటలో వైఎస్ జగన్

వైఎస్ జగన్ 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పెన్షన్లను మూడు వేలకు పెంచుతూ తీసుకున్న ఫైలుపై తొలి సంతకం చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాల్లో కూడా ఈ అంశాన్ని చేర్చారు. ఈ హామీలో భాగంగా పెన్షన్లు పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు.

ట్రెండ్ కొనసాగించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దివ్యాంగురాలు రజనికి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

జాతీయ స్థాయిలో మోదీ కూడా...

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేందుకు మోదీ సర్కార్ పీఎం కిసాన్ నిధి ఫైలుపై సంతకం చేశారు.

ప్రజలను ఆకట్టుకొనేందుకు ఎన్నికల ప్రచారంలో పార్టీలు తొలి సంతకాల విషయమై హమీలు ఇస్తుంటారు. ఈ హమీలు కొన్నిసార్లు ఆయా పార్టీలకు కలిసి వస్తాయి. ఈ సారి చంద్రబాబు మెగా డిఎస్సీ హామీ ఎన్నికల ప్రచారంలో బాగా ట్రెండ్ అయింది. నిరుద్యోగ సమస్యపై యువతలో పెల్లుబికిన నిరసనే అందుకు కారణమనే అభిప్రాయాలు వినిపించాయి. నాయకులు ఇచ్చే హామీలు, ప్రజలు కోరుకునే అంశాలతో సింక్ అయినప్పుడు అవి ఎన్నికల్లో ట్రెండ్ అవుతుంటాయి. దాంతో, నాయకులు తమ టాప్ హామీ ఏమిటో ప్రజలకు బలంగా చెప్పడానికి... తొలి సంతకం నినాదాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ బాటలోనే ఇప్పుడు చంద్రబాబు మెగా డీఎస్సీపై సంతకం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories