ఆయన మొన్నటి టీడీపీ ప్రభుత్వంలో నెంబర్ టూ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు తర్వాత...
ఆయన మొన్నటి టీడీపీ ప్రభుత్వంలో నెంబర్ టూ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు తర్వాత అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర. సొంత జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. రాత్రి పగలు పనిచేస్తూ ప్రజల్లో చీకటి మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 25 ఏళ్ల పాటు బిహైండ్ ది స్క్రీన్‌గా టీడీపీలో ఉన్న ఆయన, తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజాతీర్పులో వెనుకబడ్డారు. అంతే ఒక్కసారిగా ఆయన మౌనం వహించారు ఇంతకీ ఎవరా మంత్రి ఎందుకా మౌనం ఆ సైలెన్స్‌లోనూ రీసౌండ్ చేస్తున్న అర్థాలేమైనా ఉన్నాయా?
తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ తేడాతో ఓడిన ఆయనే మాజీమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన నారాయణ. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మౌనముద్రలో మునిగిపోయిన నారాయణ. రాష్ట్రంలో రాజ్యాధికారానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్, రాజధాని నిర్మాణం, ప్రజావేదిక కూల్చివేత సహా అనేక ఆరోపణలు చేస్తున్నా, ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ తరుణంలో గత పాలకులు చేసిన అనేక కార్యక్రమాల్లో అవినీతి ఉందని పదేపదే ఆరోపణలు గుప్పిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. అవినీతి కట్టడాలను కూల్చేస్తోంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, ఒకప్పుడు వీటన్నింటి నిర్మాణంలో తనదైన ముద్రవేసిన మాజీ మంత్రి నారాయణ మాత్రం, మౌనం వహిస్తున్నారు. ఎవరెన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా సైలెన్స్ పాటిస్తున్నారు.
ఇంతకీ మాజీ మంత్రి నారాయణ మౌనం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఎన్నికల తరువాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడానికి కారణమేంటి? నారాయణ భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
2014 ఎన్నికల వరకు తెరవెనుక ఉండి రాజకీయాలు చేసిన నారాయణ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. విద్యాసంస్థల అధిపతిగా ఉన్న ఆయన్ను చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేశారు. విద్యా సంస్థలు, వైద్యరంగ సంస్థల నిర్వహణలో అనుభవం ఉన్న నారాయణ, ఒక్కసారిగా రాష్ట్ర మంత్రిగా పదవి చేపటడ్డంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. రాజకీయ అనుభవంలేని ఈయన ఏం చేస్తారులే అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా దూకుడుగా వ్యవహరించారు నారాయణ. రాజకీయ క్షేత్రంలో వడివడిగా అడుగులు వేస్తూ, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.
ముఖ్యమంత్రి తరువాతి స్థానం తనదే అన్న ముద్ర వేసుకున్నారు నారాయణ. అందుకు అనుగుణంగానే అప్పటి సీఎం చంద్రబాబు, ఏపీ నూతన రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. సీఆర్డీఏ ఛైర్మన్‌గా చేశారు. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. విదేశాలు తిరిగి, వివిధ దేశాల రాజధానులను క్షుణంగా పరిశీలించి, రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలో భూములు సేకరించడం దగ్గర నుంచి, ప్రభుత్వ భవనాలు నిర్మించేంత వరకు అన్నీ తానై వ్యవహరించి, ప్రత్యక్షంగా వాటిని పర్యవేక్షిస్తూ, నిత్యం వార్తల్లో నిలిచారు. రాజధాని నిర్మాణమే కాదు, మున్సిపల్ మినిస్టర్‌గానూ మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేశారు.
రాష్ట్ర పాలనలోనేకాదు నెల్లూరు జిల్లా అభివృద్ధిలోను తన ముద్ర వేశారు నారాయణ. నెల్లూరులో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి, పనులు ప్రారంభించారు. భూగర్భ డ్రైనేజీతోపాటూ మంచినీటి వ్యవస్థ, నెక్లెస్ రోడ్ నిర్మాణం, పార్కుల ఆధునీకరణ, సిసి రోడ్లు, మార్కెట్‌ల నిర్మాణం, ఇలా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నారాయణ, ఆయా పనులు వేగవంతం చేయడంలోనూ సఫలీకృతులయ్యారు. తొలిసారిగా రాష్ట్రంలోనే మున్సిపల్ జూనియర్ కళాశాలను స్థాపించి, తన నారాయణ విద్యా సంస్థల నుంచి ఫ్యాకల్టీలను అందించి, మంచి ఉతీర్ణత సాధించి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తాను మంత్రిగా ఓ వైపు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. పగలనక, రాత్రనక, అధికారులను పరుగులు పెట్టించి పనులు చేయించారు. అదేవిధంగా తన అనుచర గణాన్ని కూడా భారీగా పెంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డితోపాటూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర వంటి వారినిసైతం తన అనుచర గణంలో చేర్చుకుని, బలమైన శక్తిగా ఎదిగారు. ఇంత చేశానని నారాయణ చెప్పకుంటున్నా, ఆయన మాత్రం తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఓడిపోయి కంగుతిన్నారు.
అర్థబలం, అనుచరగణం కలిగిన నారాయణకు 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. నెల్లూరు నగరం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నారాయణ, సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ చేతిలో రెండువేలు పైచిలుకు ఓట్లతో పరాజయం పాలయ్యారు. అంతే ఆనాటి నుంచి నారాయణ జాడ ఎక్కడా కనిపించడంలేదు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడంలేదు. ఒకవేళ పార్టీ ఆఫీసుకి వచ్చినా, ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, అనేక కట్టడాలను కూల్చివేయడంతో పాటూ, నెల్లూరునగరంలోనూ అభివృద్ధి మాటున అవినీతి జరిగిందన్న విమర్శలను అలనాటి ప్రతిపక్షనేతలు, నేటి అధికార పార్టీ నాయకులు గుప్పిస్తున్నా, ఆయన పెదవి విప్పడం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నేతలు, గత పాలకులపై ముప్పేటదాడి చేస్తున్నా, మాజీ మంత్రి నారాయణ మాత్రం మౌనం వీడటం లేదు. ఇటీవల నెల్లూరు నెక్లెస్ రోడ్‌ను పరిశీలించిన మంత్రి అనిల్, నెక్లెస్ రోడ్ అంతా అవినీతిమయమని ఆరోపించినా, మాజీమంత్రి నారాయణ మాత్రం బయటకు రాలేదు. పెదవి విప్పలేదు. తాజాగా రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాలు జరుగుతున్నా, ఆయన విద్యాసంస్థల ఆఫీసులు, ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మాజీ మంత్రి నారాయణపై పార్టీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది.
మాజీమంత్రి నారాయణ మౌనంగా ఉండడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారతారా అన్న చర్చ కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. నారాయణ మౌనం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన విద్యాసంస్థలపై, తన ఆస్తులపై ప్రభుత్వం దాడులు చేయిస్తుందేమోనన్న భయం నారాయణలో ఉందని కొందరు అనుకుంటుంటే, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని మరికొందరు భావిస్తున్నారు. ఇంకొందరైతే తన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారని, పరాజయం నుంచి ఇంకా తేరుకోలేదని, అందుకే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఐదేళ్లు తాను ఏంచేసినా ఫలితం లేదని, అందుకే తన సంస్థల అభివృద్ధిపై నారాయణ దృష్టి పెట్టి అందులో బిజీగా ఉన్నారని ఇంకొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిపై నారాయణ అనుంగ శిష్యులు సైతం స్పందించడంలేదు.
ఏదిఏమైనా అప్పటి ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించిన నారాయణ, నేటి వైసీపీ ప్రభుత్వంలో పాలకులు వేస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారు. మరి నారాయణ రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో మౌనంగా ఉన్నారా, ఆరోపణలకు భయపడి మౌనంగా ఉన్నారా, లేక తన వియ్యంకుడు గంటా బాటలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంలో బిజీగా ఉన్నారా అన్న ప్రశ్నలు మాత్రం రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire