AP News: ఏపీలో రేపటి నుంచి హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం

Election Campaign In AP From Tomorrow
x

AP News: ఏపీలో రేపటి నుంచి హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం 

Highlights

AP News: ఏపీలో అభ్యర్థుల ప్రకటన దాదాపు ముగిసింది.

AP News: ఏపీలో అభ్యర్థుల ప్రకటన దాదాపు ముగిసింది. రేపటి నుంచి అసలు సిసలు క్యాంపెయిన్ ప్రారంభం కాబోతోంది. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారం హోరెత్తబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు.. ఆయా పార్టీల అధినేతలే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు. నెల రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు పార్టీ నేతలు. రేపు సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దీంతో బస్సుయాత్ర సభల్లో జగన్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది..

మరోవైపు...ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..రేపటి నుండి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ఇప్పటికే షెడ్యూల్ రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు క్యాంపెయిన్ చేస్తారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇక 29న నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు స్థానాల్లో చంద్రబాబు సభలు, రోడ్ షోలు ఉంటాయి. మొత్తం 5 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు...

జనసేన అధినేత పవన్ సైతం ప్రచార రంగంలోకి దిగుతున్నారు. తాను పోటీ చేసే పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు జనసేనాని. మూడు విడతలుగా సాగే పవన్‌ ప్రచారం.. ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి విడతలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజవర్గాలను కవర్ చేసే విధంగా..ఇప్పటికే షెడ్యూల్‌ ప్రిపేర్ చేశారు. ప్రచారం కంటే ముందు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. అనంతరం దత్తపీఠం దర్శిస్తారు. మూడ్రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ ప్రచారం చేయనున్నారు. పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం...ప్రజలను కలిసి అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో వివరించనున్నారు జనసేనాని..

Show Full Article
Print Article
Next Story
More Stories