కర్నూలు జిల్లాలో మండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. తుఫాన్‌‌తో కురిసిన వర్షానికి నీట మునిగిన పంట

Effect Of Typhoon Mandous In Kurnool District
x

కర్నూలు జిల్లాలో మండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. తుఫాన్‌‌తో కురిసిన వర్షానికి నీట మునిగిన పంట

Highlights

* వర్షాలకు తడిసిన చేతికొచ్చిన పంట.. పత్తి, మిరప, మొక్కజొన్న పంటలపై ఎఫెక్ట్

Kurnool: రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేస్తున్న పంటపై మండూస్ తుఫాన్ దెబ్బ కొట్టింది. కల్లాల్లో ఆరబోసిన పంట నీట మునిగింది. పడిన కష్టం నీటి పాలయ్యింది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మండూస్ తుఫాన్ నష్టం, కష్టం తెచ్చిపెట్టింది.

కష్టాలు, కన్నీళ్లు కాటేసిన కాలానికి బలైన రైతులు. ఇది ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మండూస్ తుఫాన్ మిగిలిచ్చిన వ్యధలు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మండూస్ తుఫాన్ భారీ నష్టం తెచ్చి పెట్టింది. ఆరుగాలం శ్రమించి వేసిన పంటలు కోత దశలో నీటి పాలయ్యాయి. అప్పులు చేసి వేసిన పంటలు నీట మునిగిపోయాయి. చిరు జల్లులతో మొదలైన మండూస్ తుఫాన్ ప్రభావం ఎడతెరిపి లేని వర్షాలుగా మారిపోయింది. దీనికి తోడు ఈదురు గాలులు మరింతగా నష్టం తెచ్చి పెట్టాయి. వర్షాలు, ఈదురు గాలులతో పంట వాలి పోయింది. వర్షాలకు తడిసి చేతికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది పొలాల్లో ఆరబోసిన పంట వర్షంతో సర్వనాశనం అయింది.

కర్నూలు జిల్లాలో ఆరు లక్షల 75 వేల హెక్టర్ల పత్తి పంట సాగైంది. నంద్యాల జిల్లాలో 82 వేల 224 హెక్టర్లలో పత్తి వేసారు. మూడో దశ కోతకు రైతులు సిద్దం అవుతున్న సమయంలో తుఫాన్ విరుచుకు పడింది. దీంతో పత్తి పంటలు తడిసి ముద్దయ్యాయి. పంట ఏ మాత్రం చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇక మిర్చి పంటది అదే పరిస్థితి. పంట వేసి 70 నుంచి 90 రోజులు అవుతోంది. ఇప్పుడే పంట కోత దశకు రావడంతో అకాల వర్షంతో మిరప పంట కుళ్ళి పోయింది. ఎమ్మిగనూరులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మిరప పంటను కోసి కళ్ళేల్లో రైతులు ఆరబోశారు. తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాలతో ఆ పంట తడిసి ముద్దయింది. మరికొంత పంట వర్షం నీటిలో కొట్టుకుపోయింది.

రబీ సీజన్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు మొక్కజొన్న సాగును ప్రారంభం చేశారు. నవంబర్ రెండో వారంలో సాగు చేసిన పంట ఎదుగుదల ఇప్పుడే మొదలైంది. తుఫాన్ తో కురుస్తున్న వర్షాలకు పంట నాశనం నాశనమవుతోందని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని పెద్దకడబూరు మండలం కల్లుకుంట్లలో పొలాల్లో ఆరబోసిన మిరప పంట నీటి మునగటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తడిసి పంటను ఆర బోసుకోవటానికి నానాతంటాలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో కురిసిన అధిక వర్షాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. రెక్కలు, ముక్కలు చేసుకుని పండిస్తున్న పంట తుఫాన్ తో దక్కకుండా పోవటంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

మండూస్ తుఫాన్ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంటలు నాశనం అయితే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి నష్టం ఇప్పటి వరకు ఏర్పడలేదని డిఏవోపిఎల్ వరలక్ష్మి అన్నారు. జిల్లాలో సగటున 15.6 మిల్లి మీటర్ల వర్ష పాతం నమోదైనయినట్లు ఆమె వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories