వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి గందరగోళం!

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి గందరగోళం!
x
Highlights

పశ్చిమ ప్రకాశంలోని ప్రతి ఒక్కరి ఆశాజ్యోతి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల. అది సాకారం కావాలంటే కీలకమైన నిర్వాసితుల...

పశ్చిమ ప్రకాశంలోని ప్రతి ఒక్కరి ఆశాజ్యోతి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల. అది సాకారం కావాలంటే కీలకమైన నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాల్సిందే. కన్నతల్లి వంటి ఉన్న ఊరిని వదిలి వేరే చోటికి వెళ్లి బతకాలంటే అనేక సవాళ్లు. ప్రతీ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. నిర్వాసితులను బయటికి పంపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితులను నిర్వాసితులకు ఎదుర్కొంటున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల వద్దకు రోజుకో ప్రతిపాదనతో అధికారులు వెళ్తున్నారు. దీంతో దేనిని ఎంచుకోవాలో అర్థం కాక మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువుతండా, పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల, చింతలముడిపి, కాటంరాజుతండా, అలాగే అర్థవీడు మండలంలోని సాయిరాంనగర్‌, రామలింగేశ్వరపురం, కృష్ణనగర్‌, లక్ష్మీపురం ముంపు గ్రామాల వాసులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల వద్దకు మొదట రెండు ప్రతిపాదనలు తీసుకెళ్లారు అధికారులు. అందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత మూడోది ప్రస్తుతం నాలుగో ఆప్షన్ ను వారి వద్దకు తీసుకెళ్లారు. ఏ ప్రతిపాదనకు అంగీకరించాలనే సందిగ్ధంలో నిర్వాసితులు ఉన్నారు. మొదటిగా నిర్వాసితులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద 12 లక్షల 50 వేలు పంపిణీ చేయడం. నిర్వాసితులు తమ ఇష్టం వచ్చినప్పుడు సొంతంగా ఇల్లు నిర్మించుకోవచ్ఛు. వీరికి పునరావాసంతో సంబంధం ఉండదు. నగదు ఖాతాలో జమ చేసిన తర్వాత ఇంటిని అధికారులు కూల్చివేస్తారు. రెండో ప్రతిపాదన ప్రకారం నిర్వాసితులకు పునరావాసంలో అయిదు సెంట్ల స్థలంలో 5 లక్షల 55 వేల రూపాయలతో ఇల్లు నిర్మిస్తారు. ఆ తర్వాత మిగిలిన 6 లక్షల 36 వేలు చెల్లిస్తారు. ఈ పరిహారం కాకుండా ఎస్సీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేల రూపాయలు అదనంగా అందజేస్తారు. ఇల్లు, సౌకర్యాలు కల్పించిన తర్వాత ముంపు గ్రామం నుంచి ఖాళీ చేసేలా అధికారులు ప్రతిపాదన చేశారు.

ఇక మూడోది పునరావాసం కోరే వారికి 5 లక్షల 55 వేలతో ఇల్లు నిర్మించి ఇస్తారు. మిగిలిన 6 లక్షల 36 వేల రూపాయలను వెంటనే ఖాతాల్లో జమ చేస్తారు. ముంపు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటుంది. పునరావాసంలో ఇంటి నిర్మాణానికి ఎన్ని నెలలైనా సమయం పట్టవచ్ఛు. నాలుగో ప్రతిపాదనలో పునరావాసం కోరే వారికి 5 లక్షల 55 వేలు ఇంటి నిర్మాణానికి, మిలిగిన 6 లక్షల 36 వేలు మొత్తం కలిపి 11 లక్షల 91 వేలు చెల్లిస్తారు. దీంతోపాటు పునరావాస కాలనీలో అయిదు సెంట్ల ఇంటి స్థలం పట్టా అందిస్తారు. అయితే నిర్వాసితుల్లో చాలా మంది పునరావాసమే కోరుకుంటున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరిహారం తీసుకుని పిల్లలు, పశువులతో ఎక్కడికి వెళ్లి బతకాలని ప్రశ్నిస్తున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి సౌకర్యాలు కల్పించిన తర్వాతనే బయటికి వెళ్తామంటున్నారు వెలుగొండ నిర్వాసితులు.

కన్నతల్లిలాంటి ఊరిని నమ్ముకొని సాగిన జీవనాలు. ఏ ఉపాధి బాటల్ని చూపకుండా ఉన్నఫలానా వెళ్లిపోమంటే, పిల్లాపాపలతో ఎక్కడికి వెళ్లిపోతారు. ముంపునకు గురైన అన్ని గ్రామాల్లోని ప్రజలు కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని గడిపిన వారే. ఇప్పుడు ప్రభుత్వం కల్పించే పునరావాసానికి వెళ్లి వాళ్లంతా ఏం చేస్తారనేదే ప్రశ్న.

Show Full Article
Print Article
Next Story
More Stories