VR High School: కనుమరుగు కానున్న నెల్లూరు వీఆర్ హైస్కూల్‌

Disappearing Nellore VR High School
x

కనుమరుగు కానున్న నెల్లూరు వీఆర్ హైస్కూల్‌

Highlights

VR High School: అది ఎంతో మందిని మేధావులుగా తీర్చి దిద్దిన విద్యా సంస్థ.

VR High School: అది ఎంతో మందిని మేధావులుగా తీర్చి దిద్దిన విద్యా సంస్థ. మరెంతో మందిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లిన విద్యా కేంద్రం. అదే నెల్లూరులోని వెంకటగిరి రాజాస్ హైస్కూల్, కాలేజ్. ప్రపంచ ఖ్యాతి గడించిన ఆ చదువుల ఒడి ఇప్పుడు నిర్మానుష్యమవుతోంది. అక్షర కుసుమాలు వెదజల్లిన ఆ విజ్ఞాన కేంద్రం మూసివేతకు గురైంది. మొన్ననే కాలేజ్‌ను మూసివేసిన పాలకులు ఇప్పుడు స్కూల్‌ను మూసి వేస్తున్నారు. విద్యార్థుల్లో తీవ్ర మనోవేదన కలిగిస్తున్న వీఆర్ హై స్కూల్ మూసివేతపై hmtv అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఎందరినో విద్యావంతులుగా ఉన్నత స్థాయిలో నిలిపిన నెల్లూరు వీఆర్ కళాశాల, వీఆర్ హై స్కూల్ నేడు విద్యార్థులకు దూరమైంది. సరైన విద్యా సదుపాయాలు అందించడంలో పూర్తిగా విఫలమైన పాలకులు ఇప్పుడు సంస్కరణల పేరుతో అసలుకే ఎసరు పెట్టారు. సరిగ్గా నెల రోజుల క్రితం వీఆర్ కళాశాలలోని అధ్యాపకులు, సిబ్బందిని వివిధ ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా వీఆర్ హైస్కూల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఉన్నఫలంగా విద్యా హై స్కూల్‌ను మూసివేయడంపై అక్కడ చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో ఉన్న విద్యా సంస్థ ఒక్కసారిగా మూసివేతకు గురికావడంతో తమ బిడ్డలను చదివించుకుంటున్న నిరుపేదల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో ఇలా అర్ధాంతరంగా హై స్కూల్ మూసివేయడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల చదువు కోసం వెంకటగిరి రాజాలు, మరికొందరు దాతలు సహకారంతో నెల్లూరులో సుమారు 17 ఎకరాల్లో వీఆర్ స్కూలు, కాలేజీ నిర్మించారు. దాదాపు 110 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన నెల్లూరు వీఆర్ విద్యాసంస్థ ఎందరికో సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు నాంది అయ్యింది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, సినిమా హీరో నాగబాబు, భారత అణు శాస్త్రవేత్త సతీష్ రెడ్డి, ఆసియాలోనే గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ప్రముఖ వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ కంచర్ల రవీందర్ నాథ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఆనం కుటుంబ సభ్యులు ఇలా ఎందరో వీఆర్ హైస్కూల్, కళాశాలలో చదువుకున్న వారే. అటువంటి ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థ ఇప్పుడు మూసివేతకు గురవుతుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు వీఆర్ విద్యాసంస్థలు అంటేనే ఒక చరిత్ర ఒక విశిష్టత అనేక మంది మేధావులను అందించిన ఈ విద్యాసంస్థ ఇప్పుడు కనుమరుగు కావడం ఇక్కడి వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్‌తో నడుస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని బయటికి పంపిన నేపథ్యంలో ఇక్కడ విద్యనభ్యసించిన మహోన్నత వ్యక్తులైనా స్పందించి ఈ విద్యా సంస్థను రక్షించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories