శ్రీవారి భక్తులతో నిండిపోయిన ఏడుకొండలు

Devotees Huge Rush in Tirumala Tirupati
x

శ్రీవారి భక్తులతో నిండిపోయిన ఏడుకొండలు

Highlights

Tirumala: వరుస సెలవులు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో అన్యూహంగా పెరిగిన భక్తుల రద్ది

Tirumala: వారాంతం కావడం పంద్రాగస్టు కలిసిరావడంతో తిరుమలకు శ్రీవారి భక్తులు పోటెత్తారు. శుక్రవారం నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య గంట గంటకూ పెరుగుతూ వస్తోంది. శనివారం రాత్రికి తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిసిపోయాయి. దీంతో దర్శనం కోసం గంటల తరబడి కాదు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. సర్వ దర్శనానికి అయితే ఏకంగా 48 గంటలు అంటే రెండు రోజుల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకున్న భక్తులకు 5 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. 4 కిలోమీటర్ల పొడవున్న నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆళ్వార్ ట్యాంక్ మీదుగా లేపాక్షి సర్కిల్ నుండి నందకం అతిధి గృహం రింగ్ రోడ్డు వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి‌ ఉన్నారు.

వేలాదిగా భక్తులు వివిధ మార్గాల ద్వారా.. ఒక్కసారిగా కొండకు చేరుకోవడంతో ఏడుకొండలు భక్తులతో నిండిపోయాయి. దీంతో ఏ వీధి చూసినా భక్తులతో కిక్కిసిపోయి కనిపిస్తున్నాయి. టీటీడీ యాత్రికుల సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఇక వసతి గదులు లేక.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూములు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఆరు బయటనే నిద్రిస్తున్నారు. వసతి గృహాల్లో కొన్నింటికి మరమ్మతులు చేస్తుండటంతో చాలా మంది భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ముందే గ్రహించిన టీటీడీ గత కొన్ని రోజుల నుంచే భక్తులకు సూచనలు చేస్తూ వస్తోంది. వరుస సెలవులు ఉండటంతో ఎలాంటి ప్రణాళిక లేకుండా తిరుమలకు రావొద్దని స్పష్టంగా చెప్పుకొచ్చింది. అయితే అనూహ్యంగా భక్తుల తాకిడి పెరగడంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టినా భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. క్యూలైన్ లోకి నిల్చున్న భక్తుడికి స్వామివారిని దర్శించుకునేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఉందని టీటీడీ ప్రకటించింది. ఓపిక ఉన్న భక్తులు మాత్రమే క్యూలైన్ లోకి ప్రవేశించాలని అధికారులు సూచించారు. విపరీతమైన భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపును ఈ నెల 21 వతేది వరకు రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగను అందిస్తున్నారు. వరుస సెలవులు, పెళ్ళిళ్ల సీజన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories