శ్రావణమాసం, వరుస సెలవులు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు

Devotees Huge Rush in Tirumala Tirupati
x

శ్రావణమాసం, వరుస సెలవులు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు

Highlights

Tirumala: శ్రీవారి భక్తులతో నిండిన తిరుమల గిరులు

Tirumala: మంచి రోజులకు వరుస సెలవులు తోడవడంతో ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తకోటి పరుగులు పెడుతోంది. శ్రావణ మాసం అందునా 4 రోజుల పాటు సెలవులు దొరకడంతో ఏడుకొండలు ఎక్కేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో ఏడుకొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంచనాలకు మించి శ్రీవారి భక్తులు రావడంతో టీటీడీ కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా దర్శనం కోసం రావొద్దంటూ విజ్ఞప్తి చేస్తోంది. సెలవులున్నాయని వస్తే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసింది.

రాఖీపౌర్ణమి, రెండో శనివారం, ఆదివారం, పంద్రాగస్టు.. ఇలా వరుసగా సెలవులు రావడంతో.. భక్తులంతా శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. అలాగే పెరటాసి మాసంలో తమిళ భక్తులు కూడా స్వామి దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఏడుకొండలు భక్తులతో నిండిపోయింది. గత రెండు రోజుల నుంచి పెద్ద సంఖ్యలో తిరుమలకు రావడంతో.. టీటీడీ అధికారులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ల పాటు భక్తుల రాక పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ఏట ఎలాగైనా దర్శించుకోవాలని భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా శ్రీవారి దర్శనాలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఇటు హుండీ ఆదాయం కూడా పాత రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెలవులు కూడా తోడవడంతో గత రెండు రోజుల పాటు.. తిరుమల కొండలన్నీ భక్తకోటితో కిక్కిరిసిపోయింది. దీంతో ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీటీడీ తిరుమల ప్రయాణాలపై భక్తులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేసింది. దర్శనాలు ముందే బుక్ చేసుకున్న వారు తప్ప మిగతావారు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.

ప్రత్యేక లఘు దర్శనానికి ప్రస్తుతం 80 నుంచి 90 వేల మందిని అనుమతిస్తున్నారు. అయితే లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శనాలకు ఏకంగా 48 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం 5 వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు వేలకు పైగా గదుల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు మాత్రం పెరటాసి మాసం తర్వాతే రావాలని టీటీడీ సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories