చింతమనేని గుండెల్లో రైళ్లెందుకు పరుగెడుతున్నాయ్?

చింతమనేని గుండెల్లో రైళ్లెందుకు పరుగెడుతున్నాయ్?
x
Highlights

న్యాయం అడిగితే కొట్టాడు. అన్యాయాన్ని ఎదురిస్తే బెదిరించాడు. ఎమ్మెల్యే కదా సాయం అడగానికి మహిళ వెళితే, ఈడ్చిపారేశాడు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు....

న్యాయం అడిగితే కొట్టాడు. అన్యాయాన్ని ఎదురిస్తే బెదిరించాడు. ఎమ్మెల్యే కదా సాయం అడగానికి మహిళ వెళితే, ఈడ్చిపారేశాడు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి పార్టీ నేతలపై గొడవకు దిగని రోజులేదు. ఇలా నిత్యం చేతివాటం, నోటి దురుసు. లెక్కలేనన్ని కేసులు. ఐదేళ్లూ ఒక్క ఎఫ్‌.ఐ.ఆర్‌. కూడా ఆ‍యనను టచ్ చేయలేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు తిరగబడే టైమ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ‍యనకు కాలం తిరగబడింది. వెంటపడుతోంది. పాత కేసులన్నీ వెంటాడి వేధించేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని, చేతుల్లో కొరడా పట్టుకుని, ఝులిపించేందుకు కసిగా చూస్తున్నాయి. మొన్నటి వరకూ అందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఆ నాయకుడి గుండెల్లో, ఇప్పుడు సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం. టిడిపి కంచుకోట. చింతమనేని ప్రభాకర్‌కు ఓటమి తెలియని అడ్డా. కానీ ఇదంతా నిన్నటి మాట. నేడు సీన్ రివర్స్. ప్రభాకర్ హవా కాస్తా, ఫ్యాను గాలికి తలకిందులైంది. నా కంట్లో బెదురులేదు నా మాటకు తిరుగులేదు అంటూ ఇన్నాళ‌్లు చెలరేగిన చింతమనేనిని, ఇప్పడు ఏ కేసు బయటకు తీస్తారా లేక ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే భయం వెంటాడుతోంది.

2009లో వైఎస్ హవా తట్టుకున్నారు చింతమనేని. ఆ టైమ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై పబ్లిక్ మీటింగ్‌లో చేయిచేసుకుని వీరతాండవం చేశారు. 2014 టిడిపి అధికారంలోకి వచ్చి నాటి నుంచి ఎమ్మార్వో వనజాక్షి వివాదం, ఎస్సైపై దాడి, దళితులపై అనుచిత వ్యాఖ్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చింతమనేనికి ఎదురు నిలవాలంటేనే దెందులూరు నియోజకవర్గంలో హడలిపోయే భయానక పరిస్దితి. వైసీపీ సానుభూతిపరుడు చింతమనేని కంటపడితే అంతేసంగతులు. నోరు ఆగదు..చెయ్యి మాట వినదు. ఇలా వైసిపి క్యాడర్ దెందులూరులో చింతమనేని పేరు చెబితే హడలిపోయారు. అలా 2009 నుంచి 2019 వరకూ పదేళ్ల పాటు ఎన్నో కేసులు ఫైలయ్యాయి. చేతివాటం, నోటి దురుసుతో నిత్యం వార్తల్లో నిలిచారు. కానీ నాడు పోలీస్‌ స్టేషన్‌లో మగ్గిపోయిన కేసుల బూజు దలుపుతుండటం చింతమనేనిలో టెన్షన్‌ పుట్టిస్తోంది.

ఇప్పుడు చింతమనేని పరిస్దితి రివర్సయ్యింది. జూలు విదిల్చే చింతమనేని ఎక్కడ, ఎప్పుడు చిక్కుతారా అని అధికార పార్టీ నేతలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట. గతంలో అధికారం ఉంది, చంద్రబాబు అండగా ఉన్నారు. అందుకే రెచ్చిపోయారు. ఇఫ్పడు మాట్లడమనండి చూద్దాం కనీసం ఇంట్లో ఉన్నా వదలం, గతంలో కేసుల చిట్టా బయటకు తీయాల్సిందే అంటూ వైసిపి నేతలు పంతం పడుతున్నారట. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో పైపుల చోరి కేసు, చింతమనేనిని నీడలా వెంటాడుతోంది.

తాజాగా సాగునీటి పైపుల‌ను దొంగిలించారంటూ చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ను ఏ1గా చేరుస్తూ, సెక్షన్ 420, 384, 431(34), కింద పెద‌వేగి పోలీసు స్టేష‌న్‌లో కేసులు నమోదయ్యాయి. పైపులు దొంగిలించిన మాట వాస్తవమేకానీ, అది తన సొంత ఖర్చు అంటున్నారట చింతమనేని ప్రభాకర్. కానీ రైతులు మాత్రం ఎకరాకు వెయ్యి చొప్పున వసూలు చేశారని నిలిదీశారట. అయితే ఈ కేసుపై పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టడంతో తనకు ఎక్కడ మూడుతుందోనని ముందుగానే ఎస్పీకి మొరపెట్టుకున్నారట చింతమనేని. ఇన్నాళ్లు భరించాం, ఇక వదిలేది లేదు, కేసులు తీయండి బయటకు అంటూ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది.

1995లో ఏలూరులో చింతమనేనిపై రౌడీ షీట్ నమోదైన దగ్గర నుంచి కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాదోగిపై దాడి కేసులో సెక్షన్లు: 506, 323, 356 రీడ్ విత్ 34 IPC క్రింద దెందులూరు పోలీస్టేషన్‌లో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 క్రింద ఏలూరు త్రీ టౌన్‌లో, ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో సెక్షన్లు: 353, 334, 379 క్రింద ముసునూరులో, ట్రాఫిక్ పోలీసు మీద దాడితో సెక్షన్లు: 323, 353,506 దెందులూరు పీఎస్‌లో, సెక్షన్లు: 27, 29, 51 వ్యణ్యప్రాణి అభయారణ్య చట్టం 1972 క్రింద కైకలూరులో, ఆర్టీసి డ్రైవర్ ను కొట్టడంతో హనుమాన్ జంక్షన్ లో కేసు, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళ మీద దాడి. ఇలా చింతమనేనిపై నమోదైన కేసులు దాదాపు 40దాటితే నమోదు కానివి ఎన్నో ఉన్నాయంటూ బాధితులు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారట. ఈ కేసులు తనను ఏం చేయలేవంటూ బహిరంగంగా చెప్పే చింతమనేని, పార్టీ అధికారంలో లేకపోవడం, తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో సైలెంట్‌ అవ్వాల్సిన పరిస్థితి. ఈ ఐదేళ్లు గడిస్తే చాలు, గమ్మునుందాం అని ఫిక్సైపోయారట చింతమనేని.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories