డేంజర్ లో బెజవాడ...ప్రకాశం బరాజ్ పరిస్థితి ఏంటి?

Danger in Vijayawada What is the Status of the Prakasam Barrage?
x

డేంజర్ లో బెజవాడ...ప్రకాశం బరాజ్ పరిస్థితి ఏంటి?

Highlights

బుడమేరు వరద నీరు ఫెర్రీ వద్ద కృష్ణా నదిలోకి వెళ్లే విధంగా 15 ఏళ్ల క్రితం కాలువను నిర్మించారు. అయితే కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో ఫెర్రీ వద్ద బుడమేరు నీరు వెనక్కి నెట్టింది. దీంతో జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద బుడమేరు గేట్లను ఎత్తారు.

విజయవాడ ప్రకాశం బరాజ్ కు వరద పోటెత్తింది. ఎగువ నుంచి బరాజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 11. 41 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బరాజ్ వద్ద 24.2 అడుగుల మేర నీటిమట్టం ఉంది. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బరాజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

విజయవాడను ముంచెత్తిన వరద

విజయవాడను వరద ముంచెత్తింది. కృష్ణానదితో పాటు బుడమేరు వరద నీరు బెజవాడను బెంబేలెత్తించింది. నగరంలోని 12 డివిజన్లు వరద నీటిలో మునిగాయి. బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీల్లో వరద పోటెత్తింది.

బుడమేరు వరద నీరు ఫెర్రీ వద్ద కృష్ణా నదిలోకి వెళ్లే విధంగా 15 ఏళ్ల క్రితం కాలువను నిర్మించారు. అయితే కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో ఫెర్రీ వద్ద బుడమేరు నీరు వెనక్కి నెట్టింది. దీంతో జి.కొండూరు మండలం వెలగలేరు వద్ద బుడమేరు గేట్లను ఎత్తారు.

దీంతో వెలగలేరు, హెచ్ ముత్యాలంపాడు, కవులూరు, కొండపల్లి మధ్య ఏడు చోట్ల కాలువకు గండ్లు పడ్డాయి. చెరువుల కట్టలు తెగాయి. వరద నీరు విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. గేట్లు ఎత్తిన విషయమై ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎన్నడూ లేనంత వర్షం

విజయవాడలో 50 ఏళ్లలో ఏన్నడూలేనంత వర్షం కురిసింది. 24 గంటల్లోనే 37 సెం.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడతో పాటు గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 14 మండలాల్లో అత్యంత భారీ వర్షం పడింది. ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లా, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, నంద్యాల, బాపట్ల జిల్లాల్లోని 94 కేంద్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎన్జీఆర్ జిల్లా వత్సవాయిలో 32 సెంటిమీటర్లు, జగ్గయ్యపేటలో 26 , తిరువూరులో 25.78, గుంటూరు తూర్పులో 25.68 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ప్రకాశం బరాజ్ కు పోటెత్తిన వరద

జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. అయితే పులిచింతల నుంచి ప్రకాశం బరాజ్ మధ్య మున్నేరు, కట్టలేరు, బుడమేరు, కీసర, వైరా వాగుల నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలో కలుస్తోంది.

దీంతో ప్రకాశం బరాజ్ కు రికార్డు స్థాయిలో 11 లక్షల 41 వేల 351 క్యూసెక్కుల నీరు వస్తోంది. 1903లో ప్రకాశం బరాజ్ ను నిర్మించారు. అయితే ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో వరద రాలేదు. 2009 అక్టోబర్ 5న 10 లక్షల 94 వేల 422 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బరాజ్ నుంచి దిగువకు విడుదల చేశారు.

అంతకుముందు 1998లో 9 లక్షల 32 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బరాజ్ నుంచి విడుదల కావడం ఓ రికార్డ్. ఈ రికార్డులను ప్రస్తుత వరద బ్రేక్ చేసింది. బరాజ్ కు వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్ కు చెందిన 70 గేట్లను ఎత్తారు. ఈ బరాజ్ నుంచి 11 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేశారు.

ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని బరాజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బరాజ్ పై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బాపట్ల ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆ జిల్లా కలెక్టర్ మురళి చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద మరింత ఎక్కువై మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే యనమలకుదురు, పెదపులిపాక, మద్దూరు, శ్రీకాకుళం తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. విజయవాడలోని మరికొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

విజయవాడకు వరద దెబ్బకు కారణాలేంటి?

రికార్డు్ వర్షపాతంతో పాటు బుడమేరులో అనుహ్యంగా పెరిగిన వరద విజయవాడను ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడమేరు విజయవాడ పట్టణం గుండా కొల్లేరు సరస్సులో చేరుతోంది. కొల్లేరు నుండి అది సముద్రంలో కలుస్తుంది.

బుడమేరు ప్రవాహనాన్ని నియంత్రించేందుకు వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ ను నిర్మించారు. 2005 లో బుడమేరులో వచ్చిన వరదల కారణంగా విజయవాడ ముంపునకు గురైంది. దీంతో దీనిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని అప్పట్లో సీపీఐ నాయకులు కొల్లి నాగేశ్వరరావు ఆందోళన చేశారు.

ఆక్రమణలు తొలగిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆపరేషన్ కొల్లేరును అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడికాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ ఖరారైంది. దీంతో బుడమేరు దిగువ ప్రవాహన్ని కుడికాల్వలోకి మళ్లించారు. కొత్తగా కాల్వ నిర్మించకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకే దీన్ని మళ్లించారు. పోలవరం కుడికాల్వ గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.

వీటీపీఎస్ నుంచి కృష్ణా నదిలో బుడమేరు నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి. ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడికాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.

2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు యథేచ్ఛగా ధ్వంసమయ్యాయి. ఇవన్నీ కూడా విజయవాడ ముంపునకు కారణంగా చెబుతున్నారు.

తక్షణ కర్తవ్యం ఏంటి?

విజయవాడలో ముంపునకు గురైన వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి. బాధితులకు ఆహారం, వాటర్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను అందించాలి. ముంపు ప్రాంతాల నుండి నీటిని తోడేందుకు చర్యలు చేపట్టాలి. ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే ఇందుకు ప్రకృతి కూడా సహకరించాలి. మళ్లీ వర్షాలు కురిస్తే సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బుడమేరు వాగు వరద నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలి.

వర్షం నీరు సక్రమంగా వెళ్లే మార్గం లేని కారణంగానే విజయవాడ ముంపునకు గురైంది. వాగులు, వంకలు, నదుల నీరు సక్రమంగా వెళ్లే మార్గాలపై అక్రమ నిర్మాణాలపై పాలకులు చూసీ చూడనట్టుగా వదిలేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులకు కారణాలను అన్వేషించి భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories