బాలినేనీ నిన్ను పవన్ కల్యాణ్ కూడా కాపాడలేడు - దామచర్ల జనార్దన్

బాలినేనీ నిన్ను పవన్ కల్యాణ్ కూడా కాపాడలేడు - దామచర్ల జనార్దన్
x
Highlights

Damacharla Janardhan: బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంకా జనసేన పార్టీలో చేరనేలేదు అప్పుడే ఆయనకు తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల...

Damacharla Janardhan: బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంకా జనసేన పార్టీలో చేరనేలేదు అప్పుడే ఆయనకు తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసి ఈనెల 26న జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై దామచర్ల జనార్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ పార్టీ మారటంపై బాలినేనిపై విరుచుకుపడ్డారు. అవినీతి కుంభకోణాల నుంచి ఆయనను పవన్ కళ్యాణ్ రక్షిస్తాడేమో చూస్తా అంటూ నేరుగానే వేదికపై నుండే హెచ్చరికలు జారీ చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం. ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారు. నాపై 32 కేసులు పెట్టారు. మా నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూషించారు. అధికారంపోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశాడు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏ పార్టీలోకి వెళ్ళినా కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకో లేరు అంటూ దామచర్ల జనార్థన్ హెచ్చరించారు.

గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం. బాలినేని చేసిన అక్రమాల నుండి ఆయన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటామని దామచర్ల జనార్ధన్ వ్యాఖ్యానించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి దామచర్ల జనార్థన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఒంగోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా దామచర్ల జనార్ధన్ మాట్లాడిన తీరు చూస్తోంటే.. జనసేనలో బాలినేని చేరిక అనంతరం ప్రకాశం జిల్లాలో, ప్రత్యేకించి ఒంగోలు కూటమిలో ముసలం పుట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు ఇంకెన్ని కోల్డ్ వార్స్‌కి దారితీస్తుందోననే ఆసక్తి నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories