Cyclone Mandous: కల్లోలం సృష్టించిన మాండూస్‌ తుఫాన్‌

Cyclone Mandous Effect On  Andhra Pradesh
x

Cyclone Mandous: కల్లోలం సృష్టించిన మాండూస్‌ తుఫాన్‌

Highlights

Cyclone Mandous: భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం

Cyclone Mandous: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురువడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నీట మునగడంతో భారీ న‎ష్టం వాటిల్లింది. తూఫాన్ ప్రభావంతో విశాఖ నుంచి నెల్లూరు వరకు సముద్ర తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో గంటలకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో... చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. రేణిగుంట రైల్వే స్టేషన్‌లో వర్షపు నీరు రైల్వే ట్రాక్స్ పై నిలువగా.. ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాల సర్వీసులను నిలిపివేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి వారిని స్వస్థలాలకు తరలిస్తున్నారు. తుఫాన్ కారణంగా వర్షంతో పాటు చలితీవ్రత బాగా పెరగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించింది.

మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ వాయుగుండంగా మారి... ఉత్తర తమిళనాడు వెల్లూరుకు 40 కిలో మీటర్లు, కృష్ణగిరికి 140 కి. మీ వద్ద కేంద్రీకృతమైంది. అయితే వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలి క్రమంగా బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తర కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచి.. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లాలలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో జనం బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇక తూఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గస్తీకాస్తు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

మాండూస్‌ తుఫాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం సృష్టించింది. . పలుచోట్ల తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి నాట్లు.. కూరగాయల సాగును వర్షాలు చిదిమేశాయి. విశాలమైన సముద్ర తీరం కోతకు గురైంది. మాండూస్ తుఫాన్ తీరం దాటడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు, ఏర్లు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేకమంది లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దక్షిణ మండలాలలో కైవల్య, కాళంగి, స్వర్ణముఖి గుడ్డేరు, పిన్నేరు, సహా పలు వాగులు పొంగి పొర్లతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories