తీవ్ర తుఫాన్‌గా మారిన అసని తుఫాన్

Cyclone Asani to hit Visakhapatnam on 10 May
x

తీవ్ర తుఫాన్‌గా మారిన అసని తుఫాన్

Highlights

విశాఖకు 810 కి.మీ. దూరంలో కేంద్రీ కృతమైన అసని తుఫాన్

Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉండొచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా మే నెలలో తుపాన్లు తీరానికి దగ్గరగా వచ్చినప్పటికీ తీరం దాటడం అరుదు. ఇవి నేరుగా తీరంవైపు వచ్చి దిశ మార్చుకుని వెళ్లిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఆదివారం నాటికి విశాఖకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల వర్షాలుంటాయి. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు తుపాను హెచ్చరికలు పంపింది. ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.

బంగాళాఖాతం మధ్యలో ప్రస్తుతానికి గంటకు 115-125 కి.మీ వేగంతో గాలులు వీస్తుండగా తుపాను తీరానికి దగ్గరగా వస్తున్న కొద్దీ తీవ్రత తగ్గొచ్చు. ఆ సమయానికి గంటకు 60 కి.మీ. వేగంతో తీరం వెంట గాలులు వీయొచ్చని పేర్కొంది. తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తుపాను వల్ల 9, 10, 11, 12 తేదీల్లో సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 10, 11 తేదీల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories