Crop Holiday: క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతు పరిరక్షణ సమితి

Crop Holiday in Konaseema | AP News
x

క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతు పరిరక్షణ సమితి

Highlights

Crop Holiday: ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల డిమాండ్

Crop Holiday: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్ర అన్నపూర్ణగా ప్రాముఖ్యతను సొంత చేసుకుంది కోనసీమ. ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. అయితే పరిస్థితిలో మాత్రం మార్పులేదు. సాగు కష్టాలు ఆ నాటి నుంచి నేటి వరకు కోనసీమ అన్నదాతలను వేధిస్తూనే ఉన్నాయి. రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు ఈ ఉద్యమం మరిన్ని మండలాలకు వ్యాప్తి చెందుతోంది.

ప్రతీ ఏటా సవాలక్ష సవాళ్లను ఎదుర్కొంటూ రైతులు ముందుకు సాగుతున్నారు. అయితే ప్రభుత్వాలు మారినా.. తమ రాత మారడం లేదని వాపోతున్నారు అన్నదాతలు. గడచిన రెండేళ్లుగా రైతు పండించిన ధాన్యం సొమ్ములు చెల్లించడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో తరువాత పంటకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అప్పు చేసి సాగు చేద్దామని ప్రయత్నించినా విపరీతంగా పెరిగిన ధరలు రైతు నడ్డి విరుస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రకటిస్తోన్న ఇన్‌పుట్ సబ్సిడీ.. పంట నష్టం వాటిల్లిన సమయంలో బీమా చెల్లింపులు అనేది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇన్ని అవాంతరాల మధ్య వరి వేయడం కన్నా ఖాళీగా ఉంటే నష్టాలైనా తప్పుతాయని భావిస్తున్నారు కోనసీమ రైతులు.

గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సొమ్మును చెల్లించడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు పంట సాగు చేసేందుకు పెట్టుబడి లేక సతమతమవుతున్నారు. ఒకవేళ అప్పు చేసి వ్యవసాయానికి సన్నధ్ధం అవుదామన్నా ఎరువులు సాగు ఖర్చులు పెరిగిన తీరు.. రైతుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. గడచిన రెండు మూడేళ్లుగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు విత్తనాలు, మందుల రేట్లు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. అయినా అందుకు అనుగుణంగా రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర మాత్రం రావడంలేదు. వరి సేద్యానికి అయ్యే ఖర్చు రెట్టింపు కాగా రైతులకు ప్రభుత్వం అందిస్తోన్న గిట్టుబాటు ధర మాత్రం రెండు నుంచి మూడు శాతం మాత్రమే పెరిగింది. దీంతో రైతులు తమ సమస్యలపై కోనసీమ జిల్లా కలెక్టర్‌కు గత నెలలో ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటి వరకు అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. గత్యంతరం లేక క్రాప్ హాలిడేకు సిద్ధమయ్యారు కోనసీమ అన్నదాతలు. పదేళ్ల క్రితం కోనసీమలో నిర్వహించిన క్రాప్ హాలిడే తరహాలో అన్ని మండలాల రైతులను భాగస్వామ్యం చేస్తామంటున్నారు కోనసీమ రైతు జేఏసీ నేతలు.

ప్రతీ ఏటా డెల్టా కాలువలకు జూన్ 10 తరువాత సాగు నీటిని విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది పది రోజులు ముందుగానే నీటిని విడుదల చేసారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా కోనసీమలో ఎక్కడా వరి సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ లోపాలు శాపంలా మారాయి. గోదావరి నదీ సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో ప్రతీ ఏటా సంభవించే వరదలు రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. తూర్పు మధ్య డెల్టాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ కాలువలకు మరమ్మత్తులు చేపట్టి ఏళ్లు గడచిపోయింది. ఇక శివారు ప్రాంతాలకు నీరందడం మాట అటుంచితే.. మధ్య డెల్టాలో పూర్తి స్థాయిలో సాగు నీరు అందని దుస్థితి నెలకొంది. ఫాల్ స్లూయిజ్‌లు, గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతినడంతో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న తరహాలో ఉంది రైతులు పరిస్థితి. సాగు నీరు సరిపడా ఉంటే పరిస్థితి అదుపులో ఉన్నా.. వరదల సమయంలో మాత్రం పంటలను ముంచెత్తుతోంది ఉగ్రగోదావరి.

Show Full Article
Print Article
Next Story
More Stories