ఏపీలో తప్పిన కాంగ్రెస్ అంచనాలు.. బోణీ కొట్టకుండానే పోల్ గ్రౌండ్‌ నుంచి నిష్క్రమణ

Congress Missed The Expectations in Andhra Pradesh
x

ఏపీలో తప్పిన కాంగ్రెస్ అంచనాలు.. బోణీ కొట్టకుండానే పోల్ గ్రౌండ్‌ నుంచి నిష్క్రమణ

Highlights

ఏ నియోజకవర్గంలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఏపీ ఫలితాలు ఒక్క వైసీపీనే కాదు.. కాంగ్రెస్ పార్టీనీ తీవ్రంగా నిరాశ పరిచాయి. కనీసం ఒక్క సీటుతో అయినా బోణి కొట్టి ఏపీలో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి ఊదాలని, మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నించిన హస్తం నేతల యత్నాలు కల్లలే అయ్యాయి. కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన షర్మిల కూడా ఓటమిని చవిచూశారు. అన్నతో ఢీకొని.. పార్లమెంట్‌లో అడుగుపెట్టాలనే షర్మిల కల నెరవేరకుండాపోయింది.

ఏపీలో కాంగ్రెస్ అంచనాలు తప్పాయి. బోణీ కొట్టకుండానే.. పోల్ గ్రౌండ్‌ నుంచి నిష్క్రమించింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ స్థానంలో ఎక్కడా తనదైన మార్క్ చూపించలేకపోయింది హస్తం పార్టీ. షర్మిల ఎంట్రీ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేయలేకపోయింది.

గత రెండు టర్మ్‌ల నుంచి ఏపీలో ఖాతా తెరవని కాంగ్రెస్‌కు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు. ఓటర్ల మన్ననలు పొందడంలో వెనకబడిపోయింది. షర్మిల రాకతో కాంగ్రెస్ కొంత వరకైనా పుంజుకుంటుందని, భవిష్యత్తులో పార్టీ బలోపేతం కావడానికి ఈ ఎన్నికలు పునాదిగా నిలుస్తాయని అంతా భావించారు. కానీ హస్తం నేతల ఆశలు ఫలించలేదు. షర్మిల రూపంలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినా ఏపీ కాంగ్రెస్‌ నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టాలనే కల మాత్రం నెరవేరలేదు.

వైస్సార్ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన షర్మిల.. తెలంగాణలో సొంతంగా పార్టీని స్థాపించి అనతి కాలంలోనే కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తెలంగాణలో కాకుండా.. ఏపీలోనే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవాలనే లక్ష‌్యంతో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. సొంత అన్న జగన్‌పైనే ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు. ఐతే షర్మిల రాకతో కాంగ్రెస్‌ నేతల్లో కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. గెలుపుపై ఆశలు పెరిగాయి. వైఎస్సార్ వారసురాలిగా పార్టీకి పునర్‌వైభవం వస్తుందనే నమ్మకాన్ని పెంచుకున్నారు కాంగ్రెస్ లీడర్లు.

ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టకపోయినా.. గౌవరప్రదమైన సీట్లతో రాబోయే ఎన్నికల్లో విజయానికి ఇది తొలి మెట్టుగా ఉపయోగపడుతుందని ఆశించారు. అందుకు స్వయంగా షర్మిలనే.. బరిలోకి దించారు. వైస్సార్ సొంత ఇలాకా అయిన కడప ఎంపీగా ఆమె పోటీ చేశారు. వైసీపీ కేండిడేట్‌, సోదరుడు వైఎస్‌ అవినాశ్‌తోనే తలపడ్డారు. వివేకానంద హత్య ఘటన, ఏపీకి ప్రత్యేక హోదా, పెట్టుబడుల పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు షర్మిల. పలు సర్వేలు కూడా షర్మిల గెలుస్తుందని అంచనా వేరు కానీ.. కాంగ్రెస్ అంచనాలు తలకిందులు అయ్యాయి. షర్మిల కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యాయి. కడపలో ఇప్పటి వరకు వైఎస్ కుటుంబానికి ఓటమి ఎరుగదు. కానీ ఫస్ట్ టైం వైఎస్సార్ సొంత గడ్డపై.. షర్మిల పరాజయం పాలయ్యారు.

షర్మిల కాంగ్రెస్‌‌లోకి వచ్చాక ఎస్సార్‌తో గతంలో చనువుగా ఉన్న పలువురు నేతలు..మళ్లీ హస్తం గూటికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలను సైతం పార్టీలో చేర్చుకుని,, అసెంబ్లీ పోరులో డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగారు షర్మిల. పలు నియోజకవర్గాల్లో బలమైన నేతలనే బరిలోకి దించారు. ఐనా కాంగ్రెస్ అభ్యర్థులు ఏ నియోజకవర్గంలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. కూటమి వర్సెస్ వైసీపీగా సాగిన పోల్‌ గ్రౌండ్‌లో కాంగ్రెస్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గానే మారింది. కనీసం బోణీ కొట్టలేకపోయింది. షర్మిల రాక కూడా ఏపీలో కాంగ్రెస్ తలరాతను మార్చలేక పోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories