Jagan: పంటనష్టపోయినవారికి వైఎస్సార్‌ ఉచిత బీమా కింద పరిహారం

CM Jagan Review on the Damage of the Michaung Typhoon
x

Jagan: పంటనష్టపోయినవారికి వైఎస్సార్‌ ఉచిత బీమా కింద పరిహారం

Highlights

Jagan: మిచౌంగ్‌ తుఫాన్‌ నష్టంపై సీఎం జగన్‌ సమీక్ష

Jagan: ఇటీవల మిచౌంగ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలని.. ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కొన్ని నిబంధనలు సడలించి అయినా.. రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని కూడా సీఎం చెప్పారు. ఇదే సమయంలో సంబంధిత అధికారులకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. అంతేకాక సకాలంలోనే వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇప్పటికే అన్నిరకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని కూడా సీఎం వివరించారు. అలాగే పంటనష్టపోయినవారికి వైయస్సార్‌ ఉచిత బీమా కింద పరిహారం అందించడానికి అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించారా అని అధికారులను ఆరా తీసిన సీఎం.. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్‌ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఆ తర్వాత సవరణలు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం నెలాఖరుకు జిల్లా కలెక్టర్లు తుది జాబితాలు ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతి సమయానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం అధికారులకు సూచించారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, సీఎంవో అధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories