చిరు-పవన్‌ మధ్యలో జగన్

చిరు-పవన్‌ మధ్యలో జగన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో, మెగాస్టార్‌ చిరంజీవి సమావేశం కాబోతున్నారు. లంచ్‌ మీటింగ్‌లో మాట్లాడుకోబోతున్నారు. సైరా సినిమా...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో, మెగాస్టార్‌ చిరంజీవి సమావేశం కాబోతున్నారు. లంచ్‌ మీటింగ్‌లో మాట్లాడుకోబోతున్నారు. సైరా సినిమా వీక్షించాల్సిందిగా, జగన్‌ను కోరబోతున్నారు చిరంజీవి. అయితే ఈ ఇద్దరు మహామహుల భేటి, రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. మరి చిరు-జగన్‌ లంచ్‌ మీటింగ్‌లో పొలిటికల్‌ వంటకాలు ఏమైనా వున్నాయా జగన్‌తో చిరంజీవి సమావేశం కావడం, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ఇష్టంలేదా రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని ఫీలవుతున్నారా?

సైరాతో ఊపుమీదున్న చిరంజీవి అఖండ మెజారిటీతో తొలిసారి సీఎం పీఠంపై వైఎస్‌ జగన్‌. ఇప్పుడు ఈ ఇద్దరు మహామహులు కలవబోతున్నారు ఒకే చోట అధికారికంగా సమావేశం కాబోతున్నారు లంచ్‌ మీటింగ్‌లో మాట్లాడుకోబోతున్నారు. అందుకే వీరిద్దరి మీటింగ్‌ గురించి, సినిమా వర్గాల్లోనే కాదు, రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

చిరంజీవి జగన్‌ను ఎందుకు కలుస్తున్నారు?

ముఖ్యమంత్రి జగన్‌‌తో చిరంజీవి మీటింగ్‌, రాజకీయాలకు అతీతం. కేవలం సైరా సినిమా వీక్షించాలని, జగన్‌ను కోరబోతున్నారు చిరంజీవి. దేశంలో తొలి స్వాతంత్ర్య సమరయోధుడు, అందులోనూ రాయలసీమకు చెందిన సైరా నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా వీక్షించాలని ప్రత్యేకంగా అడగబోతున్నారు. ఈమధ్యనే తెలంగాణ గవర్నర్‌ తమిళసై ని కలిసి, సినిమా వీక్షించాలని కోరారు. చిరు ఆహ్వానంతో సైరా వీక్షించిన తమిళ సై, చిరంజీవి నటన అద్భుతమన్నారు. సైరా ప్రతి యువకుడూ, ప్రతి భారతీయుడూ చూడాల్సిన చిత్రమని పొగిడారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను సైతం, సైరా వీక్షించాలని కోరబోతున్నారు చిరంజీవి. మరి జగన్‌ చూస్తారా చూడరా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

జగన్‌-చిరు భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతా లేదా?

తమ్ముడు పవన్‌కు రాజకీయంగా ఇబ్బంది కాదా?

చిరంజీవి జగన్‌‌లు నేరుగా కలవడమే చాలా అరుదు. మైహోం అధినేత జూపల్లి రామేశ్వర రావు షష్టిపూర్తి కార్యక్రమంలో ఇద్దరూ ఒకసారి కలిశారు. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో మీట్‌ అయ్యారు. ఇప్పటి వరకూ పెద్దగా కలిసింది లేదు. రాజకీయంగా తలపడిందీలేదు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో చిరంజీవి తలపడినా, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, పెద్దగా ప్రచారము కూడా చేయలేదు చిరంజీవి. అంటే ఇద్దరికీ నేరుగా రాజకీయ వైరం లేదు. కానీ ప్రస్తుతం వీరిద్దరి భేటి, తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశముందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు. పాలిటిక్స్‌లో వచ్చినందుకు పశ్చాతాపపడుతున్నాని కూడా, బిగ్‌ బి సమక్షంలో, సైరా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే జగన్‌తో చిరు భేటి వెనక ఎలాంటి రాజకీయం లేదు. ఈ సమావేశం ద్వారా, చిరంజీవి కూడా అదే చెప్పాలనుకున్నారని తెలుస్తోంది. అయితే, జగన్‌తో భేటి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా ఇబ్బందిగా మారొచ్చన్న చర్చ జరుగుతోంది.

చిరు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేకపోయినా, జనసేనను స్థాపించిన పవన్‌, పాలిటిక్స్‌లో యమ జోరుగా వున్నారు. అందులోనూ యాంటి జగన్‌గా విమర్శలు కురిపిస్తున్నారు. వందరోజుల పాలనపై ఏకంగా బుక్‌లెట్‌ రిలీజ్ చేశారు. సైరా ప్రమోషన్‌లో భాగంగానే అన్నయ్య చిరంజీవి, జగన్‌తో భేటి అవుతున్నా, పవన్‌కు అనేక రకాలుగా కాస్త మైనస్‌ అవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

మెగా అభిమానుల్లో చీలిక రావడం ఖాయం. చిరు ఫ్యాన్స్‌ జగన్‌కు అనుకూలంగా మారే ఛాన్స్‌ వుంది. అలాగే కాపువర్గంలోనూ జగన్‌కు ప్రాబల్యం పెరగొచ్చు. ఉన్న కాస్త కాపు ఓటర్లు కూడా, చిరు స్నేహం ద్వారా జగన్‌ వైపు మళ్లితే, పవన్‌ ఓటు బ్యాంకుకు చిల్లులు పడ్డట్టేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కాపు నాయకులు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణ మోహన్‌లు, పవన్‌పై తమకెలాంటి నమ్మకం లేదన్నారు. భవిష్యత్‌లో ఇలాగే, చిరు జగన్‌లు ఫ్రీక్వెంట్‌గా కలుస్తుంటే, జగన్‌ ప్రభుత్వంపై పవన్‌ చేసే విమర్శలకు అంత ప్రాధాన్యత వుండదన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, జగన్‌తో భేటి ద్వారా, చిరు నాలుగు విషయాలు స్పష్టంగా చెప్పదల్చుకున్నారని అర్థమవుతోంది.

మొదటిది, పవన్‌ వేరు, తాను వేరు, రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు. రెండోది సైరా ప్రమోషన్. మూడోది, జగన్‌ను అదే పనిగా కలవడం ద్వారా, ఎలాగూ జనసేన అంత ప్రోగ్రెసివ్‌గా లేదు, దీంతో రాజకీయంగా పవన్‌ ఫెయిల్యూర్‌తో తనకెలాంటి సంబంధం లేదన్న సంకేతాలు పంపడం. నాలుగోది జగన్‌తో తనకు శత్రుత్వం లేదని చెప్పడం.

జగన్‌తో చిరుకు రాజకీయ వైరం పెద్దగా లేదనడానికి మరో ఉదాహరణ వుంది. సైరాకు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని, ఏపీ ప్రభుత్వాన్ని కోరారు చిరంజీవి. ఇస్తారో ఇవ్వరోనని టెన్షన్‌ పడ్డారు. అయితే, వైసీపీలో తనకు నమ్మిన బంటులైన మంత్రి కన్నబాబు వున్నారు. ఆయన ద్వారా, జగన్‌కు చెప్పించారని తెలుస్తోంది. దీంతో వెంటనే సైరా అదనపు ఆటలకు అనుమతి వచ్చింది. పీఆర్పీలో పని చేసిన కన్నబాబు ఒక్కరే కాదు, అవంతి శ్రీనివాస్, ఎంపీ గీత కూడా ప్రస్తుతం వైసీపీలోనే వున్నారు. అంటే, చిరు సన్నిహితులు ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో వున్నారు. ఆ విధంగా చూసుకున్నా చిరు-జగన్‌లకు మంచి రిలేషన్‌ వున్నట్టే.

అయితే, సీఎం జగన్‌తో చిరు భేటి వల్ల, ఇద్దరికీ ప్లస్సే. కానీ అంతిమంగా పవన్‌ కల్యాణ్‌కు మైనస్‌. తమ్ముడు ఎలాగూ రాజకీయాల్లో వున్నారు కాబట్టి, ఇలా నేరుగా తమ్ముడి ప్రత్యర్థి పార్టీ అధినేతను కలవడం ద్వారా, పవన్‌కు ఇబ్బందిపెట్టినట్టేనని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పైకి సినిమా ప్రమోషన్‌ అంటున్నప్పటికీ, కనపడని రాజకీయాలు మాత్రం చాలా ఇమిడి వున్నాయి. మొత్తానికి ఇద్దరు మహామహుల కలయిక, సినిమావర్గాల్లోనే కాదు, రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories