ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేతల యాత్రలు.. దాడుల రంగు పులుముకుంటున్న నిరసనలు

ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేతల యాత్రలు.. దాడుల రంగు పులుముకుంటున్న నిరసనలు
x
ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేతల యాత్రలు.. దాడుల రంగు పులుముకుంటున్న నిరసనలు
Highlights

విపక్ష నాయకుడు చంద్రబాబు వైజాగ్ యాత్రకు బ్రేక్ పడింది. కాస్తంత అటూ ఇటూగా మూడేళ్ళ క్రితం అప్పటి విపక్ష నేత జగన్ వైజాగ్ యాత్రను ఇది గుర్తు చేసింది....

విపక్ష నాయకుడు చంద్రబాబు వైజాగ్ యాత్రకు బ్రేక్ పడింది. కాస్తంత అటూ ఇటూగా మూడేళ్ళ క్రితం అప్పటి విపక్ష నేత జగన్ వైజాగ్ యాత్రను ఇది గుర్తు చేసింది. దాదాపుగా అవే సీన్స్ కాకపోతే పాత్రధారులే మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ యాత్రలు ఇచ్చే సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాజకీయాల్లో కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి. ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. అందుకే సేమ్ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. కాకపోతే పాత్రధారులే మారిపోతారు. ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు. ఈ తరహా సంఘటనలు ప్రజలకు అందించే సందేశమే ఇప్పుడు ఆందోళన కలిగించేదిగా మారింది.

ఆంధ్రప్రదేశ్ కు అచ్చొచ్చే రోజులు ఎప్పుడొస్తాయో అర్థం కావడం లేదు. అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలిన తరువాత చంద్రబాబు హయాం నడిచింది. మొదటి ఐదేళ్ళు ప్రత్యేక హోదా గొడవలే జరిగాయి. ఎన్నో మలుపులు మరెన్నో యూ టర్న్ లు. ఇక ఇప్పడు రాజధాని రగడ కొనసాగుతోంది. మరి కొన్నేళ్ళ పాటూ పరిస్థితి ఇలానే కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయపరమైన వివాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆ వివాదాలను నాయకులు డీల్ చేస్తున్న తీరు, వారు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఎవరూ కోరుకోని దిశగా నెడుతున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని అంటే ఎన్నికల్లో చూసుకుందాం అని అర్థం చేసుకోవాలి తప్పితే రహదారులను రణరంగంగా మార్చుకుందామని కాదు. దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా పరిస్థితులు ఆ దిశగానే వెళ్తున్నాయి.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆయనను విమానాశ్రయానికే పరిమితం చేయాలని భావించారు. వైజాగ్ నుంచి తిప్పి పంపేందుకే ప్రయత్నించారు. ఆయన వైజాగ్ లో పర్యటిస్తే గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఒక నాయకుడికి భద్రత కల్పించాల్సిన అవసరం వారికి ఉంది. అదే సమయంలో ఇలాంటి వాటిని విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. ఆ మైలేజ్ ఎలా ఉన్నప్పటికీ వారు చేసే వ్యాఖ్యలు మాత్రం అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉంటాయి. కార్యకర్తల్లో ప్రజల్లో ఒక విధమైన చట్ట ధిక్కార ధోరణిని ప్రోత్సహిస్తుంటాయి.

కాలం గడుస్తున్న కొద్దీ ప్రజాస్వామ్యం మరింత పరిపక్వత చెందాలి. నాయకులు మరింత పరిణతి చెందాలి. పరిస్థితులు ఎలాంటివైనా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యవస్థలో భాగంగానే పరిగణించాలి. మార్పు కోసం కృషి చేయాలి. కాకపోతే కొన్నేళ్ళుగా నాయకులు రివర్స్ గేర్ లోనే వెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతీ అంశం కూడా తీవ్రస్థాయిలో వివాదం అయ్యే అవకాశం ఉంది.

విపక్షనేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాయకుల విమర్శలు, ఆగ్రహ వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ నేతలపై భౌతిక దాడి జరగడం మరింత ఆందోళన కలిగించేదిగా మారుతోంది. ఇటీవలి కాలంలో అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకులపై దాడి ప్రయత్నాలు జరిగాయి. తాజాగా వైజాగ్ లో చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ ప్రయత్నాలు చేసింది ప్రజలైనా పార్టీల కార్యకర్తలైనా ఐక్యవేదిక ప్రతినిధులైనా వాటిని సమర్థించలేం. మరో వైపున ఇలాంటి దాడులకు పాల్పడుతున్నది పెయిడ్ ఆర్టిస్టులనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. అదే గనుక నిజమైతే అంతకు మించిన దుస్థితి మరొకటి ఉండదు. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంఘటనలు చివరకు ప్రజాస్వామ్యాన్నే బలహీనం చేస్తాయి. ఆ విషయాన్ని అంతా గుర్తించాల్సిన అవసరం ఉంది.

నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అధికారపక్షం, విపక్షం రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివి. ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. అలాగాకుండా ఉండాలనే మనమంతా కోరుకుందాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories