TDP: పార్టీలో భారీ మార్పు దిశగా చంద్రబాబు కీలక నిర్ణయాలు

Chandrababu to Take Massive Decision Over Party Affairs
x

TDP: పార్టీలో భారీ మార్పు దిశగా చంద్రబాబు కీలక నిర్ణయాలు

Highlights

TDP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను మారతానని చెప్పారు. మరి నిజంగానే మారారా? ఆయన మారగలరా? ఈ అనుమానాలేవీ అక్కర్లేదు.

TDP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను మారతానని చెప్పారు. మరి నిజంగానే మారారా? ఆయన మారగలరా? ఈ అనుమానాలేవీ అక్కర్లేదు. ఆయన నిజంగానే మారిపోయారు. అయితే అది ఎలాంటి మార్పు? పార్టీలో, ప్రభుత్వంలో రొటీన్ కి భిన్నంగా ఆయన చాలా కీలకమైన మార్పులు చేశారు. సీనియర్లకు జీర్ణం కాని మార్పులను చంద్రబాబునాయుడు అమల్లోకి తెస్తున్నారు. ఆ విశేషాలేంటి? వాటి ప్రభావాలెలా ఉంటాయి?

ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు మార్పొక్కటే శాశ్వతమని మన పెద్దలు అనుభవ పూర్వకంగా చెబుతారు. ఆ మార్పును ఆహ్వానిస్తే అది నువ్వు చెప్పినట్టు వింటుంది. ఆహ్వానించకపోతే అది చేయాల్సిన పని చేసేస్తుంది. అందుకే చంద్రబాబులాంటి రాజకీయ ప్రజ్ఞ గల నాయకులు అవసరాలకు అనుగుణంగా, సమయానికి తగినట్టుగా మార్పులను స్వాగతిస్తూ ఉంటారు. ఆ ఒరవడిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్పు వైపు అడుగులు వేస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన టీం మొత్తాన్ని అభివృద్ధిని అందుకునే దిశగా, ఆధునికత వైపుగా పరుగులు తీయించే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఏపీ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా సంస్థాగతంగా టీడీపీ నిర్మాణంలో కీలకపాత్ర వహిస్తుంది అంటున్నారు.

ఏపీలోని కేసరపల్లిలో ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 17 మంది తొలిసారిగా మంత్రులు అవుతున్నవారే ఉన్నారు. అంటే సగం కన్నా ఎక్కువ మంది అసెంబ్లీకి కొత్తవాళ్లే అన్నమాట. ఏడుగురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండడం విశేషం. సరిగ్గా ఈ మార్పే టీడీపీ నేతల్లో నానారకాల ఆలోచనలకు దారి తీస్తోంది.

ఇది చంద్రబాబునాయుడు సహజమైన వ్యవహార దక్షతకు భిన్నమైన నిర్ణయంగా టీడీపీ ఇన్నర్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మంత్రులుగా కొత్తవారి ప్రమాణ స్వీకారంపై సీనియర్లలో, అమాత్య పదవుల ఆశావహుల్లో ఊహాగానాలకు తావిస్తోంది. చంద్రబాబు కేబినెట్ పాత, కొత్తల మేలు కలయికగా కనిపిస్తున్నా 17 మంది కొత్తవారికి చోటివ్వడంపై యువతరానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నిర్ణయాలు పార్టీకి మేలు చేస్తాయన్న అభిప్రాయాలు పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతుండగా అమాత్యుల పదవులు ఆశించిన సీనియర్ల నుంచి ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

నిజానికి చంద్రబాబు దిసీనియర్లను పక్కన పెట్టే స్వభావం కాదంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు. సీనియర్లకు ఎంతో అనుభవం ఉంటుందని.. వారి అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకోవాలనేది బాబు మార్కు ఫిలాసఫీ. అది నిజం కూడా. దందుడుకు స్వభావం ప్రదర్శించే కుర్రకారుకు కీలకమైన పగ్గాలు అప్పజెబితే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే అనుమానం బాబులో ఉంటుందని.. అందుకని ఇప్పటివరకు ఆయన సీనియర్లకే పెద్దపీట వేశారని చెబుతుంటారు. కానీ తాజా కేబినెట్లో మాత్రం రొటీన్ కి భిన్నంగా తాను సరికొత్త చంద్రబాబునాయుడిగా మారిపోయానని చెబుతూ ఆయన తీసుకున్న నిర్ణయమే రుజువు చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నీ తామై నడిపించిన సీనియర్లు టీడీపీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా మంత్రివర్గంలో చోటు ఆశించారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ కేబినెట్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, రఘురామ కృష్ణంరాజు, బోండా ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన్, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్ధన్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, అమరనాథ్ రెడ్డి ఇలా టీడీపీలో పాపులారిటీ సంపాదించుకున్న నేతలంతా కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశించారు. తమ రేపటి భవిష్యత్తు కోసం ఎన్నెన్నో అంచనాలు వేసుకున్నారు. కానీ వారు ఆశించింది జరగలేదు. చంద్రబాబునాయుడు తన పాలనలో కొత్తమార్కు వేసుకుంటున్నానని ప్రమాణ స్వీకారం రోజునే క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడీ అంశమే టీడీపీలోనే గాక.. ఏపీ రాజకీయాల్లో కూడా తీవ్రమైన చర్చాంశంగా మారింది.

కేబినెట్లో యువతకు భారీ ప్రాధాన్యత ఇవ్వడంలో చంద్రబాబు చాలా ముందుచూపుతోనే వ్యవహరించారంటున్నారు. టీడీపీలో చంద్రబాబే అధినేత. ఆయన చెప్పిందే శాసనం... చేసిందే నిర్ణయం. పైనుంచి, కిందిదాకా ఎటు చూసినా బాబు తప్ప మరో నాయకుడు కనిపించేవాడు కాదు. అలాంటి సీన్ ను కాస్త సర్దుబాటు చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు తరువాత ఎవరు అనే ప్రశ్నకు కొంతకాలం క్రితం వరకూ అసలు జవాబే ఉండేది కాదు. ప్రజా బాహుళ్యంలో అలాంటి అనుమానాల నివృత్తి కోసమే లోకేశ్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీ నుంచే లోకేశ్ ను రాజకీయాల్లో ఫుల్ టైమర్ గా ప్రొజెక్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నా.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత మరింత ఫోకస్డ్ గా లోకేశ్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవి కట్టబెట్టి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. మిగతా నాయకులు కూడా లోకేశ్ కు అన్నివిధాలా సహకరిస్తూ వస్తున్నారు.

అటు లోకేశ్ కూడా తనకు రాజకీయాలు తప్ప మరో యావ లేదన్నట్టుగా రియాక్ట్ అవుతున్నారు. 2019లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. లోకేశ్ ను ఇంత ఒత్తిడికి గురిచేసి ఒకరకంగా రాటు దేలేలా చేసిన ప్రయోగం చంద్రబాబు నుంచే వచ్చిందని.. అది కాస్తా భారీ రెస్పాన్స్ తో సక్సెస్ అయ్యిందన్న టాక్ ఏపీ పాలిటిక్స్ లో వినిపిస్తోంది. ఆ విధంగా చంద్రబాబు తన తరువాత లోకేశ్ కోసం భారీ స్ట్రాటజీ వర్కవుట్ చేశారని.. గ్రౌండ్స్ అన్నీ ప్రిపేర్ చేసే క్రమంలోనే లోకేశ్ కు ఫ్యూచర్ టీమ్ ఏర్పడేలా చేయడమేనని అంటున్నారు.

కేబినెట్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో యనమల రామకృష్ణుడు లాంటి కొందరు సీనియర్లు చంద్రబాబుకు సూచించారు. అటు భవిష్యత్తంతా యువతరానిదేనని లోకేశ్ నేతృత్వంలో పార్టీకోసం పని చేయాల్సి ఉంటుందని పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించింది. అందుకు తగ్గట్టే యువతరానికి పెద్ద పీట వేసి లోకేశ్ నేతృత్వంలో పనిచేసేలా చంద్రబాబు గ్రౌండ్స్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. రెండోతరాన్ని సిద్ధం చేయడం ద్వారా పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నారని చెబుతున్నారు. మరి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి సీనియర్లు సహకరిస్తారా? ఎంతవరకు సహకరిస్తారు.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం టీడీపీ సీనియర్లను నిరాశపరచినా.. వారి అసంతృప్తి కొంతవరకే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీలో ఉండే చాలా మంది పార్టీకి, అధినేత నిర్ణయాలకు కట్టిబడే ఉంటారన్న పేరుంది. కొన్ని జాతీయ పార్టీల్లో లాగా విపరీతమైన ప్రజాస్వామ్యం టీడీపీలో ఉండే చాన్స్ లేదు. అధిష్టానం మాటే ఫైనల్. అలాంటివారినే చంద్రబాబు ప్రోత్సహిస్తారన్న పేరుంది. ఓపిగ్గా పార్టీకి సహకరించినవారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని చంద్రబాబు చెబుతూ ఉంటారు. అలాంటివారిని గుర్తించిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయంటారు పార్టీ సీనియర్లు. కాబట్టి.. ఈ కోణంలో చూసినప్పుడు సీనియర్ల అసంతృప్తి అనేది టీ-కప్పులో తుఫానులాంటిదే అంటున్నారు.

మొత్తానికి మారిన చంద్రబాబును చూస్తారని చెప్పిన టీడీపీ అధినేత.. మొదటి నిర్ణయంగా చాలా కీలకమైన, ఒకింత సాహసోపేతమైన అడుగే వేశారంటున్నారు. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories