చంద్రబాబు, రేవంత్ ల భేటీ: విభజన అంశాలపైనే ప్రధాన చర్చ

చంద్రబాబు, రేవంత్ ల భేటీ:  విభజన అంశాలపైనే ప్రధాన చర్చ
x

చంద్రబాబు, రేవంత్ ల భేటీ: విభజన అంశాలపైనే ప్రధాన చర్చ

Highlights

విభజన సమస్యలపై ఈనెల 6వ తేదీన భేటీ అవుదామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

విభజన సమస్యలపై ఈనెల 6వ తేదీన భేటీ అవుదామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చే అంశాలేంటి? ఆ భేటీకి ముందు రేవంత్ రెడ్డి ఏ అంశాలపై ప్రిపేర్ అవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఇన్‎పుట్స్ తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు వచ్చే కీలకమైన అంశాలేంటి?

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా.. ఆస్తుల విభజన, వనరుల విభజన అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పని చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిగాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ తరువాత సమావేశాలు అస్సలు జరగలేదు. ఆ సమావేశంలో షెడ్యూల్ 9కి చెందిన 8 కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం కుదిరింది. మిగిలిన ఏ ఇతర అంశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు.

రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నవాటిలో ప్రధానమైంది షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ప్రక్రియ. షెడ్యూల్ 9లో 91 సంస్థలు ఉండగా, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 9 సంస్థల విషయంలో షీలా భిడే సిఫారసుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది. మరో 23 సంస్థల విభజనపై కేంద్రానికి అభ్యంతరాలు తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనం మేరకు షెడ్యూల్ 9 సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది. అటు ఎంహెచ్ఏ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ, మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది. షెడ్యూల్ 9లో ఉన్న ప్రాపర్టీస్ హెడ్ క్వార్టర్ తోపాటు ఎక్కడున్నా పంచాలనే డిమాండ్ ను నిబంధనలకు విరుద్ధంగా ముందుకు తెచ్చింది ఏపీ.

షెడ్యూల్ 10 సంస్థల విషయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం షెడ్యూల్ 10 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంచి, ఉద్యోగుల విభజన చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా ఏపీ తన మొండివైఖరిని ప్రదర్శిస్తూ చట్టానికి అతీతంగా ఆ ఆస్తుల విభజన జరగాలని పట్టు పడుతోంది. ఇక షెడ్యూల్ 9లోని దక్కన్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్-దిల్, ఆర్టీసీ, హౌజింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి. దిల్ సంస్థకు 5 వేల ఎకరాలు, ఎస్ఎఫ్సీకి 400 ల ఎకరాలు.. హౌజింగ్, ఆర్టీసీలకు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూముల రూపంలో, భవంతుల రూపంలో, అకౌంట్లలో నగదు రూపంలో ఆస్తులు ఉన్నాయి. అయితే గతం నుంచీ ఏపీకి వాటా కావాలని అక్కడ గత పాలకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

రాష్ట్ర విభజన తరువాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతీ సందర్భంలోనూ ఏపీ అమలు కాని కోరికలు కోరుతూ వస్తుంది అంటున్నారు తెలంగాణ అధికారులు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శిలతో సమావేశమైన తరువాత ఆ ఇన్‎పుట్స్ ఆసరాగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తారు. అయితే గతంలో ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారి హయాంలో ఏం జరిగినా అది గతం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు మారారు. ఈ క్రమంలో ప్రభుత్వాల విధానాలు మారుతాయా? లేక పాత విధానాలనే కొనసాగిస్తారా? అనేది 6వ తేదీ సమావేశం తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories