Chandrababu Naidu Cabinet: చంద్రబాబు మంత్రుల ఎంపిక... 7 ముఖ్యాంశాలు
మంత్రివర్గం ఏర్పాటులో చంద్రబాబు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నారు. పాత వారితో పాటు కొంతమంది కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.
చంద్రబాబు నాయుడు జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో కలిపి చూస్తే ఆయన సీఎంగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. ఈసారి ఆయన మంత్రివర్గంలో 24 మందికి చోటు దక్కింది. మరో స్థానం ఖాళీగా ఉంది. మంత్రివర్గం ఏర్పాటులో చంద్రబాబు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నారు. పాత వారితో పాటు కొంతమంది కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఏపీ క్యాబినెట్ -2024 కూర్పులో తెలుసుకోవాల్సిన 7 ముఖ్యాంశాలివే.
1. పార్టీల వారిగా పంపకాలు
చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు మూడు, బీజేపీకి ఒక్క బెర్త్ దక్కింది. మిగిలిన 21 స్థానాల్లో టీడీపీ సభ్యులకే కేబినెట్ బెర్తులో చోటు దక్కింది. కూటమిలోని పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని దానికి అనుగుణంగా మంత్రి పదవులను కేటాయించారు. జనసేన నుండి కొణిదెల పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేశారు.
2. క్యాబినెట్లో కొత్త ముఖాలు
చంద్రబాబు నాయుడు కేబినెట్ లో 17 మంది కొత్తవారున్నారు. చాలా జిల్లాల్లో సీనియర్లను పక్కన పెట్టారు. పరిటాల సునీత, కిమిడి కళా వెంకట్రావు, కన్నా లక్ష్మినారాయణ వంటి మాజీ మంత్రులకు కూడా చోటు దక్కలేదు. అంతేకాదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లను కూడా పక్కనపెట్టారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన టీజీ భరత్ కు చంద్రబాబు కేబినెట్ లో అవకాశం దక్కింది. టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నారు. భరత్ టీడీపీలోనే కొనసాగారు. అయితే, ఈ జిల్లాలో భూమా, కేఈ, కోట్ల, గౌరు కుటుంబాల నుంచి కూడా ఎవ్వరినీ చంద్రబాబు ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. విజయనగరం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గెలిచిన కిమిడి కళా వెంకట్రావును కాకుండా ఇదే జిల్లాలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గుమ్మడి సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీన్ని బట్టి క్యాబినెట్లో కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బాబు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
3. మహిళలు, సామాజిక వర్గాల వారీ కేటాయింపులు
ఈసారి మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, 12 మంది ఓసీలు, ఎస్టీ, మైనారిటీ, ఆర్యవైశ్య వర్గాలలో ఒక్కొక్కరికి కేబినెట్ లో చోటు దక్కింది. ఈ కేబినెట్ లో నలుగురు కమ్మ, నలుగురు కాపులు, ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు.
4. సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన పయ్యావుల కేశవ్
ఉరవకొండ నుండి గెలిచిన పయ్యావుల కేశవ్ కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలిచిన ప్రతిసారీ రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమైంది. 1994, 2024లలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన సమయంలో మాత్రమే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మిగిలిన అన్ని సమయాల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కేశవ్ మాత్రం ఎమ్మెల్యేగా గెలువలేదు. దీంతో ఆయనకు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఈ సెంటిమెట్ ను బ్రేక్ చేస్తూ కేశవ్ ఈసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం జిల్లా నుండి పయ్యావుల కేశవ్ మంత్రివర్గంలో చోటు దక్కింది.
5. సీమలో సీనియర్లకు.. నో
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఈసారి పరిటాల సునీతకు కాకుండా కమ్మ సామాజిక వర్గం నుండి పయ్యావుల కేశవ్ కు చోటు లభించింది. పెనుకొండ నుండి తొలిసారి విజయం సాధించిన సవితకు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది. కురుబ సామాజికవర్గానికి చెందిన సవితకు ఈసారి చంద్రబాబు అవకాశం కల్పించారు. ధర్మవరం అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు దక్కింది. బీజేపీకి ధర్మవరం అసెంబ్లీ సీటును కేటాయించినందున ఈ స్థానంలో పరిటాల శ్రీరామ్ కు ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కలేదు. సత్యకుమార్ గెలుపులో పరిటాల శ్రీరామ్ కీలకంగా వ్యవహరించారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో పరిటాల కుటుంబానికి ఈసారి కేబినెట్ లో చోటు దక్కలేదు.
6. మాజీలలో కొందరికే మంత్రి పదవులు
మాజీలు, సీనియర్ల విషయానికి వస్తే.. గతంలో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూక్, పొంగూరు నారాయణ, నారా లోకేష్ లకు కేబినెట్ లో చోటు దక్కింది. ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి. నారాయణ, లోకేష్ లు మాత్రం చంద్రబాబు కేబినెట్ లో పనిచేశారు. ఎన్ఎండీ ఫరూక్ ఎన్టీఆర్ కేబినెట్ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది.
7. గెలుపు గుర్రాలకు పెద్దపీట
వరస విజయాలు సాధిస్తున్న నాయకులకు కూడా ఈ మంత్రివర్గంలో ప్రాధాన్యం లభించింది. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన వంగలపూడి అనితకు మంత్రివర్గంలో చోటు దక్కింది. 2014లో ఆమె పాయకరావుపేట నుండి గెలిచారు. కానీ, 2019లో ఓడిపోయారు. మళ్ళీ ఇదే స్థానం నుంచి 2024లో గెలుపొందారు. 2014 నుండి పాలకొల్లు నుండి వరుసగా గెలుపొందిన నిమ్మల రామానాయుడికి చోటు దక్కింది. రేపల్లె నుండి వరుస విజయాలు సాధిస్తున్న అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లాకు చెందిన డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టి రవికుమార్ కు కేబినెట్ లో చోటు దక్కింది. 2014 లో వైఎస్ఆర్ సీపీ నుండి నెగ్గిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్ సీపీ నుండి టీడీపీలో చేరిన బీసీ నాయకుడు కొలుసు పార్థసారథి కూడా మంత్రి అయ్యారు. కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె నుండి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం లభించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire