ప్రపంచాన్ని వణికించింది వికీలీక్స్. దేశాధినేతల పీఠాలు కదిలించింది స్విస్ లీక్స్. ప్రపంచ ఫుట్‌బాల్ విజేత ఎవరో జోస్యం చెప్పింది ఆక్టోపస్. ఇప్పుడు...
ప్రపంచాన్ని వణికించింది వికీలీక్స్. దేశాధినేతల పీఠాలు కదిలించింది స్విస్ లీక్స్. ప్రపంచ ఫుట్‌బాల్ విజేత ఎవరో జోస్యం చెప్పింది ఆక్టోపస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఓ మంత్రిగారి లీక్స్, ప్రకంపనలు రేపుతోంది. ఆయన జరిగింది చెబుతారు జరగబోయేది చెబుతారు వున్నది లేనట్టుగా, లేనిది వున్నట్టుగా, ఏదో చెబుతూ కనికట్టు చేస్తారు. రాజధాని మార్పు నుంచి ఎన్డీయేలో వైసీపీ చేరడం గురించి, ఆయన లీక్స్ చేశారో, ఏదో అలా మాట్లాడారో కానీ, ఆ మాటలు మాత్రం సంచలనం అవుతున్నాయి. ఆయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో, ఆయన ప్రస్తుతం చెబుతున్నవి కూడా రేపు నిజమవుతాయన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయనెవరు ఆ మంత్రిగారు సొంతంగా చెబుతున్నారా ఎవరైనా మాట్లాడిస్తున్నారా? మాటల వెనక మతలబు క్యాహై?
ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న బొత్స చేస్తున్న కీలకమైన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి, సీఎం అమలు చెయ్యబోయే ప్రతి నిర్ణయాన్ని బొత్సాతో చెప్పిస్తున్నారా,అమరావతి నుంచి విశాఖపట్నం దాకా పరిపాలన పరమైన విధానాలలో హింట్స్ ఇస్తున్న బొత్సా తన వ్యాఖ్యల్ని పదే పదే ఎందుకు వెనక్కు తీసుకుంటున్నారు అస్సలు బొత్సా వ్యాక్యలవెనుక ఉన్న స్టాటిజి ఏమిటి వాచ్ దిస్ స్టోరీ.
ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. విపక్ష నేతలతో పాటు, కేంద్ర ప్రభుత్వంపై ఆయన కొద్ది రోజులుగా చేస్తున్న కామెంట్స్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రెస్‌మీట్ పెట్టి పరిపాలనాపరమైన అంశాలతో పటు రాష్ట్రంలో రాజకీయంగా వైసీపీ తీసుకోబోయే ప్రతినిర్ణయాన్ని చెప్తున్న బొత్స, తిరిగి వెనువెంటనే వాటిని ఖండించడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని అమరావతితో పాటు బీజేపీ వైసీపీ పొత్తు వరకు బొత్స చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు విపక్ష నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు. మొదటి నుంచి బొత్స చేస్తున్న ప్రతి ప్రకటన వెనుకా, బలమైన కారణం ఉంటుందని అంటున్నారు సొంత పార్టీ నేతలు. ప్రస్తుతం ఏపీలో అట్టుడుకుతోంది రాజధాని అంశమే. రాజధాని మార్పునకు సంబంధించి మొదట హింట్ ఇచ్చింది కూడా మంత్రి బొత్స సత్యనారాయణే.
డైరెక్టుగా రాజధాని తరలింపు ఉంటుందని అయన చెప్పకపోయినా, అమరావతిలో ఏముందని అంటూ కామెంట్ చేశారు. అప్పుడు చేసిన కామెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అతికినట్టు సరిపోతోంది. అలాగే మరోసారి అమరావతిలో శ్మశానం తప్ప ఏముందని కామెంట్ చేసినప్పుడే, రాజధానిని ఇక్కడ ఉంచే ఉద్దేశం లేదన్న అంశం అర్థమైపోయింది. మంత్రిస్థాయిలో బొత్స చేసిన వ్యాఖ్యలు అమరావతిలో అలజడులు, ఆందోళలకు కారణమయ్యాయి. దీంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించిన బొత్స, తరువాత తీరిగ్గా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆ తరువాత మళ్లీ కట్టుబడి ఉన్నానంటూ కామెంట్ చేస్తారు. ఇలా కొన్ని ఔననీ, ఇంకొన్ని కాదని చేస్తున్న వ్యాఖ్యల వెనుక, బొత్స ఒక్కరే లేరని, ఆయనతో ఎవరో అలా మాట్లాడిస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు నాడే కాదు, నేడూ పసిగడుతున్నారు.
రాజధాని విషయంలో అనేక వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన బొత్స, ఇప్పుడు ఎన్డీయేతో పొత్తు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవసరమైతే ఎన్డీయేలో కలుస్తామంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, ఎంత సంచలనం సృష్టించాయో చూశాం. డైరెక్టుగా బొత్స ఆ మాట అనకపోయినా ఏపీ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం ఎంతమంది గడ్డాలైనా పట్టుకుని బతిమలాడతాం అంటూ కామెంట్ చేశారు. జగన్ ఢిల్లీ టూర్‌లో ప్రధానిని, అమిత్‌షాను, కేంద్ర పెద్దలను కలిసి తరువాత వెంటనే బొత్స నుంచి ఈ కామెంట్ రావడంతో కేంద్రంలో వైసీపీ చేరడం ఖాయం అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అమరావతి విషయంలో మొదటి నుంచి బొత్సా చెప్పింది జరిగిందని అంటున్న విపక్ష నేతలు, రాబోయే రోజుల్లో వైసీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమని, అందుకే బొత్సతో లీకులు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగింది. బొత్స వ్యాఖ్యల ప్రకంపనల ప్రభావంతో, ఏకంగా జనసేన అధినేత పవన్ స్పందించాల్సి వచ్చింది. బీజేపీ-వైసీపీ పొత్తు వుంటే, తాము బీజేపీకి దూరం జరుగుతామన్నారు పవన్. బొత్స మాటల సునామీకి పవన్ కామెంట్లే ఎగ్జాంపుల్.
బొత్స మాటలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంతంగా చేస్తున్నవి కాదన్నది మాత్రం తెలుస్తోంది. తెర వెనుక ఉండి, ఎవరో బొత్సతో మాట్లాడిస్తున్నారన్న విషయం, అర్థమవుతోందన్న మాటలు వినపడ్తున్నాయి. బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి. వైఎస్ హయాంతో పాటు రోశయ్య, కిరణ్‌ల టైంలోనూ కీలకమంత్రిగా పని చేశారు. ఒక దశలో సీఎం అభ్యర్థిగానూ ప్రచారంలోకి వచ్చారు. జగన్ హయాంలోనూ కీలకమైన పట్టణాభివృద్ది, పురపాలక మంత్రి. రాజధాని అంశం కూడా బొత్స పరిధిలోనిదే. దీంతో బొత్స చేసే కామెంట్లకు చాలా ప్రాధాన్యత వుంటుంది. అందుకే వైసీపీ ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా బొత్సతో మాట్లాడిస్తున్నారని, అది చర్చనీయాంశం అయ్యేలా చూస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. జనంతో పాటు విపక్షాల్లోనూ చర్చనీయాంశం అవుతాయి కాబట్టి, ఆ నిర్ణయం ప్రభావం ఎలా వుంటుందో అంచనా వేయొచ్చు. గతంలో చంద్రబాబు కూడా, ఇలాగే లీకులిచ్చేవారట. ఇప్పుడు బొత్సతో నేరుగా లీకులిప్పించి, ప్రజాభిప్రాయాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న బొత్స, ఆలోచన లేకుండా చెయ్యరని, పొలిటికల్ మైండ్ గేమ్‌లో భాగంగా, ఆయనతో ప్రకటనలు చేయిస్తున్నారని, పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire