టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ ఏ స్ట్రాటజీకి పదును పెడుతోంది?
అసలే అరకొర ఎమ్మెల్యేలతో తెలుగుదేశం అల్లాడిపోతోంది. క్షేత్రస్థాయిలో పునరుజ్జీవం కోసం పోరాడుతోంది. ఇలాంటి టైంలో, ఓ బీజేపీ సీనియర్ నేత, టీడీపీ గుండెల్లో...
అసలే అరకొర ఎమ్మెల్యేలతో తెలుగుదేశం అల్లాడిపోతోంది. క్షేత్రస్థాయిలో పునరుజ్జీవం కోసం పోరాడుతోంది. ఇలాంటి టైంలో, ఓ బీజేపీ సీనియర్ నేత, టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించే మాట అనేశారు. ఆ నేత కామెంట్లు కమలంలో జోష్ నింపుతుంటే, తెలుగుదేశం మాత్రం కారాలు మిరియాలు నూరుతోంది. ఇంతకీ బీజేపీ సీనియర్ నేత, టీడీపీ మీద ఏమన్నారు ఆ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి రాబోయే రోజుల్లో, ఏపీలో ఆ మాటల తాలుకు ప్రకంపనలు నిజంగా ఎలా ఉండబోతున్నాయా?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలు. ఎన్నికలైన తర్వాత టీడీపీ నుంచి బీజేపీకి పెరుగుతున్న వలసలు, కొన్ని రోజుల్లో మరింతమంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కాషాయగూటికి చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో, సోము వీర్రాజు కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలను మొత్తం, తమవైపు లాగేసుకుంటామని అన్నారు సోము వీర్రాజు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను బీజేపీలో కలుపుకుంటామన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనని కలిశారని, త్వరలోనే ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నేతలు బీజేపీలోకి వస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాబోయే కొన్ని రోజుల్లో, ఏపీలో బీజేపీ ప్రకంపనలకు, సోము వీర్రాజు కామెంట్లే సంకేతాలన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. సోము వీర్రాజు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, అతిత్వరలోనే శాసన సభలో బీజేపీ అధ్యక్షా అనడం ఖాయమని అర్థమవుతోంది. టీడీపీని చీల్చి, సగానికి కంటే ఎక్కువమందిని లాగి, తమను బీజేపీ పక్షంగా గుర్తించాలని, స్పీకర్‌ను కోరే అవకాశముంది. ఒకవేళ స్పీకర్ ఆమోదిస్తే, అసెంబ్లీలో బీజేపీ ఖాతా తెరిచినట్టే. మరి పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేదిలేదంటున్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఒకవేళ టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటికి వచ్చి, తమను బీజేపీ సభ్యులుగా గుర్తించాలని కోరితే, ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.
ఇంతకీ ఎవరెవరు కమలంలో చేరబోతున్నారు?
గంటా తనతో పాటు ఎవరెవరికి కాషాయతీర్థం ఇప్పించబోతున్నారు?
గంటా శ్రీనివాస రావు. మాజీ మంత్రి. విశాఖ టీడీపీకి కీలక నేత. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఈయన మనసు, మనసులో లేదు. ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి జంప్ అవుదామా అని చూస్తున్నారు. అయితే, వైసీపీలోకి వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా, రాజీనామా నిబంధన అడ్డువస్తుండటంతో, వెళ్లలేకపోయారు. దీంతో మిగిలింది బీజేపీయేనని డిసైడయ్యారు. అందుకే పార్టీకి కార్యక్రమాలకు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న గంటా, మొన్ననే ఢిల్లీలో తిష్టవేసి, బీజేపీ పెద్దలతో అన్ని విషయాలు మాట్లాడుకున్నారట. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఆయన భేటి అయిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోము వీర్రాజు చెప్పినట్టు, టీడీపీ ఖాళీ అవ్వడం ప్రారంభిస్తే, అది గంటాతోనే మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.
గంటా ఒక్కడే కాదు, టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలను సైతం, తనతో పాటు కమలంలో చేర్పించేందుకు ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో గంటా ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. సుజనా చౌదరితోనూ మాట్లాడించారని సమాచారం. అలాగే విశాఖ జిల్లాకే చెందిన మరో తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా, కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని ఊహాగానాలు వినపడుతున్నాయి. వీరే కాదు, గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సైతం, సుజనాతో నిత్యం మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇక అనంతపురంలో ఓ తెలుగుదేశం కీలక ఎమ్మెల్యే కూడా సైకిల్ దిగి, గంటాతో కలిసి కమలంలో వాలిపోదామని డిసైడయ్యారట. ప్రకాశంలోనూ ఒక టీడీపీ ఎమ్మెల్యే కమలం తీర్థం పుచ్చుకుంటానని, సుజనాకు హామి ఇచ్చారట. దీన్ని బట్టి చూస్తుంటే, అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారని అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యేల వలసలపై మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్లపై బీజేపీ కన్నేసిందని, వారిని సెలక్ట్ చేసుకుందని తెలుస్తోంది. అందుకే టీడీపీకి చెందిన కొందర్ని, పార్టీలోకి తీసుకోవద్దని, స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా, వైసీపీ కీలక నాయకులతో అన్నారట. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం, పార్టీలో చేర్చుకోవద్దని, అతను తమకు కావాలని కాషాయ అగ్రనేతలు వైసీపీ నాయకులకు స్పష్టం చేశారట. వారు వస్తామన్నా చేర్చుకోవద్దని స్పష్టంగా చెప్పారట. ఇందులో భాగంగానే గంటాతో పాటు మరో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో చక్రంతిప్పి, మరికొందర్నీ పార్టీలో చేర్పించుకుని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కంకణం కట్టుకుందట కాషాయదళం. తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. అంటే, త్వరలో అసెంబ్లీలో బీజేపీ అధ్యక్షా అనే అవకాశముంది.
మరి ఇప్పటికే రాజ్యసభ ఎంపీలను కోల్పోయిన చంద్రబాబు, మిగిలిన 23 మంది ఎమ్మెల్యేలనూ కోల్పోతారా వీరిని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. అలాగే పార్టీ ఫిరాయింపులు జరిగితే, స్పీకర్ తమ్మినేని ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనర్హత వేటు వేస్తారా అన్నది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. చూడాలి, సోము వీర్రాజు చెప్పినట్టు టీడీపీ ఖాళీ అవుతుందో 23 మందిలో సగాన్ని కోల్పోతుందో రెండూ లేదంటే, 23 మంది ఎమ్మెల్యేలు కట్టుదాటకుండా బాబు మాట వింటారో రానున్న కొన్ని రోజులు, ఏపీలో రాజకీయ పరిణామాలు హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire