మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా కంప్లీట్ చేసుకుని దసరాకు దూసుకొస్తోంది. అయితే ఇంతలోపే ఆయన...
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా కంప్లీట్ చేసుకుని దసరాకు దూసుకొస్తోంది. అయితే ఇంతలోపే ఆయన పొలిటికల్ ప్రొడక్షన్‌పై, ఊహాగానాల టీజర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. అతి త్వరలో చిరంజీవి గురించి ఒక సంచలన వార్త వింటారంటూ, సామాజిక మాధ్యమాల్లో ఒక ఊహాగానం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటది నిజమేనా నిజంగా ఊహాగానమా ?
మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. బాహుబలిని మించిన రేంజ్‌లో సినిమా ఉంటుందని, ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారాయన. అయితే ఆయన పొలిటికల్ రీఎంట్రీ గురించి వస్తున్న ఊహాగానాలు, మరోసారి చిరు రాజకీయంపై హాట్‌హాట్ చర్చను రేకెత్తిస్తున్నాయి.
2009లో ప్రజారాజ్యాన్ని స్థాపించి, 18 ఎమ్మెల్యేలను గెలిపించుకుని, ఆ తర్వాత కాంగ్రెస్‌లో దాన్ని విలీనం చేసి, కేంద్రమంత్రిగానూ చేశారు చిరంజీవి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భూస్థాపితమైంది. దీంతో చిరంజీవి కూడా రాజకీయాలకు దూరంపాటిస్తున్నారు. చివరకు తమ్ముడు స్థాపించిన జనసేనపై ఇప్పటి వరకూ కామెంట్ చేయలేదు చిరు. ఎన్నికల ప్రచారంలోనూ మద్దతు పలకలేదు. అయితే ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌పై ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన బీజేపీ, దానిలో భాగంగానే చిరంజీవికి గాలమేస్తోందంటూ కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతుండటం, మళ్లీ చిరంజీవిపైకి చర్చను మళ్లిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక్కసీటు సంపాదించకపోయినా, ఎలాగైనా బలపడాలని తపిస్తోంది బీజేపీ. అందుకోసం ఢిల్లీ నుంచే సామదాన దండోపాయాలను ప్రయోగిస్తోంది. తెలుగుదేశాన్ని రీప్లేసి చేసి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. దానిలో భాగంగానే మొన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలకు కండువా కప్పింది. అతి త్వరలో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో, సగానికి పైగా ప్రజాప్రతినిధులను ఇటువైపు లాగి, శాసనసభలో పరోక్షంగా బీజేపీ పక్షాన్ని ఏర్పాటు చేసుకోవాలని స్కెచ్ వేస్తోంది. మాజీ మంత్రి గంటాతో చర్చలు జరుపుతోందని, దాదాపు 16 మంది ఎమ్మెల్యేలతో గంటా బీజేపీలోకి జంప్ అవుతారని వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే చిరుకు పాత పరిచయమైన గంటాతో, చిరుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు యూపీ తరహాలో సోషల్ ఇంజినీరింగ్ పదునుపెట్టింది బీజేపీ. రాయలసీమలో రెడ్డివర్గాన్ని ఆకట్టుకుంటూనే, మరోవైపు కీలకమైన కాపు వర్గం నేతలను లాగేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అందుకే ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన టీడీపీకి చెందిన కాపు నేతలందరూ సమావేశమయ్యారని, మూకుమ్మడిగా అతి త్వరలో బీజేపీలోకి మారతారని వార్తలొచ్చాయి. అదే కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని సైతం పార్టీలోకి తీసుకుంటే, పార్టీకి స్టార్ ఇమేజ్‌తో పాటు బలమైన వర్గం అండ దొరుకుతుందని ఆలోచిస్తోందట కమలం.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని, అవసరమైతే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా అప్పజెప్పాలని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్, కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు చిరంజీవితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిరు పొలిటికల్ ఎంట్రీ, వార్తల్లో నిజంగా నిజముందా? ఊహాగానాల్లో పస ఉందా? తమ్ముడొక పార్టీ అన్నొక పార్టీ అయ్యే ఛాన్సుందా రాజకీయ పునరాగమనంపై చిరంజీవి మదిలో ఆలోచనేంటి?
అయితే చిరంజీవికి సంబంధించిన ఈ వార్తలన్నీ ఒట్టి ఊహాగానాలేనని, ఆయన సన్నిహితులు ఫుల్ క్లారిటీగా చెబుతున్నారు. రాజకీయాల్లో ప్రస్తుతం ఆయనకు అసలు ఇంట్రెస్టే లేదని, అలాంటి ప్రతిపాదన కూడా బీజేపీ నుంచి వచ్చిందన్న వార్తల్లోనూ నిజంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకసారి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ కాలేకపోయానన్న పశ్చాతాపంతో చిరంజీవి ఉన్నారని, సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాలు గడిచిన అధ్యాయంగా ఆయన భావిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇక మరోసారి పాలిటిక్స్ అంటే ఆయనకు ఆసక్తిలేదని అంటున్నారు. పాలిటిక్స్‌కు తాను సూట్‌కానన్న ఆలోచనలో చిరంజీవి ఉన్నారని, ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిగా దృష్టిపెట్టారని చెబుతున్నారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా, చిరంజీవి కనీసం ట్విట్టర్ ద్వారా కూడా మద్దతు ప్రకటించలేదు. పాలిటిక్స్‌లో తమ్ముడు సక్సెస్ కావాలని కూడా ఏ సందర్భంలోనూ చెప్పలేదు. నాగబాబు కోసం నర్సాపురంలోనైనా చిరంజీవి ప్రచారం చేస్తారని ఊహాగానాలొచ్చినా, అవేమీలేవు. అయితే పవన్‌కు కుటుంబం అండ కూడా లేదన్న విమర్శల నేపథ్యంలో, క్యాంపెయిన్ కోసం కొడుకు రాంచరణ్‌ను చిరంజీవి పంపించారని అప్పట్లో వార్తలొచ్చాయి. రాజకీయాలపై ఆసక్తిలేదు కనుకే, అంటీముట్టనట్టు చిరంజీవి వ్యవహరించారని సన్నిహితులంటున్నారు.
మొత్తానికి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలన్నీ కట్టుకథలేనని అర్థమవుతోంది. స్వయంగా ఆయన తన సన్నిహితుల దగ్గర ఈ విషయం చెప్పారట. తనకెంతమాత్రం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదని అన్నారట. బీజేపీ నేతలు సైతం చిరంజీవిని సంప్రదించారని వస్తున్న వార్తల్లోనూ నిజంలేదట. మొత్తానికి రాజకీయ పునరాగమనంపై ప్రస్తుతానికైతే చిరంజీవికి అసలు ఆలోచనే లేదు. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire