AP High Court: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

Big Relief For Chandrababu In AP High Court
x

AP High Court: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

Highlights

AP High Court: చంద్రబాబు హెల్త్ రిపోర్టు సమర్పించాలన్న హైకోర్టు

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆగస్టు 9న స్కి్ల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అవగా.. ఆ కేసులో చంద్రబాబును ఏ 37గా చేర్చింది సీఐడీ. అనంతరం పలుమార్లు స్కిల్ కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేయగా ఆయనకు చుక్కెదురైంది. దాంతో చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై మూడు రోజుల పాటు విచారణ సాగింది. బాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. ఈనెల 16న వాదనలు పూర్తవగా.. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. బాబు లాయర్ల వాదనలను ఏకీభవిస్తూ ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.

ఇక ఇటీవలే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరగా.. 4 వారాల పాటు బెయిల్ ఇస్తూ అక్టోబర్ 31న తీర్పు వెలువడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుని విశ్రాంతిలో ఉన్న చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ఆ తర్వాత రాజమండ్రి జైలులో సరండర్ అవ్వాల్సి ఉంది. అయితే రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు హైకోర్టు న్యాయమూర్తి. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ రిపోర్టు సమర్పించాలంది.

రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారని కోర్టుకు వివరించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్‌ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని.. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని తెలిపారు. మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.

ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదని... బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories