Avinash Reddy: వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్‌రెడ్డి

Avinash Reddy as A8 in Viveka Murder Case
x

Avinash Reddy: వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్‌రెడ్డి

Highlights

Avinash Reddy: 7వ నిందితుడిగా వైఎస్ భాస్కర రెడ్డి

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా చేర్చింది. ఇప్పటికే అరెస్ట్‌ చేసిన వైఎస్‌ భాస్కర రెడ్డిని ఏడో నిందితుడిగా పేర్కొంది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌లో సీబీఐ దాఖలు చేసిన కౌంటరులో సీబీఐ వెల్లడించింది. మౌఖిక, రాతపూర్వక, శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాల ప్రకారం.. గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి హత్యకు పథకాన్ని అమలు చేశారని, సాక్ష్యాలను ధ్వంసం చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని నమ్మించడంలో తాము ప్రతిపాదిత నిందితులుగా పేర్కొన్న భాస్కరరెడ్డి, అవినాశ్ రెడ్డి, నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కలిసి కుట్రను ముందుకు తీసుకెళ్లారని కోర్టుకు సీబీఐ నివేదించింది. వివేకా హత్య వెనుక భాస్కర రెడ్డి, ఆయన కుమారుడు అవినాశ్ రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

భాస్కరరెడ్డి.. సహా నిందితులతో కలిసి కుట్రలో, సాక్ష్యాల ధ్వంసంలో పాల్గొన్నారని సీబీఐ వెల్లడించింది. ఆయన కడప జిల్లాలో... ప్రత్యేకించి పులివెందులలో సాక్షులను ప్రభావితం చేయగలరని పేర్కొంది. ఇతర నిందితులతో కలిసి దర్యాప్తును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేయడం, సాక్షులను బెదిరించారనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయని వెల్లడించింది. అరెస్ట్‌ సమయంలో కడప ప్రాంతంలో జరిగిన నిరసన ప్రదర్శనలే ఆయనకు ఉన్న పలుకుబడి గురించి చెబుతాయని సీబీఐ పేర్కొంది. సాక్షులపై ఆయన ఉనికి ప్రభావం చూపుతుందని, ఈ దశలో బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవే ఆరోపణలున్న శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలును సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపింది. షరతులతో బెయిలు మంజూరు చేసినా ఫలితం లేదని, సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలను తారుమారు చేసినా దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. విచారణలో భాస్కర రెడ్డి సహకరించలేదని, ఏప్రిల్‌ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు బెయిలు మంజూరు చేయాలనడం సరికాదందని కోర్టుకు సీబీఐ నివేదించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భాస్కర రెడ్డి బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.

వైఎస్‌ భాస్కరరెడ్డికి బెయిలు మంజూరు చేయవద్దని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఈ దశలో బెయిలు ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని ‎ఆమె అన్నారు. కుట్రలో భాస్కరరెడ్డి ప్రమేయం ఉందని పలువురు ఇచ్చిన వాంగ్మూలాలను తన రాతపూర్వక వాదనల్లో పేర్కొన్నారు సునీత..

వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ నిన్న సీబీఐ కోర్టులో హాజరు పరిచింది. అయితే వీరి రిమాండ్‌ను కోర్టు ఈనెల 16 వరకు పొడిగించింది. మరోవైపు భాస్కర రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories