కాకాని అధ్యక్షతన అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ వర్చువల్‌ భేటీ

Assembly Privilege Committee Virtual Meeting
x

Representational Image

Highlights

* నిమ్మగడ్డపై ఇచ్చిన ఫిర్యాదును ఆమోదించిన ప్రివిలేజ్‌ కమిటీ * ఎస్‌ఈసీపై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన కమిటీ * తదుపరి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న కమిటీ

ఏపీలో ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా తాజాగా ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ఫిర్యాదుపై చర్చించిన కమిటీ తక్షణ చర్యలకు ఉపక్రమించకపోయినా అతనిపై చర్యలు ఖాయమనే సంకేతాలిచ్చింది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ కు ఇచ్చిన నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. మంత్రులు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వాటికి సంబంధించిన గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, చట్టపరమైన అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ విషయంలో మరోసారి సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇటీవల మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉన్న తరుణంలో నిమ్మగడ్డ లేఖతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. తమపై చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. ఈ నోటీసులను స్పీకర్ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామన్నారు ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి. రూల్‌ 173 ( వన్‌ సెవంటీ త్రీ) కింద ఈ అంశంపై చర్చించామని, గతంలో మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, ఆ కేసులో అప్పటి ఎస్‌ఈసీ జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు. ఎవరినైనా సరే పిలిపించి, ప్రశ్నించే హక్కు ప్రివిలేజ్‌ కమిటీకి ఉంటుందని అన్నారు కాకాని. త్వరలో మరోసారి సమావేశమై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాకాని గోవర్ధన్‌రెడ్డి. ‎

2006లో మహారాష్ట్ర ఎస్ఈసీగా ఉన్న నందలాల్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎమ్మెల్యే జనార్ధన్ చందూకర్ స్పీకర్ కు సభాహక్కుల నోటీసులిచ్చారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసులపై విచారణకు స్వీకరించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీని వివరణ కోరింది. ఎస్ఈసీ విచారణకు హాజరుకాకపోగా సరైన సమాధానం ఇవ్వలేదు. దాంతో ప్రివిలేజ్ కమిటీ 2008 మార్చిలో ఆయనకు జైలు శిక్ష విధించింది. దీనిపై కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

తాజాగా జరిగిన భేటీలోనూ నిమ్మగడ్డపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ మొదలైంది. ఇక మరో దఫా సమావేశం జరగనుండడంతో ఎస్‌ఈసీని ఎలాంటి వివరణ కోరనున్నారనే ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories