APSRTC to Expand Their Serivces: ఇప్పటివరకు ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఆర్టీసీని పల్లెలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
APSRTC to Expand Their Serivces: ఇప్పటివరకు ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఆర్టీసీని పల్లెలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా కండక్టర్లను బస్సుల్లోనే ఉంచి, సర్వీసులు తిప్పేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో పాటు కరోనా నేపథ్యంలో ఎటువంటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూనే ముందుకు పోవాలని ఎండీ కృష్ణబాబు ఆదేశించారు.
'మా ఊరు వద్ద బస్సు ఆగదు..టికెట్ సెల్‌ఫోన్ ద్వారా కొనుక్కోవాలట..?'.. ప్రయాణికుల్లోని ఇటువంటి బెరుకు, భయాలతో పడిపోతున్న ఆక్యుపెన్సీని పెంచుకోవడానికి ఆర్టీసీ నడుం బిగించింది. పల్లెలకు బస్సులు తిప్పాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి ఇన్‌చార్జి ఎండీగా సోమవారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్న ఎంటీ కృష్ణబాబు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రజా రవాణాపై లాక్‌డౌన్ ప్రభావం మొదలుకొని మే 21 నుంచి ప్రారంభమైన బస్సులకు ప్రయాణికుల తాకిడి ఎలా ఉందనే అంశాల వరకూ సుదీర్ఘంగా ఆయన చర్చించారు. లాక్‌డౌన్ తర్వాత బస్సులు రోడ్డెక్కినా బస్టాండు నుంచి బస్టాండు మధ్యలోనే అనే నిబంధన వల్ల ఆక్యుపెన్సీ ఏ మాత్రం పెరగలేదని అధికారులు వివరించారు.
ఒకే సారి వందశాతం క్యాస్‌లెస్ అనే నిర్ణయం కొంప ముంచిందని, ప్రయాణికుల్లో చైతన్యం తీసుకొచ్చి క్రమంగా పెంచుకొంటూ పోతే బాగుంటుందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైంది. బస్సుల్లో కండక్టర్లు వెళ్లి ప్రయాణికులకు అవసరమైన విధంగా ప్రయాణ సేవలు అందిస్తేనే ఉపయోగం ఉంటుందని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రయాణసేవలు అందుకు అనుగుణంగా అందిస్తేనే ఆక్యుపెన్సీ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. 'చల్లదనం వల్ల కరోనా వ్యాపిస్తుందన్న కారణంతో ఏసీ బస్సులను డిపోలకే పరిమితం చేశాం.. కానీ,రెస్టారెంట్లు ఇతర ప్రాంతాల్లో 24డిగ్రీల వరకూ ఏసీ పెడుతున్నారు' అని ఆయన దృష్టికి అధికారులు తెచ్చారు. గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను తిప్పడం, వాటిలో కండక్టర్లను పంపితే మెరుగైన ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం ఎక్కువ మంది ఈడీలు, ఆర్‌ఎంల్లో వ్యక్తమైంది. అన్నీ విన్న కృష్ణబాబు.. పల్లెలకు బస్సులు తిప్పాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి డిపో నుంచి వీలైనన్ని బస్సులు గ్రామాలకు పంపాలని స్పష్టం చేశారు. ఈ వెంటనే ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆపరేషన్స్ ఈడీ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం నుంచి బస్సులు పల్లెలకు తిప్పాలని, కండక్టర్లను పంపి నగదు తీసుకొని టికెట్లు జారీ చేయాలని సూచించారు. అయితే కొవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకుండా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని అధికారులకు ఎండీ సూచించారు. ఏసీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు పంపాలని, అయితే ఏసీ 24 డిగ్రీలకు పైనే ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రయాణికులు ఏ విధంగా ఆర్టీసీకి మళ్లీ దగ్గరవుతారో అటువంటి చర్యలన్నీ తీసుకొంటూనే బస్సుల్లో శానిటైజేషన్, సిబ్బందికి మూడు లేయర్ల మాస్కుల సరఫరా చేయాలని ఆదేశించారు.
మన బస్సులకు దూరమైన ప్రయాణికులు తిరిగి రావాలని, కొవిడ్‌కు ముందు పరిస్థితి తిరిగి తెచ్చేందుకు ఎండీ నుంచి కండక్టర్ వరకూ అందరం పనిచేద్దామన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకూ విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో సిటీ బస్సులు పునరుద్ధరించరాదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, జిల్లాల నుంచి సమావేశానికి వచ్చిన పలువురు రీజినల్ మేనేజర్లు క్షేత్రస్థాయి సమస్యలు లేవనెత్తారు. తమ జిల్లాల్లో కట్టడి ప్రాంతాల పరిధిలో ఉన్న డిపోల వివరాలు వెల్లడించారు.
కొవిడ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి: కార్మిక సంఘాలు
కండక్టర్లు బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెంచేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి కొవిడ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈయూ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నేత సుందరయ్య వేర్వేరుగా పై విన్నపం చేశారు. వైద్యులు, పోలీసులకు ఇస్తున్నట్టే రూ.50లక్షల బీమా భరోసాని ఆర్టీసీ సిబ్బందికి కూడా వర్తింప జేయాలని కోరారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire