AP Octopus: పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఆక్టోపస్ పోలీసుల మాక్ డ్రిల్.. ఔరా అనిపించిన విన్యాసాలు

AP Octopus: పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఆక్టోపస్ పోలీసుల మాక్ డ్రిల్.. ఔరా అనిపించిన విన్యాసాలు
x
Highlights

AP Octopus mock drill at polavaram project: పోలవరం ప్రాజెక్ట్‌లో శుక్రవారం సినిమాటిక్ సీన్ చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ఆక్టోపస్ పోలీసు బృందాలు పోలవరం...

AP Octopus mock drill at polavaram project: పోలవరం ప్రాజెక్ట్‌లో శుక్రవారం సినిమాటిక్ సీన్ చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ఆక్టోపస్ పోలీసు బృందాలు పోలవరం ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించాయి. భవిష్యత్‌లో ఒకవేళ ఉగ్రవాదులు ప్రాజెక్టుపై దాడి చేసినా, లేదంటే ఏవైనా అసాంఘిక శక్తులు విజృంభించినపుడు భద్రతా బలగాలు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా బలగాల సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంతో ఈ మాక్ డ్రిల్ జరిగింది.

ఆక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ మాక్ డ్రిల్‌లో స్థానిక పోలీసులు, పోలవరం ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బంది, ప్రాజెక్టుని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (Meil) సిబ్బంది పాల్గొన్నారు.

ఆక్టోపస్ కమాండోలు మాక్ డ్రిల్ ఎందుకు చేశారంటే..

ఉగ్రవాదుల హిట్ లిస్టుల్లో రద్దీగా ఉండే ప్రదేశాలు మాత్రమే కాకుండా దేశానికి ఆర్థికంగా ఎంతో మేలు చేసే ప్రాజెక్టులు కూడా ఉంటుంటాయి. అలా ఏదైనా ఉగ్రవాద సంస్థ కానీ లేదా అసాంఘిక శక్తులు పోలవరం ప్రాజెక్ట్ వంటి భారీ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురైతే.. ఆ దాడిని తిప్పికొట్టడంలో అక్కడి భద్రతా సిబ్బంది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోతే ఆ దాడి వల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే అలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలనే విషయంలో భద్రతా సిబ్బందికి ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఈ మాక్ డ్రిల్ వల్ల కలిగే లాభాలు ఏంటి?

ఈ మాక్ డ్రిల్ వల్ల అనుకోని దాడులను ఎలా తిప్పికొట్టాలో తెలిసిరావడంతో పాటు ఎక్కడైనా లోపాలు ఉంటే ముందు జాగ్రత్త చర్యగా వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే స్థానిక పోలీసులు, ప్రాజెక్ట్ వద్ద గస్తీ కాసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రాజెక్ట్ నిర్వహణలో ఉండే నిర్మాణ సంస్థ సిబ్బంది మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దుకునే అవకాశం కూడా కలుగుతుంది.

గతంలోనూ జనాన్ని అయోమయానికి గురిచేసిన మాక్ డ్రిల్స్

ఏపీ ఆక్టోపస్ పోలీసులు ఇలా మాక్ డ్రిల్స్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇదే ఏడాది ఆగస్టు 18న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో అర్థరాత్రి ఆక్టోపస్ బృందాలు ఆకస్మికంగా చేసిన మాక్ డ్రిల్ చూసి తొలుత ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ తరువాత అది మాక్ డ్రిల్ అని తెలిసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

గతేడాది నవంబర్ 2న తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కేటాయించే విష్ణు నివాసం కాంప్లెక్సులోనూ ఆక్టోపస్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అలాగే ఇదే ఏడాది మార్చ్ 15న కూడా మరోసారి తిరుపతి దేవస్థానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడికి పాల్పడితే వారి బారి నుండి భక్తులను ఎలా కాపాడుకోవాలి, ఉగ్రవాదుల దాడిని ఎలా తిప్పి కొట్టాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్స్ జరిగాయి.

అసలు ఎవరీ ఆక్టోపస్ పోలీసులు? వాళ్ల పనేంటి (AP Octopus formation)?

ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (OCTOPUS). అంటే టెర్రరిస్టుల దాడులను తిప్పి కొట్టేందుకు ఏర్పాటైన భద్రతా బలగాల సంస్థ అన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 అక్టోబర్ 1న ఈ ఆక్టోపస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. టెర్రరిస్టు దాడులను తిప్పికొట్టడంలో సుశిక్షితులైన కమాండోలు ఈ ఆక్టోపస్ బృందాలకు నేతృత్వం వహిస్తారు. ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు దాడులకు పాల్పడే సమయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేలా ఈ ఆక్టోపస్ కమాండోలకు శిక్షణ ఇస్తారు.

పోలవరం ప్రాజెక్ట్ వద్ద మాక్ డ్రిల్‌పై ఆక్టోపస్ పోలీసులు ఏమన్నారంటే

ఆక్టోపస్ విభాగం డిఎస్‌పీ తిరుపతి మాక్ డ్రిల్ లక్ష్యాలను మీడియాకు వివరించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు ఆక్టోపస్ పోలీసులు ఆ దాడిని ఎలా ఎదుర్కొంటారని అంచనా వేసే లక్ష్యంతోనే ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు. ఇకపై ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. మా సిబ్బంది సన్నద్ధతను మెరుగు పరుచుకోవటంతో పాటు మరింత వేగంగా స్పందించేందుకు ఈ మాక్ డ్రిల్స్ కొనసాగిస్తామన్నారు.

మాక్ డ్రిల్‌ నిర్వహించడానికంటే ముందుగా పోలవరం పోలీసులు, ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధికారులతో ఆక్టోపస్ పోలిసుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలోనే మాక్ డ్రిల్ చేసే తీరును మిగతా సిబ్బందికి వివరించారు. పోలవరం ఎస్‌ఐ ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్, ఎస్‌పీ‌ఎఫ్ సిఐ విజయ కుమార్ తదితరులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ వద్ద చేపట్టిన ఆ జాయింట్ మాక్ డ్రిల్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా వీక్షకులను అబ్బురపరిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories