AP Liquor Policy: ఏపీకి కిక్కెక్కిస్తున్న లిక్కర్ దందా
AP Liquor Policy 2024: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మద్యం కిక్కు. అధికార పార్టీకి కమిషన్లు, వాటాల మత్తు. పెట్టుబడి లేని కమిషన్ దందా... తాడిపత్రిలో జేసీ...
AP Liquor Policy 2024: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మద్యం కిక్కు. అధికార పార్టీకి కమిషన్లు, వాటాల మత్తు. పెట్టుబడి లేని కమిషన్ దందా... తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫత్వా... రాష్ట్ర మంతా ఇదే మత్తు.. సిండికేట్ల గుప్పెట్లో మద్యం దుకాణాలు.
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ రూల్. నియోజకవర్గంలో లిక్కర్ షాప్ దక్కించుకున్న వారు 15 పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి.. ప్రతి షాపులో 20 శాతం వాటా ఇవ్వాలి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి రూల్... ఇది జేసీ అల్టిమేటమ్ అని అంటున్నారు. ఎవరైనా కాదు, కూడదు అంటే ఏం చేస్తాడో జేసీ ప్రభాకర రెడ్డి తనదైన స్టయిల్లో బహిరంగంగా చెప్పేశారు. మనసులో ఏదైతే ఉందో దాన్ని బహిరంగంగా వెళ్లగక్కే గుణం ఉన్న జేసీ మద్యం దుకాణాల దందాలో తన వాటా తనకు ఇవ్వాల్సిందేనన్నారు. పనిలో పనిగా దాన్ని తాడిపత్రి అభివృద్దికి వాడతానని దొంగతనంలోనూ దొరతనాన్ని ప్రదర్శించారు.
ఇది కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కరి లెక్క కాదు.. రాష్ట్రంలో దాదాపు అందరి ఎమ్మెల్యేల లెక్కా ఇదే.. వైసీపీ ఎమ్మెల్యేలున్న చోట అధికారపార్టీ ఇన్‌చార్జిల లెక్క కూడా ఇదే.. ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే మద్యం దుకాణాల కేటాయింపుల ప్రక్రియ విజయవంతంగా ముగిసిన సంగతి బహిరంగ రహస్యమే. అనేక చోట్ల ఎమ్మెల్యేలే బినామీ పేర్లతో మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అండదండలతో వారి అనుచరులకు దుకాణాలు దక్కాయి. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ‘నాకింత - మీకింత’ పద్దతిలోనే అంతా సవ్యంగా నడిచింది.
కాకపోతే వేరేవాళ్లకు మద్యం దుకాణాలు దక్కకుండా అధికారపార్టీ సిండికేట్ ఫార్ములాను నమ్ముకుంది. బినామీ పేర్లతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. లాటరీలో ఎవరికి దుకాణం వచ్చినా అది సిండికేట్ కు దక్కినట్టే. సిండికేట్ నడిపే మద్యం షాపు నుంచి స్థానిక ఎమ్మెల్యేకో, మంత్రికో నెలనెలా ఎంత కమిషన్ ఇవ్వాలనేది అనధికారిక అగ్రిమెంట్ అవుతుంది. అలా అగ్రిమెంట్ చేసుకుంటేనే, అగ్రిమెంట్ ప్రకారం కమిషన్ చెల్లిస్తేనే ఆ మద్యం దుకాణం సవ్యంగా నడుస్తుంది..అది కాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు అన్ని షాపుల్లో ఎంతో కొంత ఎమ్మెల్యే లేదా మంత్రి లేదా అక్కడి అధికార పార్టీ ముఖ్య నాయకుడికి వాటా ఇవ్వాలి. అలా ఎంతో కొంత వాటా ఇస్తేనే మద్యం దుకాణం మూడు బ్రాందీలు, ఆరు బీర్లుగా వర్ధిల్లుతుందని సిండికేట్ కూడా బలంగా నమ్ముతోంది.
3,396 దుకాణాలు.. ఎవరికెన్ని?
రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలను లాటరీ పద్దతి ద్వారా సోమవారం నాడు కేటాయించారు. ఈ షాపుల కోసం ఆబ్కారీ శాఖకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. అయితే, 80 శాతానికి పైగా షాపులు అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నడుచుకునే మద్యం సిండికేట్ కే దక్కాయనే మాటలు వినిపిస్తున్నాయి. మిగతా 20 శాతం ఎప్పటి నుంచో మద్యం వ్యాపారం చేస్తున్న వారికి దక్కాయి. అయితే, అలాంటి వారికి ‘షాపు ఎలా నడుపుతారో చూస్తాం’ అనే జేసీ మార్క్ బెదరింపులు వస్తున్నాయి. అధికార పక్ష నేతలు కొందరు వాటిని తమ పరం చేసుకుంటున్నారు. తమ పరం చేసుకోవటం అంటే అందులో వాటాలు పొందడం, దరఖాస్తు సొమ్ముకు అదనంగా మరికొంత గుడ్ విల్ రూపంలో ఇచ్చి అనధికారికంగా వారి నుంచి షాపులు తీసుకోవటం అన్నమాట. లేదా తమ సిండికేట్‌లో షాపులు దక్కించుకున్న వారిని భాగస్వామ్యం చేయటం.. ఇలా రకరకాల పద్దతులు అవలంబించి మద్యం దుకాణాలను అధికారపార్టీ సిండికేటు నూటికి నూరుశాతం తమ వశం చేసుకున్నాయని చెబుతున్నారు.
బెల్టు షాపులు తెరుస్తారా..!?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో సగటున సుమారు 19 మద్యం దుకాణాలకు కూటమి ప్రభుత్వం అనుమతించింది. అధికారపార్టీ పెద్దలకు కమిషన్లు, వాటాలు, ఖర్చులు పోను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్ పీ రేట్లకు షాపులు నడపటం అంటే అసాధ్యమని మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు చెబుతున్నారు. ఒక్కొక్క అధికారిక మద్యం దుకాణానికి అనుబంధంగా వీలైనన్ని ఎక్కువగా బెల్టు షాపులు తెరవటం ద్వారా అమ్మకాలను పెంచితేనే మద్యం దుకాణాలపై గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. ఎటు తిరిగీ మద్యం దుకాణాలన్నీ అధికారపార్టీ కనుసన్నల్లోనో, భాగస్వామ్యంతోనో ఉన్నాయి కనుక యధేచ్ఛగా బెల్టు షాపులు తెరిచినా అడిగే సీను ఎవరికీ ఉండదు. నెలనెలా ఎక్సయిజోళ్లకు మామూళ్ళ కిక్కు తప్పదు కనుక వాళ్ళెవరూ బెల్టు షాపుల వైపు కన్నెత్తి చూసే అవకాశమే ఉండదని మద్యం దుకాణాల సిండికేట్ భావిస్తోంది. అంతే కాదండోయ్.. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ రేట్ల కంటే బాటిల్‌పై రూ 10 నుంచి రూ 25కు ఎక్కువకు అమ్ముకునేందుకు సిండికేట్ సిద్దమైంది. ఈ మేరకు అధికారపార్టీ పెద్దల నుంచి ఎవడొస్తాడో చూస్తాం అనే పద్దతిలో అనుమతులిచ్చినట్టు తెలుస్తోంది.
లేచింది మహిళా లోకం..
మద్యం దుకాణాల్లోనూ మహిళా సాధికారత కొట్టొచ్చినట్టు కనబబడుతోంది. 3,396 దుకాణాల్లో 10.2 శాతం అంటే.. 345 దుకాణాలను మహిళలకు కేటాయించారు. మద్యం దుకాణాలు దక్కించుకన్న వారిలో అత్యధికంగా 31 మంది విశాఖ జిల్లాలో ఉన్నారు. అనకాపల్లిలోనూ 25 మంది, నెల్లూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 24 మంది మహిళలకు మద్యం దుకాణాలు దక్కాయి. ఎటొచ్చీ అవి కూడా మద్యం సిండికేట్ లో భాగమే అయినా మద్యం దుకాణాల ముఖచిత్రంలో మహిళా సాధికారితకు లోటు లేకుండా పోయింది.
రెండేళ్లలో రూ. 6,384 కోట్ల ఆదాయం
కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్నమద్యం విధానం ద్వారా 2024-2026 కాలానికి రూ 6,384 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉన్నట్టు అంచనా. ఇప్పటికే నాన్-రిఫండ్ దరఖాస్తుల రూపంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వానికి రూ 1798 కోట్ల ఆదాయం వచ్చింది. దీనికితోడు, లిక్కర్ షాపుల నుంచి ప్రభుత్వం ఏటా 2,084 కోట్ల రూపాయల లైసెన్సు ఫీజును వసూలు చేస్తుంది. ఆరు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో వసూలు చేసే ఈ డబ్బులో మొదటి కిస్తు కింద ప్రభుత్వానికి 335 కోట్లు ఆల్రెడీ వచ్చేశాయి. మొత్తంగా కొత్త లిక్కర్ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ. 30 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అంటే, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు లిక్కర్ పాలసీ అల్లావుద్దీన్ అద్భుతదీపంగా మారిందన్నమాట.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire