AP News: రూ.2.60 లక్షల కోట్లతో బడ్జెట్..! ఆమోదానికి కేబినెట్ సమావేశం...

AP Cabinet Meeting to Approve Budget 2022 Today 11 03 2022 | AP Breaking News Today
x

AP News: రూ.2.60 లక్షల కోట్లతో బడ్జెట్..! ఆమోదానికి కేబినెట్ సమావేశం...

Highlights

AP News: వ్యవసాయ, వైద్యా, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద పీట...

AP News: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే నాలుగో బడ్జెట్ ఎవరికి వరాలు కురిపిస్తుంది. ఏఏ వర్గాలకు పెద్ద పీట వేయబోతుంది..? ఏ అంచనాలకు రూపం గీస్తుంది. ఎవరి ఆశలకు ప్రాణం పోస్తుంది. ఆర్ధికంగా సతమతమవుతున్న జగన్ సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండనుంది. కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయనుంది ప్రభుత్వం.

ఏపీ శాసనసభలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 10 గంటలకు బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి చెల్లుబోయిన వేణు ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జగన్ సర్కార్ ఆచితూచి కేటాయింపులు సిద్ధం చేసింది. 2.60 లక్షల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రాధాన్యతల వారీగా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. ప్రస్తుతం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే అదనంగా ఆయా రంగాలకు కేటాయింపులు పెంచేలా బడ్జెట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

నవరత్నాలకు నిధులను కేటాయించడంతో పాటు వైఎస్సార్ పెన్షన్ కానుకకు 18వేల కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పేదల ఇళ్ల నిర్మణాలకు ప్రాధాన్యతను ఇచ్చింది వైసీపీ సర్కార్. అన్నదాతలను ఆదుకోవడానికి వ్యవసాయ బడ్జెట్ 40వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం ఆర్ధిక లావాదేవీలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. ఇక హైకోర్టు తీర్పుతో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories