గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ

SEC Nimmagadda Ramesh Kumar meet governor over Panchayat elections
x
Highlights

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పును ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ గవర్నర్‌కు వివరించారు....

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పును ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ గవర్నర్‌కు వివరించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వానికి డైరెక్షన్‌ ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు ఎస్‌ఈసీ. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వినతిపత్రం అందించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్‌ఈసీ ఇచ్చిన షెడ్యూలును సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసింది. ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎన్నికలు, కరోనా టీకా ప్రక్రియ రెండూ ప్రజలకు ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాలని ఈ రెండింటినీ సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఇక పంచాయతీ ఎన్నికలు గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే 4 దశల్లో జరుగుతాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, ఓటర్లను ప్రభావితం చేయరాదని స్పష్టం చేశారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, టీకా కార్యక్రమం కొనసాగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం ఈనెల 11న ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీలు చేయగా ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories