AP MP's Dharna at Parliament: భూ కుంభ కోణాలపై విచారణ జరపాలి..
AP MP's Dharna at Parliament: అమరావతి భూ కుంభ కోణాలపై దర్యాప్తు ప్రారంభించాలని వైఎస్సార్ పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
AP MP's Dharna at Parliament: అమరావతి భూ కుంభ కోణాలపై దర్యాప్తు ప్రారంభించాలని వైఎస్సార్ పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రభుత్వ నిర్ణయాలపై స్టే వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థ అంగుళం కూడా కదలనివ్వడం లేదని, ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయంపైనైనా స్టే వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుంభకోణాలను వెలికితీయాలని ఆదేశించాల్సిందిపోయి.. ఆపండని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీలందరితో కలిసి మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవలి హైకోర్టు నిషేధిత ఉత్తర్వులపై తాను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లినట్టు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఏ ఒక్క జడ్జికీ ఉద్దేశాలను ఆపాదించడం లేదు
► భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచారం తెలుసుకోవడం భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. అసాధారణ పరిస్థితుల్లో ఆ హక్కును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు గానీ ప్రతి చిన్న విషయానికి చట్టసభలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఆ హక్కును హరించి వేయడం దురదృష్టకరం.
► ఏ తీర్పునైనా లాజికల్‌గా విమర్శించడంలో తప్పులేదని చట్టమే చెబుతోంది. ఏపీలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థలోని, న్యాయవ్యవస్థలోని పరిణామాలన్నీ అందరికీ తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క జడ్జికి గానీ, ఏ ఒక్క వ్యక్తికి గానీ మోటివ్స్ (ఉద్దేశాలను) ఆపాదించడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
► గతంలో 2010 నుంచి 2019 వరకు ఏ న్యాయ సూత్రాలు అనుసరించారో.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అవి న్యాయసూత్రాలుగా లేవు. ఇపుడు ఎందుకు మరో రకంగా ఇంటర్‌ప్రిట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నా.
ఆ రోజు ఇలాంటి నిషేధిత ఉత్తర్వులు గుర్తుకు రాలేదా?
► 2011, 2012లో మాపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్టు చేసినప్పుడు ఇలాంటి "నిషేధిత' ఉత్తర్వులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నా. సహజ న్యాయ సూత్రాలు రాజ్యాంగ వ్యవస్థలో ప్రధాన మంత్రి నుంచి సామాన్యుడి వరకు ఒకటే. చట్టం దృష్టిలో అందరూ సమానులే.
► ఐపీసీ గానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ప్రధాన మంత్రికి గానీ, ముఖ్యమంత్రికి గానీ, చీఫ్ జస్టిస్‌కు గానీ ప్రత్యేక చట్టం ఉండదు. అందరూ సమానులే. ఈ విషయాన్ని మరిచిపోయి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ ఎందుకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది?
► ఉదాహరణకు నిన్ననో మొన్ననో హైకోర్టు ఒక కేసులో ఒక నిషేధిత ఉత్తర్వు జారీ చేసింది. దీనిని నేను రాజ్యసభలో కూడా ప్రస్తావించాను. నాకున్న కొద్దిపాటి రాజకీయ అనుభవం రీత్యా ఇప్పటి వరకు ప్రభుత్వం.. టీవీ ఛానెల్స్, మీడియా, పత్రికల నోరు నొక్కుతుందని ఆరోపణలు చేసేవారు. ఈ రోజు పరిస్థితి తారుమారైంది. న్యాయ వ్యవస్థ పత్రికల నోరు నొక్కే పరిస్థితి ఎదురైంది. దీనికి కారణం ఏంటి? ప్రజలే అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా.
► నిషేధిత ఉత్తర్వు అనేది అసాధారణ పరిస్థితుల్లో.. పాజిబుల్ డిఫమేషన్ ప్రివెంట్ చేసేందుకు గానీ, ప్రయివసీ ఇన్వేషన్ జరుగుతుందనుకున్నపుడు దానిని నిరోధించేందుకు గానీ, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ రక్షణకు గానీ అవసరమవుతుంది. ఈ మూడు పరిస్థితుల్లోనే జారీ చేస్తారు.
ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదలనివ్వడం లేదు
► ఏపీలో ఒకటిన్నర సంవత్సర కాలంలో పరిశీలిస్తే ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా? అనిపిస్తోంది. న్యాయవ్యవస్థే.. కార్యనిర్వాహక వ్యవస్థను, శాసన వ్యవస్థను టేకోవర్ చేసిందా? ఇది జ్యుడిషియల్ ఎన్‌క్రోచ్‌మెంట్ అవుతుందా? కాదా? జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుందా? కాదా అన్నది ప్రజలే నిర్ధారించుకోవాలని మనవి చేస్తున్నా.
► న్యాయం లేదా న్యాయ విచారణనకు నిజంగా ప్రమాదం ఉన్నపుడు మాత్రమే ప్రచురణపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేసే పరిస్థితి. ఎవరో కాదు.. ఒక నేరస్తుడో ఇంకొకరో నేరానికి పాల్పడితే అర్థం చేసుకోవచ్చు. తగినవిధంగా శిక్షించగలం.
► దేశంలో ఎవరైతే న్యాయాన్ని, ధర్మాన్ని పాటించి తీర్పులు ఇవ్వాలో వారే పక్షపాత ధోరణితో తీర్పులు ఇస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతోందో మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామనడంలో సందేహం లేదు. ప్రభుత్వాన్ని ఒక అంగుళం కూడా కదలనివ్వడం లేదు.
ప్రభుత్వం ఏం చేసినా తప్పేనా?
► ఏం చేయాలన్నా, ఒక జీవో ఇష్యూ చేసినా స్టే వస్తుంది. ఏదైనా ఒక ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టాలన్నా స్టే వస్తుంది. కనీసం పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలన్నా స్టే వస్తుంది. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కటీ చట్టవిరుద్ధమేనట. అంతకుముందు ఐదేళ్లు ప్రభుత్వం ఏం చేసినా, చట్టవిరుద్ధమైన పనులు చేసినా అది చట్ట వ్యతిరేకం కాదు.. చట్టబద్ధమే అవుతుందన్న రీతిలోఈ రోజు న్యాయ వ్యవస్థ పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
► ప్రజలే తీర్పు ఇవ్వాలి. కేంద్రం జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ తప్పుదారి పడుతోందని మీకు తెలియజేస్తున్నా.
► మేం ఏ జడ్జికీ మోటివ్స్ (ఉద్దేశాలను) ఆపాదించడం లేదు. (ఓ ప్రశ్నకు సమాధానంగా..) ఒక్క న్యాయ వ్యవస్థేనా స్వతంత్రంగా పనిచేసేది? శాసన వ్యవస్థ స్వతంత్రంగా పని చేయడం లేదా? కార్యనిర్వాహక వ్యవస్థ పని చేయడం లేదా? "నిషేధిత' ఉత్తర్వు మీడియాకు ఇచ్చారు. మేం మీ కోసం అడుగుతున్నాం. జుడీషియల్ ఓవర్‌రీచ్ అన్నది కొన్నేళ్లుగా చర్చలో ఉన్న అంశం. గతంలో న్యాయశాఖ మంత్రి కూడా దీనిపై మాట్లాడారు. చాలా మంది పార్లమెంటు సభ్యులు దీన్ని నమ్ముతున్నారు.
అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే
► అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే అని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► ప్రధాన మంత్రిని కానీ, రాష్ట్రపతి కానీ కలిసి జరుగుతున్న పరిణామాలు తెలియపరుస్తాం. మా సొంత పనుల కోసం కాదిది. ప్రజలకు సంబంధించిన విషయం ఇది. ప్రజల కోసం చేసే పనులకు అడ్డుపడుతున్నారు. అన్ని వేదికలపై దీనిని ప్రస్తావిస్తాం. అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే.
► న్యాయ వ్యవస్థను అనడం లేదు. న్యాయ వ్యవస్థలో కొంత మంది కచ్చితంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. న్యాయంగా జరగాల్సినవి అన్యాయంగా జరుగుతున్నాయి. అప్పీలుకు అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
► ప్రజలకు మేలు చేసే అన్ని కార్యక్రమాలను ఆపడం ఏమిటి? కుంభకోణాలపై దర్యాప్తులు ఆపడం ఏమిటి? ఆధారాలతో సహా ఇచ్చాం. కుంభకోణాలు వెలికి తీయాలని ఆదేశించాలి గానీ.. కుంభకోణాలు ఆపడం ఏంటి? ఏదైనా కేసు కేసే. ఎప్పటికైనా కేసే. తాత్కాలికంగా ఆపొచ్చు గానీ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది.
► పార్లమెంటులో ఏ విషయమైనా అన్ని అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. మేం శాసనకర్తలం. అన్నింటిపై చర్చిస్తాం. మాకు ఆ అధికారం ఉంది.
► ఈ ఆందోళనలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, లోక్‌సభ ఉపనేత నందిగం సురేష్, లోక్‌సభలో పార్టీ విప్ మార్గాని భరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, బీవీ సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యానారాయణ, పోచ బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభలో ఎఫ్‌ఐఆర్ ప్రస్తావన
► ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్, ఇతరులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ గురించి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. కోవిడ్ 19 నియంత్రణ చర్యలను వివరిస్తూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.
► రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో ఉచితంగా కరోనా టెస్టులు చేసిందని, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలో ఉచిత చికిత్స అందజేసిందని వివరిస్తూ.. ఈ కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక రంగం సృష్టించిన సంక్షోభంతో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసిందని వివరించారు.
► "ఇక్కొడక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులతో మాత్రమే సతమతం కావడం లేదు..' అంటూ ప్రారంభించి మాజీ అడ్వకేట్ జనరల్, ఇతరులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతిని ప్రస్తావించారు.
► "అసాధారణమైన కేసుల్లో దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉంది. కానీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. గత ప్రభుత్వ హయాంలో న్యాయ అధికారి (అడ్వకేట్ జనరల్)గా పని చేసిన పిటిషనర్ ఆరోపించినప్పుడు.. ఆ అంశాలకు విస్తృత మీడియా ప్రచారం, పబ్లిక్ స్క్రూటినీ ద్వారా పిటిషనర్‌కు మేలు జరుగతుంది. కానీ మీడియాలో వార్త రాకపోవడం వల్ల పిటిషనర్‌కు ఎలా ఉపయోగపడుతుందో దానికి స్పష్టత లేదు..' అని పేర్కొన్నారు.
► ఈ సందర్భంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పదేపదే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ జోక్యం చేసుకుంటూ విషయంపై చర్చించాలని సూచించారు. చివరగా "ఈ ధోరణి ఆగిపోవాలి..' అంటూ విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. విజయసాయిరెడ్డి ప్రసంగంలోని అభ్యంతరకర వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ తొలగిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire