ఇంచార్జీల మార్పు వెనక అసలు కథ?

ఇంచార్జీల మార్పు వెనక అసలు కథ?
x
Highlights

మొన్న ఏపీలో జిల్లా ఇన్‌ఛార్జీల మంత్రులను సమూలంగా మార్చేశారు సీఎం జగన్‌. ఒక్క గౌతం తప్ప, మిగతా వారినందర్నీ మార్చేశారు. ఇన్‌చార్జీల స్థాన చలనానికి...

మొన్న ఏపీలో జిల్లా ఇన్‌ఛార్జీల మంత్రులను సమూలంగా మార్చేశారు సీఎం జగన్‌. ఒక్క గౌతం తప్ప, మిగతా వారినందర్నీ మార్చేశారు. ఇన్‌చార్జీల స్థాన చలనానికి కారణమేంటి...మార్పు వెనక వ్యూహముందా...ముందస్తు జాగ్రత్త వుందా...?

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఛార్జ్‌ల మంత్రుల మార్పుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఎందుకు మార్చాల్సి వచ్చింది వారిపై వచ్చిన ఆరోపణలే కారణమా లేదంటే స్థానచలనం ఉంటేనే మంచిదని జగన్‌ భావించారా రెండూ లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మరింత చొచ్చుకెళ్లేందుకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను అటూఇటూ మార్చారా అన్న చర్చ, హాట్‌హాట్‌గా సాగుతోంది. వీటికి దారి తీసిన కారణాలపై రకరకాలుగా అమరావతిలో మాటలు వినిపిస్తున్నాయి.

ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మినహా, మిగతా మంత్రులందరికీ స్థాన చలనం తప్పలేదు. చిత్తూరు జిల్లాకు బాధ్యుడిగా ఉన్న గౌతం రెడ్డిని మాత్రమే అటూఇటూ జరపలేదు సీఎం జగన్. మిగతా వారిని మాత్రం ఊహించని చోట్లకు జబ్లింగ్ చేశారు. అయితే మూడు నెలల గ్యాప్‌లోనే ఈ సమూల మార్పులకు కారణమేంటన్నదానిపై మాత్రం ఆసక్తికరమైన చర్చే సాగుతోంది.

జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు, మొత్తం జిల్లాను తమకు రాసిచ్చినట్టుగా ఫీలవుతున్నారని, స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోందట. ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయిస్తున్నారని, గ్రూపు రాజకీయాలను పెంచిపోషిస్తున్నారని, సదరు బాధ్యులపై బాధితులు రగిలిపోతున్నారట.

సీనియర్లు, జూనియర్ల అన్న తేడా లేదట. ప్రతి ఒక్కరూ జిల్లాపై పట్టుబిగించేందుకు రకరకాల ఎత్తులు వేశారట. వీరి కదలికలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్‌, వారిపై ప్రత్యేక నిఘా పెట్టారట. పద్దతి మార్చుకోవాలని మొదట్లోనే హెచ్చరికలు జారీ చేశారట. కానీ సదరు మంత్రులు మాత్రం, అప్పటికప్పుడు తలూపినా, తర్వాత తీరు మార్చుకోలేదట. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం, అధికారుల నుంచి అందుతున్న నివేదికలను పరిశీలించిన మీదట, ఇలాగైతే పార్టీకే చెడ్డపేరు వస్తుందని, దీనికి పరిష్కారం స్థాన చలనమేనని డిసైడయ్యారట. దాని ఫలితమే పెద్ద ఎత్తున ఇన్‌ఛార్జ్‌ మంత్రుల మార్పులు.

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల బాధ్యతలను కొందరు మినిస్టర్లు అదనపు భారంగా బాధపడుతున్నారట. అటూఇటూ ఎటూ దృష్టిసారిచంలేకపోతున్నామని, తమకు రిలీఫ్‌ ఇవ్వాలని సీఎం జగన్‌కు మొరపెట్టుకున్నారట. ఈ జాబితాలో డిప్యూటీ సీఎంలుగా ఉన్న పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ నాని, నారాయణస్వామి, అంజాత్ బాషాలు ఉన్నారు. వీరికి డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు, తమకు కేటాయించిన శాఖలు, వారి సొంత జల్లాల్లో పార్టీ బాధ్యతలను కూడా వారికి అప్పగించబోతున్నారట. అందుకే వారికి ఇన్ ఛార్జ్ మంత్రుల బాధ్యత నుంచి రిలీవ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరించిన హోంమంత్రి మేకతోటి సుచరితపై వచ్చిన ఆరోపణలు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమెను బాధ్యతల నుంచి తప్పించినట్లు చర్చ జరుగుతోంది.

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల మార్పుకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కారణంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న మంత్రులే వుంటే, గ్రూపు రాజకీయాలు కంటిన్యూ అవుతాయని, కొత్త జోష్‌తో వెళ్లాలంటే, మార్పులు అవసరమని భావించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, వివిధ జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు, స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో సమన్వయం చేసుకోవడంలో కొందరు ఫెయిలయ్యారట. ప్రభుత్వ పథకాల అమలు, సమీక్షలు, ఇతరత్రా కార్యక్రమాల్లో సమన్వయ లోపంతో అక్కడక్కడా సమస్యలు తలెత్తుతున్నట్లు సీఎం జగన్ దృష్టికి ఫిర్యాదులు, నివేదికలు అందుతున్నాయట. ఈ పరిస్ధితి ఇలాగే కంటిన్యూ అయితే, లోకల్‌ ఎలక్షన్స్‌కు మరింత ముదురుతాయని భావించిన జగన్, మార్పుకే ఓటేశారని తెలుస్తోంది.

మొత్తానికి ఒక్కరు మినహా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులందరికీ స్థాన చలనం కల్పించడం, ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. మంత్రుల తీరే అందుకు కారణమా లేదంటే మార్పు కోసమే జగన్‌ మార్పు చేశారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా నియమించిన బాధ్యులకు మాత్రం, జగన్‌ చాలా సీరియస్‌గా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు, క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని, నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కరాఖండిగా చెప్పారట. గీత దాటితే, వేటేనని వార్నింగ్‌ ఇచ్చారట. అదీ ఇన్‌చార్జుల మార్పు వెనక అసలు కథ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories