ఆలయాల పై దాడుల నివారణకు ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం!

Andhra Pradesh Government key decision about attack on temples issue
x

AP CM Jagan (file image)

Highlights

* మత సామరస్యం కోసం ప్రత్యేక కమిషన్ * రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు * సీఎస్ ఆధ్వర్యంలో రాష‌్ట్రస్థాయి కమిటీ

ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంది. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ కమిటీలో అన్ని మతాల నుంచి ఒక్కో ప్రతినిధిని చేర్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటివి పునారవృతం కాకుండా చూసేందకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మతసామరస్యం కాపాడేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలు తరచూ సమావేశమవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.

రాష్ట్ర కమిటీలో సభ్యులుగా హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు ఉంటారని సీఎస్‌ చెప్పారు. అంతేకాకుండా సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని వెల్లడించారు. వరుస ఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ‌కమిటీలు రాష్ట్రంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. కమిటీలకు ప్రస్తుతానికి ఎలాంటి కాలపరిమితి లేదన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. మతసామరస్యం కాపాడేందుకు అందరూ ముందుకురావాలని సూచించారు. మతసామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయన్నారు.

హిందూ దేవాలయాలపై దాడులు, వాటిని వ్యతిరేకిస్తూ టీడీపీ,బీజేపీ ఆందోళనలతో ఏపీ అట్టుడుకుతోంది. నిన్న మొన్నటిదాకా పాలనా పరమైన అంశాలు ,ప్రభుత్వ విధానాల చుట్టూ తిరిగిన రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు మతం చుట్టూ చేరి భగ్గుమంటున్నాయి. వైసీపీ నేతలు చెప్తున్నట్లు దీని వెనకాల కుట్రలు దాగున్నాయో లేదో తెలియదు గానీ హిందుత్వ సెంటిమెంటును రగిల్చేందుకు ఈ పరిస్థితులు ఎంతో కొంత దోహదపడే అవకాశం లేకపోలేదు. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడుతున్నాయి. ఓవైపు ఈ దాడులను ఖండిస్తూ విపక్ష పార్టీల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే... మరోవైపు దుండగులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడే రీతిలో చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ దాడులకు తెరపడట్లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ దాడుల వెనుక టీడీపీ కుట్ర దాగుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories