AP CM YS Jagan: మహిళా సాధికారితే లక్ష్యం.. ఏపీ సీఎం జగన్
AP CM YS Jagan: డబ్బులు పంచి ఇవ్వడమే కాకుండా రాష్ట్రం అందించిన సాయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
AP CM YS Jagan: డబ్బులు పంచి ఇవ్వడమే కాకుండా రాష్ట్రం అందించిన సాయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చేయూత, ఆసరా వంటి పథకాల్లో లబ్ధిదారులు భవిషత్తులో సాధికారత సాధించడం కోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి సీఎం జగన్మోహనరెడ్డి, పలు సంస్థలతో ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతున్నారు.
మహిళా సాధికారత కోసం వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు చేయూత పథకం ద్వారా సహాయం అందించామని, సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. తాజాగా గురువారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రిలయన్స్ రిటైల్, జియో, అల్లాన కంపెనీల ప్రతినిధులు, సెర్ప్ సీఈఓ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూతను అందించాం. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా, స్థిరంగా వారికి ఏటా రూ.18,750 చొప్పున మొత్తం రూ.75 వేలు ఇస్తున్నాం. ఈ ఏడాది 23 లక్షల మంది మహిళలకు సుమారు రూ.4,300 కోట్లు ఇచ్చాం.
► వచ్చే నెల వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఏటా రూ.6,700 కోట్లు సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తున్నాం. నాలుగేళ్ల పాటు దాదాపు 93 లక్షల మంది మహిళలను ఆదుకుంటాం.
► చేయూత, ఆసరా.. రెండు పథకాలు పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు.
పలు సంస్థలతో ఎంఓయూలు
► ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్‌తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు రిలయన్స్, అల్లానా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయి. తద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది మా ప్రయత్నం. మేం ఇచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలి. ఈ దిశగా మీ సహకారాన్ని కోరుతున్నాం.
► గ్రామాల్లో సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. అక్కడే కియోస్క్‌లు కూడా పెడుతున్నాం. రైతులు ఆర్డర్ చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల క్వాలిటీ టెస్ట్ చేసి 48 గంటల్లో అందజేస్తున్నాం.
► ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం. ఆర్బీకేల ద్వారా కనీస గిట్టుబాటు ధరలను కల్పించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ప్రతి గ్రామంలో గోడౌన్, మండలాల వారీగా కోల్డు స్టోరేజీలు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. అంతిమంగా ఇవన్నీ జనతా బజార్ వంటి వ్యవస్థలకు దారి తీస్తాయి.
► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరస్పర ప్రయోజనంతో ముందుకు
చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాంక్షిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా మేము అడుగులు వేస్తున్నాం. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు కూడా లబ్ధి పొందాలన్నది మా విధానం. ఏపీలో అరటి లాంటి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెట్ కల్పిస్తున్నాం. దీని వల్ల అటు మహిళలు, ఇటు మాకు పరస్పర ప్రయోజనం కలుగుతుంది. గోడౌన్లు, కోల్డు స్టోరేజీల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయి. దీనిపై ప్రభుత్వ అధికారులతో కూర్చుని ప్రణాళికలు వేసుకుంటాం. – వి.సుబ్రమణియం, ఎండీ, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో)
ఉపాధి పద్ధతి బావుంది
చేయూత ద్వారా మహిళలకు జీవనోపాధి మార్గాలను చూపించే పద్ధతి బాగుంది. ఇది లబ్ధిదారుల కుటుంబాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. పంట చేతికి వచ్చిన తర్వాత సంరక్షించుకునే విధానాలపై దృష్టి పెట్టడం మరింత మేలు చేస్తుంది. ఉత్పత్తులకు విలువను జోడిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. – దామోదర్ మాల్, సీఈఓ, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో)
పూర్తిగా సహకరిస్తాం
చేయూత పథకంలో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు చాలా సంతోషం. మా దగ్గరున్న సాంకేతిక సహకారాన్ని, వ్యాపార అనుభవాన్ని పంచుతాం. రాష్ట్రంలోని పోర్టుల ద్వారా ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తాం. ఉత్పత్తులకు అదనపు విలువను జోడించాలి. ఇందుకు కొత్త తరహా ప్యాకేజింగ్ విధానాలు చాలా అవసరం. అన్ని విషయాల్లో మా సహకారం ఉంటుంది. సీఎం దార్శనికత ప్రశంసనీయం. – ఇర్ఫాన్ అల్లానా, అల్లానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రమోటర్ (లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో)
రిలయన్స్ రిటైల్
► మహిళల కిరాణా వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తుంది.
► దుకాణాల నిర్వహణ, ఆధునికీకరణ, వ్యాపార సమర్థతను పెంచడంలో మహిళలకు శిక్షణ ఇస్తుంది.
► సరసమైన ధరలకే ఉత్పత్తులను అందిస్తుంది. పండ్లు, కూరగాయల సాగుకు సహకరిస్తుంది.
జియో
► ఈ కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానించే ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తుంది.
► ప్రభుత్వం, లబ్ధిదారులైన మహిళల మధ్య నేరుగా అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది.
► జియో చాట్ ద్వారా నేరుగా 20 లక్షల మంది లబ్ధిదారులతో ఆడియో, వీడియో సందేశాలు పంపడం, ఇతరత్రా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తుంది.
అల్లాన
► ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి రంగంలో విశేష అనుభవం ఉంది. 1865 నుంచి కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
► గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో సాంకేతిక సహకారం అందిస్తుంది. వాటిని తిరిగి కొనుగోలు చేయనుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire