ఔను..ఆ మంత్రి అలిగారు.. సీఎంతో క్లోజ్‌గా వుండే ఆ మంత్రి గొడవేంటి?

ఔను..ఆ మంత్రి అలిగారు.. సీఎంతో క్లోజ్‌గా వుండే ఆ మంత్రి గొడవేంటి?
x
Highlights

అధికారుల తీరుపై ఆ మంత్రి అసంతృప్తితో రగిలిపోతున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ మంత్రిని తీవ్ర మనస్తాపానికి...

అధికారుల తీరుపై ఆ మంత్రి అసంతృప్తితో రగిలిపోతున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ మంత్రిని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోందట. అలిగిన ఆ అమాత్యుడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్నీ బాయ్ కట్ చేసారట. తాను చేయడమే కాదు నాయకులు, కార్యకర్తలకు కూడా ఆ వైపు వెళ్లొద్దని ఆదేశించారట. దీంతో రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనలో బిజీగా ఉన్న మంత్రిని, స్థానిక అధికారులు చిన్నచూపు చూస్తున్నారా అనే అనుమానాలు ఎక్కువ అయిపోతున్నాయట. రచ్చ గెలిచిన ఆ మంత్రి, ఇంట గెలవలేకపోతున్నారా అనే చర్చ వాడివేడిగా జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజవర్గం ఏది? అలిగిన ఆ మంత్రి ఎవరు?

కురసాల కన్నబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ముఖ్యమైన వారిలో ఒకరు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలోనూ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుగా సామాజిక, రాజకీయ అంశాలపై ఉన్న పట్టుతో పాటు, బలమైన సామాజిక వర్గం నుంచి రావడంతో ఇతర నాయకుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇస్తున్నట్టు అర్థమవుతోంది. విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన పలు సబ్ కమిటీల్లోనూ కన్నబాబును సభ్యునిగా నియమించారు. దీంతో అటు రాజకీయాలు, ఇటు పరిపాలనతో మంత్రి కన్నబాబు బిజీబిజీగా గడపాల్సి వస్తోంది. కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని, ఆయన తండ్రి లేదా సోదరుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే మంత్రి బిజీగా ఉన్నారు కదా, పట్టించుకోరన్న ధీమానో, లేక షాడో ఎమ్మెల్యేలుగా వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనేమో గాని, స్థానిక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులైతే, మంత్రి కన్నబాబును కాని, ఆయన అనుచరులనుగాని, అస్సలు లెక్క చేయడం లేదని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. విద్యా కమిటీల ఎన్నికల నుంచి జగనన్న విద్యా కానుక వరకు, అధికారులు ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారట. అదే మంత్రి కన్నబాబులో అసహనం పెంచుతోందట.

రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనతో పాటు వ్యక్తిగత, అనారోగ్య కారణాలతో నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న కన్నబాబును, విద్యా శాఖ అధికారులు మరింత తేలిగ్గా తీసుకుంటున్నారట. కన్నబాబు సిఫార్సుకు విద్యాశాఖ అధికారులు నో చెప్పడంతో పాటు, ఆయన కార్యాలయంతో సంప్రదింపులు జరపుకుండా, జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కూడా రూపొందించారట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం డెమో స్కూల్‌లో ఏర్పాటు చేసారట. కార్యక్రమం, ప్రోటోకాల్ తదితర విషయాల గురించి విద్యాశాఖ అధికారులు, మంత్రి కార్యాలయాన్ని సంప్రదించకుండా, నేరుగా ఆహ్వానపత్రాలతో ప్రత్యక్షమయ్యారట. విద్యాశాఖ అధికారుల తీరుతో అవాక్కయిన మంత్రి కన్నబాబు, సహాయ నిరాకరణ ప్రారంభించారట. నాడు నేడు కార్యక్రమం క్రింద కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, జిల్లాలో మూడు డెమో స్కూళ్ళను సిద్ధం చేయగా, అందులో ఒకటైన ఇంద్రపాలెం డెమో స్కూల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించాలని భావించిన కన్నబాబుకు, అధికారులు షాక్ ఇచ్చారట. ఆఫీసర్ల తీరుతో మనస్తాపానికి గురైన మంత్రి కన్నబాబు, ఆ కార్యక్రమాన్ని బాయ్ కట్ చేసారట. మంత్రి బాయ్ కట్ చేయడంతో, స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తిగా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విద్యా శాఖ అధికారులు కార్యక్రమాన్ని మమా అనిపించారట. ఈ పరిణామాలు, ఏపీ రాజకీయాల్లో కాక రేపాయి.

అధికారుల ఆహ్వానంతో కార్యక్రమానికి వచ్చిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇంద్రపాలెం స్కూల్ వద్ద ఏ హడావుడి కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారట. మంత్రి హోదాతో పాటు స్ధానిక శాసనసభ్యుడైన కన్నబాబుకు కనీసం ఒక్క ఫ్లెక్సీగానీ, ప్రోటోకాల్ ప్రకారం ఒక బ్యానర్‌ కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించిన పిల్లిబోస్, స్కూలు లోపలికి వెళ్ళకుండా బయట నుంచి ఆరా తీసేసరికి, మంత్రి కన్నబాబు అలక పాన్పు ఎక్కారని తెలుసుకున్నారట. అటు నుంచి అటే కన్నబాబు వద్దకు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందట. దీనితో మంత్రి కన్నబాబు అదే రోజు మధ్యాహ్నం, కరప మండలంలో, జగనన్న విద్యా కానుక కార్యక్రమం చేపట్టారట. కాకినాడ రూరల్, కరప రెండు మండలాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కార్యక్రమం నిర్వహించారట.

కాకినాడలో మంత్రి-అధికారుల కోల్డ్‌వార్‌‌నపై పొలిటికల్ సర్కిల్స్‌లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గ పరిధిలో ఓ మండల అధికారి బదిలీ కోసం చేసిన సిఫార్సును జిల్లా విద్యా శాఖ అధికారి తోసిపుచ్చడం, విద్యా కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అధికారులు ఓవరాక్షన్ చేయడం, వీటన్నింటికి తోడు, నాడు నేడు పనులను, జిల్లా కలెక్టర్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంపై, మంత్రి కన్నబాబు అసంతృప్తితో రగిలిపోతున్నారట. రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనతో బిజీగా ఉన్నంత మాత్రాన, తనను తేలిగ్గా తీసుకుంటే, ఎలా అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారట. తన కార్యాలయం సిబ్బందితో సంప్రదించకుండా కార్యక్రమాన్ని రూపొందించడం, నేరుగా ఆహ్వాన పత్రంతో అధికారులు ప్రత్యక్షం కావడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారట. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో కార్యక్రమాన్ని ప్రారంభించడంపై అతని అనుచరులు, నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఇలాగైతే అధికారుల విషయాన్ని సీఎంతోనే తేల్చుకుంటానని సీరియస్‌గా వున్నారట కన్నాబాబు.


Show Full Article
Print Article
Next Story
More Stories