ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి మంటలు ఒకవైపు మండుతుంటే, అదే మండలి రద్దు ప్రతిపాదనతో, ఇద్దరు మంత్రులు హస్తినబాటపడుతున్నారు. మినిస్టర్స్‌గా బాధ్యతలు...
ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి మంటలు ఒకవైపు మండుతుంటే, అదే మండలి రద్దు ప్రతిపాదనతో, ఇద్దరు మంత్రులు హస్తినబాటపడుతున్నారు. మినిస్టర్స్‌గా బాధ్యతలు నిర్వహించిన పిల్లి సుభాష్, మోపిదేవిలు రాజ్యసభతో ఢిల్లీకి మకాం మార్చబోతున్నారు. దీంతో వీరు ఖాళీ చెయ్యబోతున్న రెండు బెర్త్‌లను, ఎవరితో భర్తీ చెయ్యబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఆశావహులు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టారు. మరి ఆ ఇద్దరు లక్కీ ఎమ్మెల్యేలు ఎవరు? సమీకరణాల అంచనాలు ఏం చెబుతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు ప్రతిపాదన నేపథ్యంలో, వైఎస్ జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళుతున్నారు. ఇరువురూ పార్లమెంట్‌కు వెళ్తుండటంతో, మంత్రి వర్గంలో రెండు బెర్త్‌లు ఖాళీకాబోతున్నాయి. వీరి స్థానంలో ఎవరిని రీప్లేస్ చేస్తారన్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ కలిగిస్తోంది.
పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లా నాయకుడు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బీసీ లీడర్. దీంతో ఇదే జిల్లాకు చెందిన మరో బీసీ ఎమ్మెల్యేకు చాన్స్ వస్తుందా అన్న అంచనాలు పెరుగుతున్నాయి. శెట్టిబలిజ సామాజిక తరగతి కోటాలో అయితే, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ, మత్స్యకార కోటాలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో వేణు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. పొన్నాడ 2009-14 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో సిఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే జిల్లాలో కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్ మంత్రులుగా ఉన్నారు. వారిని కొనసాగిస్తూ కొత్తవారికి అవకాశమిస్తారా..లేదా అన్నది చర్చనీయాంశమైంది. కొత్త వారికి ఛాన్స్ వస్తే తమ పేరును పరిశీలించాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన రాజకీయ గురువైన పుదుచ్చేరి మంత్రి మల్లాడి కష్ణారావుతో కలిసి పొన్నాడ, ఇటీవల జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో బెర్త్ కోసం ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయతే తాను ఖాళీ చెయ్యబోతున్న మినిస్టర్ సీటు కావడంతో, బోస్ మాటకు విలువుంటుందన్నది వినిపిస్తున్న చర్చ. మరి బోస్ ఎవరి వైపు మొగ్గుచూపుతారు లేదంటే జగన్ నిర్ణయమే ఫైనలా అన్నది ఆసక్తి కలిగిస్తోంది.
గౌడ సామాజికవర్గానికి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా, మంత్రివర్గ రేసులో వున్నారన్న చర్చ జరుగుతోంది. మొదటి నుంచి జగన్‌కు తోడుగా వుంటూ బలమైన వాయిస్ విన్పిస్తున్న జోగి రమేష్‌కు, సీఎం దగ్గర మంచి మార్కులే వున్నాయి. అయితే కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండటం జోగికి అడ్డంకిగా మారే అవకాశముంది. దానికితోడు గుడివాడ, పెడన, మచిలీపట్నం పక్క,పక్క నియోజకవర్గాలు కావడం రమేష్‌కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది మరో ప్రశ్న.
అటు శ్రీకాకుళం జిల్లా నుంచి మరో బీసీ నేత ధర్మాన ప్రసాదరావు కూడా, మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మూడు రాజధానుల విభజన చర్చలోనూ మాట్లాడేందుకు ధర్మానాకే ఎక్కువ అవకాశమిచ్చారు జగన్. అందులోనూ పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర నుంచి, గట్టి మంత్రి వుండాలన్న భావన నేపథ్యంలో, ధర్మాన ప్రసాద్‌కు బెర్త్ దక్కే ఛాన్సుందన్న అంచనాలున్నాయి. అయితే, సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గంలో వుండటంతో, ప్రసాద్‌కు చాన్స్ ఇస్తారా లేదా అన్నది అనుమానం. లేదంటే కృష్ణదాస్‌కు మరో పదవి ఇచ్చి, ప్రసాద రావుకు చోటు కల్పిస్తారా, ఇరువురికి అవకాశమిస్తారా అన్న సమీకరణలు కూడా సాగుతున్నాయి. మరోవైపు ఇటీవలె సోదరుడు కృష్ణదాస్ సైతం, ధర్మాన ప్రసాదరావుకు త్వరలోనే మంచి పదవి వస్తుందని ఓ సభలో చెప్పడంతో, ఈ అంచనాలకు బలం చేకూరుతోంది.
బీసీ నేతలే కాదు, ఇతర సామాజికవర్గాల నేతలు సైతం కేబినెట్ బెర్త్ కోసం క్యూలో వున్నారు. గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ స్థానం ఖాళీ అవుతుండటంతో, ఈ జిల్లాకే చెందిన నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడించిన ఆర్కేకు, ఎన్నికల ప్రచారం టైంలోనూ జగన్ మాటిచ్చారు. అయితే, సమీకరణల నేపథ్యంలో చోటు దక్కలేదు. ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీటిచ్చారు. దీంతో ఆర్కే సైలెంట్ అవుతారా..ఇచ్చిన మాట కోసం పట్టుబడతారా అన్నది చూడాలి. మరోవైపు ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సైతం, కేబినెట్ రేసులో వున్నానంటూ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇలా ఖాళీ కాబోతున్న రెండు మంత్రి పదవుల కోసం ఎవరికివారు, రకరకాల సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, సీఎం జగన్ ఈక్వేషన్స్ ఏంటి? ఆశావహుల్లో ఎవరికి బెర్త్ దొరుకుతుందన్నది మాత్రం అంతకంతకూ ఉత్కంఠను పెంచుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire