Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరి ముస్తాబు

All Set For TTD Brahmotsavam 2022
x

Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరి ముస్తాబు

Highlights

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలు

Tirumala: లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మాండ నాయకుని వేడుకకు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ మొదటిసారి బలమైన నిర్ణయం తీసుకుంది. దీంతో బ్రహ్మోత్సవాల్లో ప్రతి సామాన్య భక్తుడు ప్రముఖుల తరహాలో స్వామివారి సేవలో తరించనున్నారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు ముస్తాబయ్యాయి. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిబంధనల మధ్య జరుగుతున్న బ్రహ్మో్త్సవాలను ఈసారి భక్తుల మధ్య బ్రహ్మాండంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో స్వామివారి వాహన సేవలను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీనివాసుడి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యేలా టీటీడీ ముహూర్తం నిర్ణయించింది. ధ్వజారోహణానికి ముందురోజు అంటే సోమవారం సాయంకాలం భగవన్నారాయణుని సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం అంకురార్పణ జరుగుతుంది.

మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మాడవీధుల్లో పెద్దశేషవాహనంపై ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. ఈ ఘట్టంతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్తు కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది.

రెండేళ్ల తర్వాత వాహనసేవలను వీక్షించే భాగ్యం కలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించడం టీటీడీ చరిత్రలోనే తొలిసారి కానుంది. గరుడోత్సవం రోజున ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారన్న అంచనాతో సుమారు ఆరు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీ, పోలీసు, రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆలయ మాడవీధుల్లో గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను సిద్ధం చేశారు. భక్తులు మాడవీధుల్లోకి క్యూలైన్ల ద్వారా ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు.

ఎన్నడూ లేనంత కఠినంగా ప్రముఖులను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాని భక్తులు హర్షిస్తున్నారు. అయితే సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానాన్ని అమల్లోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమౌతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories