అవి క్రూర మృగాలకు అనువైన అవాస ప్రాంతాలు. కొండ గుట్టలు, చిన్నచిన్న తిప్పలతో వున్నా ఆ ప్రాంతం సమీప గ్రామాలకు ప్రమాదకరంగా వుంటుంది. కానీ వారంతా...
అవి క్రూర మృగాలకు అనువైన అవాస ప్రాంతాలు. కొండ గుట్టలు, చిన్నచిన్న తిప్పలతో వున్నా ఆ ప్రాంతం సమీప గ్రామాలకు ప్రమాదకరంగా వుంటుంది. కానీ వారంతా ధైర్యాన్ని కోల్పోరు. ఎటువంటి భయం లేకుండా యధేచ్చగా సంచరిస్తూ ఉంటారు. అందుకు కారణం ఆ గ్రామంలోని గ్రామ సింహాలు. అలాంటి జాగిలాలు తోడుంటే ఎలాంటి వారైనా ధైర్యంగా ముందుకు దూసుకెళ్తారు. ఆ శునక రాజసం కధేంటో ఇప్పుడు చూద్దాం.
తుంగభద్రమ్మ, కుందు నదుల తీర ప్రాంతాల్లో ఉందా గ్రామం. ముందు చూపులేని పాలకుల చర్యలతో సాగునీటికి, తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో, వర్షాన్ని నమ్ముకొని పంటను వేసేవారు. అలా వేసిన పంటను వన్యమృగాల నుంచి కాపాడుకునేందుకు గ్రామ సింహాలే వారికి దిక్కు అయ్యాయి. యజమానుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, క్రమశిక్షణతో కూడిన సైనికుల మాదిరిగా పంట పొలాలకు, పండిన పంటకు, ఆ గ్రామానికి నిజమైన రక్షకులుగా మారాయి. దీంతో ఆ గ్రామ పొలాల్లోకి జంతువులు అడుగు పెట్టాలన్నా, గ్రామంలోకి కొత్త వారు రావాలన్నా, పెద్ద సాహసం చేయాలిసిందే. ఇంతకీ ఎక్కడ ఆ గ్రామం, ఏమిటి అక్కడి ప్రేత్యేకత అనేగా మీ సందేహం..?
ఈ గ్రామం పేరు పందికోన. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఈ గ్రామం వుంది. తుంగభద్ర తీరాన ఉన్న ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. వేట కుక్కలను కుందేళ్ళు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి సొంతం. విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైన ఈ ప్రాంతం గతంలో ఒక వెలుగు వెలిగింది. ఈ మట్టి మీద నివసించేవారికి, నీటిని తాగిన వారికి పౌరుషం పుట్టుకతోనే వస్తుంది అన్నది పెద్దల నానుడి. ఈ పౌరుషం పందికోన గ్రామానికి ఒక పాళ్ళు ఎక్కువ అని చెప్పుకోవాలి. ఈ గ్రామం చుట్టు పదుల మైళ్ళ వరకు కొండగుట్టలతో కూడిన అడవులున్నాయి. ఈ అడవుల్లో క్రూర మృగాలతో పాటు వందలాది వన్య ప్రాణులకు ఆవాసంగా వున్నాయి చిరుతలు సైతం ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించేవి. అవి అడవి సమీపంలోని గ్రామాలపై విరుచుకు పడుతు వుండేవి. కానీ పందికోన గ్రామంలోకి ప్రవేశించాలంటే ముందు వెనుక కాస్త ఆలోచించేవి.
పందికోన పరిసరాలు మొత్తం అడవితో నిండుకుని ఉంటుంది. క్రూర మృగాలు సైతం విహరిస్తుంటాయి. ఐనా అక్కడి స్థానికులు కూసంత భయం కూడా లేకుండా తిరుగుతున్నారంటే దానికి కారణం సింహాలు లాంటి ఆ కుక్కలు వారి వెనక ఉండటమే.
కొత్తవారు పందికోన గ్రామంలో అడుగు పెట్టాలన్న, క్రూర మృగాలు ఈ గ్రామం వైపు కన్నెత్తి చూడాలన్న వాటికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ గ్రామానికి రక్ష ఇక్కడి శునకాలే. వాటిని చూడగానే తెలియని భయం సహజంగా ఎదుటి వారిని ఆవరిస్తుంది. చూసేందుకు జాతి కుక్కల మాదిరిగా ఎక్కువ ఎత్తు, అధిక బరువుగా కనపడవు, మామూలు కుక్కల మాదిరిగానే వుంటాయి. కానీ యజమాని తనపై ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము చేయవు. పోరాట సమయంలో పౌరుషానికి ప్రతీకగా నిలుస్తూ, ప్రాణం పోతున్నా వెనుకడుగు వేయవు. విజయమో, వీరస్వర్గమో అన్నట్లు పోరాడుతాయి. ఇక విశ్వాసం విషయంలో వీటికి సాటి ఏవి ఉండవంటే అది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ శునకాల అరుపులకి ముచ్చెమటలు పడతాయి. కాళ్ళు వణికి పోతాయి. ఎంతటి వారయినా అడుగు ముందుకు వేయలేరు. ఎందుకంటే ఈ శునకాలు కదలనీయవు. సాహసం చేసి ఎవరైన అడుగు ముందుకు వేసారో అంతే సంగతులు. వారి అంతు చూసే వరకు వదలవు మరి.
పందికోన శునకాలు ఓ ప్రత్యేక జాతికి చెందినవి. విశ్వాసం వీటికి చాలా ఎక్కువ. యజమానిని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఇక్కడి గ్రామ ప్రజలు ఈ శునకాలను తమ కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వీటికి ఎటువంటి శిక్షణ వుండదు. కానీ యజమాని మాటే దానికి శిరోధార్యం. ఇవి తమకు, తమ గ్రామానికి పెట్టని కోట అని వాటి యజమానులు చెపుతారు. బ్రిటిష్ వారి హయాంలో ఈ గ్రామ సింహాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని గర్వంగా చెబుతారు. అవి తమ గ్రామంలో ఉన్నంతవరకు దొంగల భయం కానీ, క్రూర జంతువుల ఇబ్బంది కాని వుండవని గట్టిగానే విశ్వసిస్తారు. పందికోన గ్రామ శునకాలు ఏకంగా పులులనే తరిమి కొట్టే సత్తా చాటిన సందర్భాలు ఎన్నో వున్నాయి. చిరుత పులిని ఒకే ఒక్క శునకం ఎదిరించగలదని, ధైర్యం చేసి అడుగు ముందుకు వేసే చిరుతలు, వన్య మృగాలపై దాడి చేసి చంపేసిన సందర్భాలు కూడా లేకపోలేదు అంటారు. పందికోన గ్రామం లోని కుక్కలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గ్రామస్తులు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ గ్రామం పేరు చెప్పగానే ఎదుటివారి నుంచి వచ్చే తొలి ప్రశ్న మాకు కుక్క దొరుకుతుందా అని.
పందికోన శునకాలను దేశం నలుమూలల నుంచి వచ్చి తీసుకెళ్తుంటారు. పందికోనవాసులు ఏ ప్రాంతానికి వెళ్లినా ముందుగా శునకాల గురించే అడుగుతారంటే వాటికి ఎంతటి గుర్తింపు ఉందో అర్ధమవుతోంది.
ఎక్కడెక్కడి నుంచో పందికోనకు వచ్చి శునకాలను తీసుకెళ్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తాపీగా వీటిని తీసుకుని వెళదామా అంటే అస్సలు కుదరదు. కుక్క కావాలి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే గ్రామస్తులకు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిందే. ఇంత డిమాండ్ ఉన్న కుక్కలను ఎంతకు అమ్మి సొమ్ము చేసుకుంటారు అన్న సందేహం అందరికీ రాకమానదు. కానీ ఖచ్చితంగా ఉచితంగానే ఇస్తారు. పొరపాటుగా కూడా వాటిని ఎవరు ఎవరికీ విక్రయించరు. కేవలం పరిచయం ఉన్న వ్యక్తులతో పాటు, కుక్క కావాలని వచ్చిన వారికి ఉచితంగానే అందిస్తారు. వీటిని తీసుకెళ్లేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలలతో పాటు ఇతర దేశాల నుండి కూడా వస్తూ ఉంటారని ఈ గ్రామస్తులు గర్వంగా చెబుతారు. గతంలో క్రూర మృగాలు విరుచుకు పడి పశువులను, గొర్రెలను చంపి తినేవి. గ్రామమస్తులపై అనేక సార్లు దాడులు చేసాయి. దీంతో గ్రామస్థులు కనీస రక్షణ కోసం అధికంగా శునకాలు పెంచటం ప్రారంభించారు. ఈ శునకాలే ఇప్పుడు పందికోన గ్రామానికి ఓ గుర్తింపు తెచ్చి పెడుతున్నాయి.
పందికోన గ్రామం శునకాలు ఎప్పుడు హాట్ కేక్స్ గా వుంటాయి అంటే అతిశయోక్తి కాదు. వీటి విశ్వాసం, వేటాడే తీరు, అన్నిటికి మించి ఇంట్లో వారిని కని పెట్టుకుని ఉండే లక్ష్యం చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పశువులకు కాపలాగా, గొర్రెల మందులకు తోడుగా ఈ శునకాలు ఎంతో భేష్ గా పనిచేస్తుంటాయి. ఒక్కసారి ఈ కుక్కలను తీసుకు వెళ్లిన వారు వాటి పని తీరును చూసి తమకు కావలసిన వారికి, సొంతమైన వారికి పందికోన కుక్కలు తెచ్చుకోవాలని సిఫార్సు చేస్తూ ఉంటారు. దీంతో చాలామంది ఈ కుక్కలను తమ సొంతం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
పందికోన గ్రామ శునకాల కాళ్ళ గోర్లు మొనదేలి ఉండటంతో వేటలో అవి ఎంతో ఉపయోగంగా మారుతున్నాయి. మరో వైపు గంభీరమైన శునకాల స్వరం కూడా ప్రత్యేకమే. అందుకే వీటి పెంపకంలో యజమానులు మరింత శ్రద్ధ చూపుతున్నారు. నేర నియంత్రణకు పోలీసులకు అత్యంతంగా ఉపయోగపడే జాగిలాల జాబితాలో ముందు వరుసలో పందికోన కుక్కలు ఉంటాయి. ప్రస్తుతం ల్యాబ్, అల్ సేషియన్, జర్మన్ షెఫర్డ్ లాంటి జాతి కుక్కలను పోలీసులు వాడుతున్న పరిస్థితి ఉంది. గతంలో పోలీసులు కూడా ఈ శునకాలనే ఎంచుకునే వారని, నేరం చేసినవారి వాసన పసి కట్టటంలో ఈ శునకాలు వాటికీ అవే సాటి అంటారు. విదేశీ జాతి కుక్కల కన్నా మిన్నగా పందికోన శునకాలు ఇపుడు పేరు సంపాదించుకుంటున్నాయి. ఎంతైనా పౌరుషాల గడ్డ మీద పుట్టిన కుక్కలే కదా మరి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire