Balineni: వైసీపీకి భారీ కుదుపు... హైదరాబాద్‌లోని బాలినేని ఇంట్లో రాయబారానికి వచ్చిన పులివెందుల సతీశ్ రెడ్డి, విడదల రజని

A major upheaval for YCP Pulivendula Sateesh Reddy and Vidudala Rajani came to Balineni house in Hyderabad for negotiations
x

Balineni: వైసీపీకి భారీ కుదుపు... హైదరాబాద్‌లోని బాలినేని ఇంట్లో రాయబారానికి వచ్చిన పులివెందుల సతీశ్ రెడ్డి, విడదల రజని

Highlights

వైఎస్ ఆర్ బతికుండగా జిల్లాలో బాలినేనిదే హవా. వైసీపీ 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా పార్టీకి ఆయనే దిక్సూచి. 2019 ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ బాలినేని చెప్పిందే నడిచింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే దిశలో బాలినేని.

ఆయన జనసేనలో చేరుతున్నారా..!

జగన్ దూతగా రంగంలోకి దిగిన పులివెందుల సతీష్ రెడ్డి

బుజ్జగించేందుకు ప్రయత్నాలు

ఎన్నాళ్ళు భరించాలి అవమానాలు.. బాలినేని ఆవేదన

హైదరాబాద్ లో బాలినేని ఇంటికి వచ్చిన విడదల రజని

ఒంగోలు నుంచి హైదరాబాద్ కు చేరుకున్న బాలినేని అనుచరులు

అయిదుసార్లు ఎమ్మెల్యే.. రెండు సార్లు మంత్రి.. వైసీపీలో జగన్ తరువాత అగ్రశ్రేణి నాయకుల్లో ఆయనొకరు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ ప్రకాశం జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన నాయకుడు. అన్నిటికి మించి వైఎస్ఆర్ సమీప బంధువు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి స్వయానా బావ. ఆయనే బాలినేని... పూర్తి పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి.

ఆయనను చాలా మంది వాసు, వాసన్న అని పిలుస్తుంటారు. ఇపుడాయన కలత చెంది ఉన్నారు. అవమానభారంతో వైసీపీ నుంచి పక్క చూపు చూస్తున్నారు. ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరతారని టాక్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలినేనికీ, జనసేనకు మధ్య సమన్వయం చేస్తున్నాడని కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. నాగబాబుతో బాలినేని టచ్ లో ఉన్నారనీ, ఈనెల మూడోవారంతో ఆయన జనసేనలో చేరబోతున్నట్టు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ఉన్న బాలినేనికి ఏమైంది? జగన్ ఆయనను అవమానించారా? పార్టీలో ఆయనకు గుర్తింపు లేకుండా పోయిందా.. అసలేమైంది?

వైఎస్సార్ ఉన్నప్పుడు బాలినేనిదే హవా...

వైఎస్ ఆర్ బతికుండగా జిల్లాలో బాలినేనిదే హవా. వైసీపీ 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా పార్టీకి ఆయనే దిక్సూచి. 2019 ఎన్నికల సందర్భంగా సీట్ల కేటాయింపులోనూ బాలినేని చెప్పిందే నడిచింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలివిడతలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. మంత్రి పదవి దక్కినా పార్టీలో ఆయనకు మునుపటి ప్రాభవం కరువైంది. జగన్ వద్ద అంతగా ప్రాధాన్యం లేని నాయకుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది. అనేక కీలక సందర్భాల్లో వాసు నిర్ణయాలకు జగన్ అంతగా విలువివ్వలేదన్న ప్రచారమూ ఉంది.

వైవీ సుబ్బారెడ్డి వల్లే ఇదంతానా...?

జగన్ వద్ద బాలినేని నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోవటానికి ఆయన బావ వైవీ సుబ్బారెడ్డి కూడా కారణమన్న ప్రచారముంది. అయితే వైవీ మాత్రం ఎక్కడా వివాదాస్పద విషయాల్లో తన పేరు వినపడకుండా జాగ్రత్త పడ్డారు.

వైవీ సుబ్బారెడ్డి 2014 నుంచి 2019 దాకా ఒంగోలు ఎంపీగా ఉన్నారు. 2014లో ఒంగోలు అసెంబ్లీ సీటు నుంచి బాలినేని ఓడిపోయినా లోక్ సభకు పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం గెలిచారు. దీంతో జిల్లాలో వైవీ పట్టు పెరిగింది. అప్పటిదాకా బాలినేని చెప్పిందే శాసనంగా ఉన్న పార్టీలో వైవీకి ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో వైవీ తన సొంత కోటరీని ఏర్పర్చుకోవటం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేనికీ, వైవీకి మధ్య రాజకీయంగా వైరం పెరిగింది. అది చినికి చినికి గాలివానలా మారింది.

కొండెపితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో రెండు వర్గాలు తయారయ్యాయి. జిల్లా అధ్యక్షుడి హోదాలో అనేకసార్లు బాలినేని ప్రత్యక్షంగా, పరోక్షంగా వైవీపై కంప్లయింట్ చేశారు. మరికొన్ని సార్లు జగన్ ను కలిసి చెప్పుకున్నా సమస్యలు పరిష్కారం కాలేదు. బాలినేని మునుపటి హవా క్రమేపీ తగ్గటం ప్రారంభమైంది.

2019 ఎన్నికల నాటికి పట్టు బిగించిన బాలినేని

ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో బాలినేని 2019 ఎన్నికల సమయానికి పట్టు బిగించారు. జగన్ వద్ద విజ్ఞప్తుల స్థాయి నుంచి డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు.. ఇలా అయితే రాజకీయాలు చేయలేననీ, జిల్లాలో తన పెత్తనమే సాగాలనీ, పార్టీలో మరో అధికార కేంద్రాన్ని ప్రోత్సహిస్తే మీకే నష్టమన్న సంకేతాలు పంపించారు. కొన్నిసార్లు కుండబద్దలు కొట్టినట్టు తన ఆగ్రహాన్నీ, ఆవేదనను జగన్ ముందు వెళ్లగక్కినట్టు సమాచారం.

ఎన్నికల సమయంలో జగన్ కూడా ఒక అడుగు వెనక్కి వేసి బాలినేనికి అధికారం అప్పగించారు.. అన్నిటికి మించి 2019 ఎన్నికల నాటికి సిటింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రం నుంచి తప్పించటంలో బాలినేని సక్సెస్ అయ్యారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైవీ చేతిలో ఓడిపోయిన మాగుంట శ్రీనివాసరెడ్డిని బాలినేని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికల సమయం నాటికి మాగుంట టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీ అయిన వైవీని కూడా కాదని జగన్ మాగుంటకు టికెట్ ఇచ్చారు. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా బాలినేనిదేనని పొలిటికల్ టాక్.

కట్ చేస్తే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది. కానీ, బాలినేని సంతోషం కొద్దిరోజుల్లోనే ఆవిరయింది.. జగన్ వద్ద ఒక అప్రాధాన్య నాయకుడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. జగన్ తో భేటీ కావటం, మనసులో ఉన్న విషయాలను చెప్పుకోవటానికి ఎపుడో అరుదుగా తప్ప అవకాశం రాని సందర్భాలు ఏర్పడ్డాయి. దీనికి ప్రధాన కారణం.. బాలినేని, అతని కుమారుడి అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తటమేనని అందరూ చెబుతుంటారు. ప్రత్యేకించి భూ కబ్జాలపై అతని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిపై ఆరోపణల పరంపర కొనసాగింది.

భూదందాల ఎఫెక్ట్..

వైసీపీకి అనుకూలంగా ఉండే పంచ్ ప్రభాకర్ వంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా బాలినేని భూ దందాపై విరుచుకుపడ్డారు. భూములే కాకుండా ప్రకాశం జిల్లాలో గనులు, అతని వియ్యంకుడు విల్లాలు తదితర అనేక విషయాల్లో బాలినేనిపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రావటం కాదు, వాటిని జగన్ వద్దకు చేరవేసేందుకు అతని ప్రత్యర్ధులు పెద్ద ఆపరేషనే నడిపించినట్టు సమాచారం.

దీంతో జగన్ కూ, బాలినేనికి మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది. ఫలితంగా మంత్రివర్గ విస్తరణలో బాలినేని మినిస్టర్ పోస్టుకు ఎసరొచ్చింది. తనను మంత్రి పదవి నుంచి తప్పించటాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు.. అలిగారు.. ఇంతకు మించి అవమానం ఏముంటుందని.. పార్టీ నుంచి బయటకు పోతానని బెదిరించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి లాటి వాళ్లు ఎలాగో బుజ్జగించి జగన్ వద్దకు తీసుకొచ్చి మెత్తబడేలా చేశారు.

అయినా బాలినేని వ్యధ తగ్గలేదు. గుండెల్లో బాధ తగ్గలేదు. అవమాన భారాన్ని తట్టుకుని 2024 దాకా అసంతృప్తులతో, అలకలతో, ఆగ్రహంతో అలాగే కాలం నెట్టుకొచ్చారు. సొంత పార్టీలో వాళ్లే తనపై కుట్ర చేస్తున్నారని బహిరంగంగా ప్రకటించారు. కొన్నిసార్లు మీడియా సమావేశాల్లో భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి గురించే అలా మాట్లాడారని అప్పట్లో అందరూ అనుకున్నారు.

మాగుంటకు ఎంపీ సీటుపై ముదిరిన విభేదాలు

ఒంగోలు ఎంపీ సీటును మాగుంటకు ఇచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పాడు. అలా కుదరదు, మాగుంటకు ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు. మాగుంట గురించి తప్ప దేని గురించయినా మాట్లాడు అని జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం. దాంతో మాగుంట వైసీపీ నుంచి తప్పుకుని టీడీపీలో చేరారు. ఆ దశలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారమైంది. ఒకటి రెండు సందర్బాల్లో బాలినేనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా మాట్లాడటం దీనికి కారణం.

తెరవెనుక పవన్ కళ్యాణ్ తో మంతనాలు చేస్తున్నారని కొందరు.. చంద్రబాబుతో టచ్ లో ఉన్నారనీ, ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని మరికొందరు ప్రచారం చేశారు. మాగుంటను కాదనుకుని చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు నుంచి పోటీ చేయించటం బాలినేనికి అసలు ఇష్టం లేదు.

జగన్ కు సన్నిహితుడైన చెవిరెడ్డి మరో అధికార కేంద్రాన్ని నడిపితే బాలినేనికి జిల్లాలో ప్రాధాన్యం ఏముంటుందన్న చర్చ కూడా జోరుగా నడిచింది. ఎట్టకేలకు పార్టీని వీడకుండానే కొంత అయిష్టంగా, కొంత ఆగ్రహంగా.. ఎంతో అసంతృప్తితో పార్టీలోనే కొనసాగి ఒంగోలు నుంచి పోటీ చేసి బాలినేని ఓడిపోయారు. ఓడిపోయిన రోజే ఆయన హైదరాబాద్ వెళ్లి పోయారు.

అపుడపుడు ఒంగోలు వస్తున్నా పార్టీ వ్యవహారాల గురించి అసలు పట్టించుకోవటం లేదు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి సహా అనేకమంది వైసీపీని వీడి తన రాజకీయ బద్ద శత్రువు దామచర్ల జనార్దన్ సమీక్షంలో టీడీపీలో చేరినా బాలినేని నుంచి ఉలుకూ పలుకూ లేదు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తరువాత కూడా బాలినేనిని జగన్ లైట్ తీసుకున్నట్టు సమాచారం. పార్టీ గురించి బాలినేనిని పట్టించుకునేలా చేయమని కొందరు వైపీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఇటీవల జగన్ ను కలిసి రిక్వస్ట్ చేయటం కొసమెరుపు.

గుడ్ బై చెప్పేందుకే నిర్ణయం?

ఈ నేపథ్యంలో వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బాలినేని నిర్ణయించుకున్నారని పార్టీ హై కమాండ్ కు కూడా అర్ధమైంది. బాలినేని లాంటి సీనియర్ నాయకుడు వెళ్లిపోకుండా డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు కొందరు వైసీపీ పెద్దలు జగన్ అనుమతితో పులివెందుల సతీష్ రెడ్డిని రంగంలోకి దింపినట్టు సమాచారం.

హైదరాబాద్ లో బాలినేని నివాసంలో సతీష్ రెడ్డి మంతనాలు చేస్తున్నారు. పార్టీ వీడకుండా బాలినేనిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన అవమానాలపై బాలినేని ఏకరువు పెడుతూ ఆవేదన చెందినట్టు సమాచారం.

మాజీ మంత్రి విడదల రజని కూడా హుటాహుటిన హైదరాబాద్ లో బాలినేని ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. ఒంగోలు నుంచి బాలినేని అనుచరులు కూడా హైదరబాద్ చేరుకున్నారు. వైసీపీలో ఇదే పెద్ద హాట్ టాపిక్.. బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories