ఏపీని కలవరపెడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు

ఏపీని కలవరపెడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు
x
Highlights

ఘోర రోడ్డు ప్రమాదాలు ఏపీని కలవరపెడుతున్నాయి. కారణం ఏదైతేనేం నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొన్న అరకు దుర్ఘటన మరువక ముందే ఇవాళ కర్నూలు రహదారి...

ఘోర రోడ్డు ప్రమాదాలు ఏపీని కలవరపెడుతున్నాయి. కారణం ఏదైతేనేం నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొన్న అరకు దుర్ఘటన మరువక ముందే ఇవాళ కర్నూలు రహదారి రక్తమోడింది. ఒక్కరు, ఇద్దరు కాదు... ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారితో పాటు, 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ప్రమాదం సమయంలో టెంపోలో 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి అజ్మీర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మదనపల్లె వాసులుగా గుర్తించారు.

మరోవైపు ప్రమాదానికి గురైన టెంపో అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో యాస్మిన్, ఆస్మా, కాశీం, ముస్తాక్‌ను కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్షమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మదనపల్లె వాసులకు ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున తక్షణ సాయంగా అంద చేస్తున్నట్లు తెలిపారు.

ఘోరరోడ్డు ప్రమాదంతో మదనపల్లిలోని అమ్మ చెరువు మిట్ట, బాలాజీ నగర్ ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories