ఆ నలుగురు మంత్రుల్లో టెన్షన్ ఎందుకు.. కాస్త అటు ఇటు అయినా ఫ్యూచర్‌కే ఎసరా?

Update: 2020-10-13 12:10 GMT

గ్రేటర్‌లో ఎదురే లేదనుకున్న మినిస్టర్లలో, ఎందుకనో బెదురు మొదలైందట. భాగ్యనగరంలో తిరుగేలేదన్న మంత్రుల్లో, బెరుకు స్టార్ట్ అయ్యిందట. కళ్లముందు టార్గెట్ కంటికి నిద్ర లేకుండా చేస్తోందట. కాస్త అటు ఇటు అయినా, ఇక కేబినెట్‌ బెర్తుకే ఎసరు తప్పదన్న సంకేతాలు కుదరుగా ఉండనివ్వడం లేదట. ఇంతకీ ఆ నలుగురు ఆమాత్యుల్లో ఎందుకీ దడ?

డిసెంబర్ లేదా జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో అధికార ప్రతిపక్షాలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ మరోమారు జిహెచ్ఎంసిపై గులాబీ జెండా ఎగరవేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కో డివిజన్ స్థాయిలో పెండింగ్ పనులపై, సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. మంత్రి కేటీఆర్ గత ఎన్నికల మాదిరిగానే ఈసారీ జిహెచ్ఎంసి ఎన్నికలను, అంతా తానై నడిపిస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు, నగర నేతలతో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. డివిజన్లలో పనితీరు బాగాలేదని 15 మంది కార్పొరేటర్లను హెచ్చరించి, పద్ధతి మార్చుకోమన్నారు. ఎన్నికల నాటికి ప్రజల ఫీడ్ బ్యాక్ లో మెరుగైన గ్రాఫ్ కనబడకపోతే, టికెట్ డౌట్ అన్నారు. ఈస్థాయిలో గ్రేటర్‌పై కేటీఆర్‌ దృష్టసారించారంటే, బల్దియా పోరు ఎంత ప్రతిష్టాత్మకమో అర్థమవుతోంది. ఇదే గ్రేటర్‌లో నలుగురు మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందట.

జిహెచ్ఎంసి పరిధిలో, రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు నలుగురు మంత్రులు. వీరికి బల్దియా ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మంత్రి మల్లారెడ్డి, సికింద్రాబాద్ పరిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ పరిధిలో హోం మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల పరిధిలోకి వచ్చే ఏరియాలో సబితా ఇంద్రారెడ్డిలకు, గ్రేటర్‌ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు ఎన్నికల సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నగరంలో పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు. కానీ లోలోపల మాత్రం కాస్త టెన్షన్‌ పడుతున్నారట మినిస్టర్స్.

2016 ఎన్నికల్లో గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ 99 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి ఒక్కో కార్పొరేటర్‌ చేరడంతో ఆ సంఖ్య 101కి పెరిగింది. ఈసారి వంద స్థానాలకు పైగా గెలవాలన్న టార్గెట్‌తో, టిఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు. అదే టార్గెట్‌ భాగ్యనగర మంత్రులను టెన్షన్ పెట్టిస్తోంది. అధినేత అంచనాలకు అనుగుణంగా పని చేయకపోతే, ఉన్న పోస్ట్ కాస్త ఊడిపోతుందన్న భయం పట్టుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో జిహెచ్ఎంసి లో 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి ఎన్నికలను సవాల్ గా తీసుకొని పని చేస్తుండటంతో, మంత్రి మల్లారెడ్డికి ఇబ్బందికరంగా మారింది. నగర శివార్లలో ప్రజా వ్యతిరేకతను అధిగమించి, మెరుగైన స్థానాలు గెలవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఒకటి రెండు తప్ప, దాదాపు అన్ని స్థానాలు గెలిచి సత్తా చాటింది టిఆర్ఎస్.

ఇక సికింద్రాబాద్ పరిధిలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గత గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటారు. అప్పుడు మంత్రి పద్మారావు, తలసాని ఇరువురూ కలిసి పనిచేసి, వారివారి అసెంబ్లీ నియోజకవర్గాల ఏరియాల్లో, మొత్తం కార్పొరేటర్ స్థానాలు గెలిచారు. అయితే ఈసారి శ్రీనివాస్ యాదవ్ ఒక్కడే మంత్రివర్గంలో ఉండడంతో, మొత్తం భారం ఆయన మీదనే పడనుంది. ఇక్కడ 40కి పైగా డివిజన్లు ఉండటంతో, గులాబీ పార్టీకి కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే మెజార్టీ స్థానాలు గెలిచి గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక్కడ బిజెపి నేతలను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఎదుర్కోవడం సవాల్‌గా మారింది.

పాత నగరం పరిధిలో mim, టిఆర్ఎస్, ఎన్నికల అవగాహనతో కలిసి పనిచేశాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ దోస్తీతో మజ్లిస్ పార్టీ 43 స్థానాలు గెలిచింది. ఈసారి సొంతగా కొన్ని స్థానాల్లో సత్తా చాటాలని భావిస్తోంది టీఆర్ఎస్. హోంమంత్రి మహమూద్ అలీ ఇప్పటికే పాతనగరంలో పర్యటిస్తూ, పార్టీ శ్రేణుల్ని ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల గ్రేటర్ డివిజన్ల బాధ్యతను, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

ఒకవైపు బీజేపీ దూకుడు మీద వుంటే, మరోవైపు కాంగ్రెస్ సైతం కాలుదువ్వుతోంది. దీంతో గ్రేటర్‌ పోరును ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదని టీఆర్ఎస్‌ పట్టుదలగా వుంది. గ్రేటర్‌లోని నలుగురు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించింది. వారివారి పరిధిలో పార్టీకి తిరుగులేని విజయాన్నందించాలని కేసీఆర్‌ కర్తవ్యబోధ చేశారట. అంతేకాదు, బల్దియా ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే, కేబినెట్‌ విస్తరణలో సీటు గల్లంతు అవుతుందన్న హెచ్చరిక సంకేతాలూ ఇచ్చారట గులాబీ అధినేత. దీంతో మినిస్టర్స్‌లో టెన్షన్‌ పెరుగుతోంది. అందుకే గల్లీగల్లీల్లో తెగ తిరిగేస్తున్నారు. చూడాలి, పార్టీ అధినేత నిర్దేశించిన లక్ష్యాన్ని మంత్రులు చేరుకుంటారో, చతికిలబడతారో.

Full View


Tags:    

Similar News