ముప్పై మందిలో ముక్కోటి ఆశలు రేపుతున్న ఆ మూడు పదవులు ఎవరికి?

Update: 2020-06-12 10:48 GMT

టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఆ పదవులు హాట్ కేక్ మూడు పదవుల కోసం ఏకంగా ముప్పై మంది పోటీ పడుతున్నారు. కొందరు నేతలు తమ పదవులు, తమకే కావాలని మారాం చేస్తుంటే, మరికొందరు ఈసారి ఎలాగైనా ఆ పోస్టులను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే వీరలెవల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరికివ్వాలా అని కసరత్తు చేస్తున్న గులాబీ దళాధిపతికి, నేతల ప్రదక్షిణలు, పైరవీలు తలనొప్పిగా మారాయి.

టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల గొడవ మొదలైంది. ఈ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతుండటంతో ఇన్ని రోజులు పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలంతా యాక్టివ్ అయ్యారు. ఎవరికి తోచిన దారిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా కారణంగా మిగతా పదవులు, పార్టీ పదవులు కూడా ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో, నేతలు ఈ పోస్టులపై కన్నేశారు. గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేతలతో సహా, ఇతర నేతలు కూడా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు రకరకాల మార్గాల్లో ట్రయల్స్ వేస్తున్నారు.

రానున్న ఒకటి రెండు నెలల తెేడాలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే మాజీ ఎంపీ కవితను ఫైనల్ చేయడంతో, గవర్నర్ కోటాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు సీఎం కేసీఆర్. ఈనెల 17కు మాజీ హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పదవి కాలం ముగుస్తుంది. ఆగస్టులో కర్నె ప్రభాకర్. ఇక కాంగ్రెస్ లో చేరి అనర్హత వేటుకు గురైన రాములు నాయక్ పదవీ కాలం కూడా ముగిసింది. రాములు నాయక్ అనర్హత వ్యవహారం హైకోర్టులో వున్నా, ఆయన పదవీ కాలం ముగిసింది కాబట్టి, ఈ ప్లేస్‌ను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు మూడు స్థానాలకు అభ్యర్థుల కోసం పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తుంటే, పదుల సంఖ్యలో ఆశావహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

పదవీ కాలం ముగుస్తున్న వారిలో ఎవరికి రెన్యువల్ అవుతుందనే ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్‌కు దగ్గరగా వుండే కర్నె ప్రభాకర్‌కు రెన్యువల్ అయ్యే అవకాశం వున్నట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డికి కూడా అవుతుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అప్పుడప్పుడు ఓపెన్‌గా కామెంట్స్ చేయడం ఆయనకు మైనస్ అని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పదవి ఇవ్వకపోతే రోజూ నాయిని చాలా విషయాలపై బహిరంగంగా మాట్లాడే అవకాశం వుంటుంది కాబట్టి, పదవి రెన్యువల్ కావొచ్చనే చర్చ కూడా వుంది. ఇక మూడో పదవి ఎవరిని వరిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

మూడు పదవుల కోసం ముప్పై మందికి పైగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెన్యువల్ వ్యవహారంపై ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదు కాబట్టి, ఆశావహులు గట్టిగా ట్రై చేస్తున్నారు. మహిళల కోటాలో తుల ఉమ, గుండు సుధారాణి, ఉమా మాధవ రెడ్డి ఇంకా కొంతమంది మహిళా నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పదవులు ఆశిస్తున్న నేతల్లో రంగారెడ్డి నేత క్యామ మల్లేష్, బస్వరాజు సారయ్య , సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఉద్యోగ సంఘాల మాజీ నేతలు దేవీప్రసాద్, స్వామిగౌడ్‌లతో పాటు ప్రగతి భవన్, కేసీఆర్ ఫాంహౌస్‌లో సీఎంకు దగ్గరగా ఉండే కొద్దిమంది కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ అధ్యక్షా అనే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

Full View


Tags:    

Similar News