ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచుకోట. కమ్యూనిస్టుల ప్రాబల్యానికి చెక్‌పెట్టి జెండా ఎగరేసింది ఖద్దరు పార్టీ. బలమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు తిరుగులేదు. అయితే, ఇప్పుడు తిరగమోత. ఖమ్మంలో మనుగడే ప్రశ్నార్థకంగా మారిందా? సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సొంత జిల్లాలో, కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి ఎలా దాపురించింది? కారణాలేంటి? కారకులెవరు?
ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది హస్తం పార్టీ. 10 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది సీట్లను హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ కూటమి. కానీ జిల్లాలో సరైన మార్గదర్శనం చేసే నేతలు లేకపోవడంతో, కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎంఎల్ఏలు వెంటనే కారెక్కారు. ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ హస్తం డీలా పడింది. ఇక ఆపార్టీ జిల్లాలో కోలుకుంటుందా...? ఉన్న క్యాడర్‌నైనా కాపాడుకుంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కాంగ్రెస్ హయాంలో, మంత్రి పదవులు అనుభవించిన నేతలు, ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. అసలు వారి పేర్లే వినిపించటం లేదు. కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాథుడే కరవయ్యాడనే ఆవేదన క్యాడర్ లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వెలుగు వెలిగిన హస్తరేఖ, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో క్రమంగా చెదిరిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో గతంలో ఎన్నడూలేని విధంగా పది అసెబ్లీ నియోజకవర్గాల్లో మధిర,పాలేరు, ఇల్లెందు, పినపాక,భద్రాచలం, కొత్తగూడెం ఆరుచోట్ల విజయం సాధించింది. వైరాలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. వీరితో పాటు సత్తుపల్లి, అశ్వారావుపేటలో కాంగ్రెస్ మద్దతు తో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో బాహుబలిగా నిలిచింది కాంగ్రెస్. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో, క్రమంగా హస్తం అస్తవ్యస్తమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే వచ్చిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్, సహకార ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెందింది. జిల్లాలో తన ప్రాభవాన్ని కోల్పోయింది కాంగ్రెస్.
వరుస ఓటములతో కాంగ్రెస్ క్యాడర్‌కు ఒక్కసారిగా నిరుత్సాహం అవహించింది. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో నామమాత్రంగా గెలిచింది. ప్రతిసారి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ తో పాటు దాని వ్యతిరేక పక్షాలు ఢీ అంటే ఢీన్నట్టుగా పోటీ వుండేది. ఈసారి గెలిచిన సొసైటీ అధ్యక్షులు సైతం డీసీసీబీ డైరెక్టర్ల స్థానాలకు కనీసం నామినేషన్లు వెయ్యలేని పరిస్థితి. నామినేషన్ల రోజున పోలీసులు అడ్డగించినందుకు, వెళ్లలేకపోయామని చేతులెత్తేశారు. జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా కూడా బరిలో నిలవలేకపోయింది. కనీసం ఎన్నికల్లో గెలిచేందుకు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా వ్యూహరచన చేయపోవడం, నాయకత్వలోపమని స్పష్టమవుతోంది. జిల్లా రాజకీయాల్లో వరుసగా పలు ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడినా, నాయకుల్లో వర్గాల పౌరుషం మాత్రం తగ్గడంలేదు.
జిల్లాలో బలమైన ప్రాంతాలు కూడా బలహీనంగా మారిపోవటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిర్వేదం కమ్ముకుంది. పార్టీలో నిలవలేక అధికార పార్టీ కారు ఎక్కుతున్నారు. ఇంకా కాంగ్రెస్ లో ఏముంది అని వాపోతున్నారు. బలమైన కేడర్‌కు నాయకత్వం ఉండాలని, అప్పుడే అధికార పక్షానికి తాము కూడా ఎదురొడ్డి పోరాడతామని కొందరు కాంగ్రెస్ నేతలంటున్నారు. ఉమ్మడి జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలహీనపడ్డంతో, జిల్లా రాజకీయాల్లో ఏకచ్ఛత్రాధిపత్యంగా ముందుకు సాగుతోంది అధికార టీఆర్‌ఎస్. వరుస ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సొంతం చేసుకుంటోంది. వామపక్షాలు కూడా స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లో అక్కడక్కడా గతంకంటే బలహీనపడ్డాయి. ఇలా విపక్షపార్టీలు దెబ్బతినడంతో జిల్లా రాజకీయాల్లో టీఆర్‌ఎస్ హవా నడుస్తోంది. రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా, కాంగ్రెస్ దీటుగా తలపడతుందో, డీలా పడుతుందో చూడాలి.